సెంటిన‌లీస్‌ ను లేపేసేందుకు బ్రిటిష‌ర్లు ప్ర‌య‌త్నించార‌ట‌!

Update: 2018-11-30 04:12 GMT
సెంటిన‌లిస్ ఆదివాసీలు...వీరి గురించి ఇప్పుడు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అమెరికా క్రైస్తవమత ప్రచారకుని చంపి పూడ్చిపెట్టిన ఘటనద్వారా అండమాన్‌ కు చెందిన ఈ తెగ‌పై మరోసారి ప్రపంచం దృష్టిపడింది. వీరి గురించి ఎన్నో ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. అలా తాజాగా ఓ సంచ‌ల‌న అంశం వెలుగులోకి వ‌చ్చింది. అదే ఈ తెగ మొత్తంను లేపేయాల‌నే స్కెచ్‌. వివ‌రాల్లోకి వెళితే..ప్రపంచం పొడగిట్టని సెంటినలీస్‌ తో ఎలా వ్యవహరించాలనేది పెద్ద చర్చాంశమైంది. నార్త్ సెంటినలీస్ దీవిపై ఉండే ఈ తెగవారు ఎవరితోనూ కలవరు. ఎవరినీ తమ దరికి రానీయరు. ఒకవేళ ఎవరైనా తెగించి వెళ్తే వారికి మత ప్రచారకునికి పట్టిన గతే పడుతుంది. చాలాకాలంగా వారితో సంబంధాలకు ప్రయత్నించి కుదరకపోవడంతో వారిమానాన వారిని వదిలేసే విధానాన్ని భారత్ అనుసరిస్తోంది.

అయితే, వ‌ల‌సాధిప‌త్యంతో ఉన్న బ్రిటిష్ వలసపాలకులు వీరిపై కుట్ర ప‌న్నారు. మొదట తమలో కలిపేసుకునేందుకు ప్రయత్నించారు. ఎంతకూ కుదరకపోవడంతో ఇక అందరినీ చంపెయ్యాలనుకున్నారు. ఈ చరిత్ర అంతా 1899లో అక్కడి బ్రిటిష్ అధికారి ఎంవీ పోర్ట్‌మన్ రాసిన పుస్తకంలో ఉంది. 1896లో అడవుల్లోకి వెళ్లిన ఖైదీలపై జరవా తెగవారు బాణాలతో దాడిచేశారు. ఆ దాడిలో ఒకరు చనిపోగా - మరోవ్యక్తి గాయపడ్డాడు. హంతకుల కోసం జరిపిన గాలింపు ఎలాంటి ఫలితాలూ ఇవ్వలేకపోయింది. అప్పటికి అక్కడి దీవుల గురించి కానీ, వాటిమీద నివసించే తెగల గురించి కానీ పెద్దగా ఎవరికీ అవగాహన లేదు. దాంతో మొత్తం అన్ని తెగలను చంపేద్దామని అనుకున్నారట. కానీ బ్రిగేడియర్ జనరల్ కమిన్స్ అనే అధికారి మాత్రం ఇది అర్థరహితమైన ఆలోచన అన్నారట. పైగా ఇది సాధ్యం కాకపోవచ్చని కూడా ఆయన హెచ్చరించారట.

కాగా, పోర్ట్‌ మన్ పుస్తకం వెలువడ్డ తర్వాత కొన్నాళ్లకు ఆర్థర్ కానన్ డాయిల్ సైన్ ఆఫ్ ఫోర్ అనే పుస్తకం రాశారు. అందులో అండమానీస్‌ ను క్రూరులుగా చిత్రించారు. వారిని చూస్తేనే జడుసుకుని నిద్రపోరట. పాశవికత - క్రౌర్యం వారి ముఖంలో తాండవిస్తుందని డాయిల్ అభివర్ణించారు. అప్పటికే అండమాన్‌ ను పూర్తిగా నేరస్థుల కాలనీగా ఉపయోగించడం మొదలైంది. నాగరికులతో కలిసిపోయిన వందలాది మంది అండమానీయులు బయటివారు అంటించిన సిఫిలిస్ - మీజిల్స్ - ఇన్‌ ప్లూయెంజా వంటి వ్యాధులవల్ల వందల సంఖ్యలో చనిపోయారు. అలా చ‌నిపోగా మిగిలిన వారిలో ఒక తెగే సెంటిన‌లీస్‌!


Tags:    

Similar News