జయహో బీసీ సభలో జనాలు పరుగులు తీశారెందుకు?

Update: 2022-12-08 03:12 GMT
బెజవాడ మహానగరం నడిబొడ్డున ఏపీ అధికారపక్షం వైసీపీ ఒక భారీ బహిరంగ సభను నిర్వహించటం తెలిసిందే. జయహో బీసీ పేరుతో నిర్వహించిన ఈ సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కావటం ఒక ఎత్తు అయితే.. ముఖ్యమంత్రి మాట్లాడే సమయంలో సభికులు పలువురు స్టేడియం నుంచి బయటకు పరుగులు తీయటం కనిపించింది. దీన్ని విపక్షాలు.. వ్యతిరేకవర్గాలు హైలెట్ చేశాయి. దీనికి ఎవరికి వారు వారికి తోచిన రీతిలో అర్థాలు తీయటం మొదలుపెట్టారు.

నిజంగానే ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్న సమయంలో జనం పరుగులు తీశారా? అసలు అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం వెతికినప్పుడు అసలు విషయాల్ని వదిలేసి.. కొసరు విషయాల్ని హైలెట్ చేయటం కనిపిస్తుంది. ఈ సభ కోసం జనాల తరలింపు తొమ్మిది గంటలకే మొదలైంది. అంటే.. ఊళ్ల నుంచి వచ్చే వారు ఉదయం ఏడెనిమిది గంటలకే బయలుదేరటం.. వారు ఉదయానకే స్టేడియంలోకి వచ్చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయానికి వస్తే.. ఆయన మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి వచ్చారు. మరింత సరిగ్గా చెప్పాలంటే పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు వచ్చారు. అంటే అప్పటికే మూడు గంటలకు పైనే జనాలు వెయిట్ చేశారన్న మాట. ఎండ.. ఉక్కపోత కారణంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే.. ఉదయం పన్నెండు గంటల వేళకు ఆకలి కావటం.. అదే సమయంలో జగన్ ప్రసంగం మొదలైంది. ఎవరు పుట్టించారో తెలీదు కానీ.. భోజనాలు పెడుతున్నారంటూ మొదలైన ప్రచారంతో అందరూ ఆబగా అటువైపు వెళ్లటంతో గందరగోళం ఏర్పడింది.

ముందే.. భోజనాలు సీఎం ప్రసంగం తర్వాతే అన్న విషయాన్ని క్లియర్ గా చెప్పినా.. లేదంటే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే అని చెప్పినా పరిస్థితి మరోలా ఉండేది. లేదంటే.. భారీగా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చే వేళలోనే ఫుడ్ పాకెట్ ఇచ్చేసి.. భోజనాల గురించి ప్రస్తావిస్తే బాగుండేది.

అదేమీ లేకపోవటం.. మధ్యాహ్నం అయ్యేసరికి ఆకలి కావటం.. సీఎం జగన్ మాట్లాడే సమయంలోనే భోజనాలు మొదలయ్యాయి అన్న మాట సభికుల్ని సభలో ఉండకుండా చేసినట్లుగా తెలుస్తోంది. జరిగింది ఇదైతే.. జగన్ స్పీచ్ కు భయపడి జనాలు పరుగులు తీసినట్లుగా ప్రచారం సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News