రాహుల్ ఆ పెద్దాయ‌న్ని అవ‌మానించార‌ట‌!

Update: 2019-02-10 09:02 GMT
ఎస్‌.ఎం.కృష్ణ‌.. కాంగ్రెస్ కురువృద్ధుడు. ఇందిరా గాంధీకి, ఆమె త‌న‌యుడు రాజీవ్ గాంధీకి అత్యంత స‌న్నిహితుడు. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. విదేశాంగ మంత్రి ప‌ద‌వి చేప‌ట్టారు. గ‌వ‌ర్న‌ర్ గానూ విధులు నిర్వ‌ర్తించారు. సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో కాంగ్రెస్ కు ఎనలేని సేవ‌లందించారు. ఆ పార్టీలో 46 ఏళ్ల‌పాటు కొన‌సాగారు. ఆపై 2017లో అనూహ్యంగా కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు.

తాజాగా ఈ పెద్దాయ‌న తాను కాంగ్రెస్ ను వీడ‌టం వెనుక గ‌ల కార‌ణాల‌ను వెల్ల‌డించారు. యూపీఏ హ‌యాంలో రాహుల్ గాంధీ ఎలా వ్య‌వ‌హ‌రించేవారు తెలియ‌జేశారు. మ‌ద్దూరులో బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి కృష్ణ ప్ర‌సంగించారు. కాంగ్రెస్ లో ఉన్న‌ప్పుడు రాహుల్ గాంధీ త‌న‌ను అవ‌మానించార‌ని చెప్పారు. 80 ఏళ్ల వ‌య‌సుకు చేరుకున్న నేత‌లెవ‌రూ మంత్రి ప‌ద‌వులు చేప‌ట్ట‌వ‌ద్దంటూ రాహుల్ ఆదేశాలు జారీ చేయ‌డం వ‌ల్లే తాను కాంగ్రెస్ ను వీడిన‌ట్లు వెల్ల‌డించారు.

మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు రాహుల్ ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల్లో ప‌దే ప‌దే జోక్యం చేసుకునేవార‌ని కృష్ణ ఆరోపించారు. అప్ప‌ట్లో పార్టీ అధ్య‌క్షుడిగా కూడా రాహుల్ లేర‌ని గుర్తుచేశారు. మ‌న్మోహ‌న్ ప్ర‌ధాని అయిన‌ప్ప‌టికీ చాలా విష‌యాలు ఆయ‌న‌కు తెలియ‌కుండానే జ‌రిగేవ‌ని చెప్పారు. 2009-14 మ‌ధ్య తాను విదేశాంగ మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో పార్టీలో ప‌రిస్థితులు ఏమాత్రం బాగో లేవ‌ని తెలిపారు.

మిత్ర ప‌క్షాల‌పై కాంగ్రెస్ కు అప్ప‌ట్లో ఏమాత్రం నియంత్ర‌ణ లేద‌ని కృష్ణ చెప్పారు. స‌మ‌ర్థవంత‌మైన నాయ‌క‌త్వం లేక‌పోవ‌డంతో 2జీ స్పెక్ట్రం, కామ‌న్ వెల్త్ కుంభ‌కోణం, బొగ్గు కుంభ‌కోణం వంటివి చోటుచేసుకున్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఎస్‌.ఎం.కృష్ణ ఆరోప‌ణ‌లు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్‌కు ప్ర‌తికూలంగా మారే అవ‌కాశ‌ముంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ లోని సీనియర్ల‌కు ఆయ‌న మాట‌ల‌ను రాహుల్ వైఖ‌రిపై హెచ్చ‌రిక‌లుగా వారు అభివ‌ర్ణిస్తున్నారు.

Tags:    

Similar News