5జీ వచ్చేస్తున్న వేళ.. మీ ఫోన్ ను అందుకు తగ్గట్లు సెట్ చేసుకోవాలంటే?

Update: 2022-09-27 04:21 GMT
మహా అయితే మరో వారం.. లేదంటే రెండు వారాల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ నెట్ వర్కు వచ్చేయనుంది. ఇప్పుడున్న 4జీ మాదిరే.. 5జీలోనూ టారిఫ్ లు అలానే ఉండే అవకాశం ఉందన్న మాట జోరుగా వినిపిస్తోంది. సో.. 5జీలోకి మారటానికి ప్రాథమికంగా ఎలాంటి సమస్యా లేనట్లే. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఫోన్ తోనే. ఇప్పుడు వినియోగిస్తున్న 4జీ నెట్ వర్కుకు 5జీలోకి ఎలా మార్చుకోవటం అన్నది ప్రశ్న.

అక్టోబరు 1న దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ 5జీ సేవల్ని లాంఛనంగా స్టార్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సేవల్ని వెంటనే ప్రజలకు అందించేందుకు జియో.. ఎయిర్ టెల్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. వోడాపోన్ మాత్రం కాస్తంత టైం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. 5జీ అనుభూతిని కస్టమర్లకు అందించేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి.

మరి.. 5జీ నెట్ వర్కు సౌలభ్యాన్ని వినియోగదారులు పొందాలంటే వారు సైతం కొన్ని పనులు చేయాల్సి ఉంటుందని చెబుతన్నారు. ఇంతకీ అసలు 5జీ అవసరమా? అంటే.. వేగంగా పనులు జరగాలంటే 5జీ అవసరమే. మనకు మొదట్లో సుపరిచితమైన 2జీతో పోలిస్తే 4జీ వచ్చాక జీవన ప్రయాణం ఎంత వేగంగా మారిందో తెలిసిందే. అంతకు మించి అన్నట్లుగా ఉంటుంది 5జీ నెట్ వర్కు.

వేగవంతమైన ఇంటర్నెట్. ఎలాంటి బఫరింగ్ లేకుండా హైక్వాలిటీ వీడియోలను స్ట్రీమ్ చేయటంతో పాటు.. తక్కువ సమయంలో హై గ్రాఫిక్ గేమ్స్ ను  ప్లే చేసుకునే వీలు ఉంటుంది. ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉన్న 4జీ కంటే 5జీ ఏకంగా 7 నుంచి 10 రెట్లు అధిక స్పీడ్ తో ఉంటుందన్నది మర్చిపోకూడదు. ఇంతకూ మీ ఫోన్ 5జీకి సపోర్టు చేస్తుందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే.. మీ ఫోన్ నెట్ వర్కు సెట్టింగ్స్ లో కానీ. సిమ్ కార్డు సంబంధించిన ప్రిఫర్డ్ నెట్ వర్కును చూస్తే.. అందులో 5జీ ఉంటే.. మీ ఫోన్ దానికి సపోర్టు చేస్తున్నట్లుగా గుర్తించాలి.

ప్రపంచ వ్యాప్తంగా 5జీ నెట్ వర్కులు వినియోగదారులకు 1జీబీపీఎస్ కు మించిన స్పీడ్ ను అందిస్తున్నాయి. భారతీయ టెల్కోలు సైతం అత్యధిక డౌన్ లోడ్.. అప్ లోడ్ వేగాన్ని అందించేందుకు మాట ఇవ్వటం తెలిసిందే.

మీ ఫోన్ 5జీ నెట్ వర్కుకు సూట్ అయ్యేది అయితే.. ఈ నెట్ వర్కు కోసం ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ.. మీ ఫోన్ 5జీ నెట్ వర్కుకు సపోర్టు చేయని పక్షంలో మాత్రం కొత్త ఫోన్ కొనుగోలు చేయక తప్పదు. అయితే.. కొన్ని కంపెనీలు 5జీ వినియోగదారులకు పనికి వచ్చేలా రూ.10వేల నుంచి రూ.15వేల మధ్యలో కూడా 5జీ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. కొత్త ఫోన్ కొనేవారు 5జీకి సంబంధించిన కొన్ని అంశాల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అవేమంటే..
-  5జీ స్పెక్ట్రాంలో మూడు బ్యాండ్స్ ఉన్నాయి. 1. లో బ్యాండ్ 2. మిడ్ బ్యాండ్ 3. హై బ్యాండ్
-  లో బ్యాండ్ 700ఎంహెచ్ జెడ్ స్పెక్ట్రామ్ కలిగి ఉంటుంది. దీన్నే ఎన్28గా కూడా వ్యవహరిస్తారు. ప్రతి 5జీ ఫోన్ ఎన్78ను సపోర్టు చేస్తుంది.
-  బాగా ఖరీదైన ఫోన్లలో మాత్రమే ఎన్28 ఉంటుంది. 700 ఎంహెచ్ జెడ్ అనేది స్టాండ్ అలోన్ 5జీ సేవలకు మాత్రమే ఉద్దేశించింది. రిలయన్స్ జియో మాత్రమే దీన్ని అందించగలదు.
-  హై బ్యాండ్ అనేది 26జీహెచ్ జెడ్ స్పెక్ట్రామ్ ను కలిగి ఉంటుంది. దీన్ని ఎంఎంవేవ్ గా.. ఎన్258గా వ్యవహరిస్తారు. చాలా కొద్ది ఫోన్లు మాత్రమే ఎన్258 ఫోన్లు సపోర్టు ఇస్తాయి. ఈ కనెక్టివిటీ 5జీ స్టార్టింగ్ లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News