నోటిఫికేషన్ విడుదలైన వేళే.. మెజార్టీ ఎంతో చెప్పేసిన ఏపీ మంత్రి

Update: 2021-03-16 17:13 GMT
స్థానిక ఎన్నికల ఫలితాలు పూర్తి అయ్యాయో లేదో.. మున్సిపల్ ఎన్నికలు వచ్చేయటం.. తాజాగా వెల్లడైన ఫలితాల్లో ఏపీ అధికారపక్షం సంచలన విజయాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు.. సీమ.. కోస్తో.. ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎక్కడైనా సరే వైసీపీకి తిరుగులేదన్న రీతిలో ఫలితాలు వెల్లడయ్యాయి.

తాజాగా సాధించిన ఘన విజయం జోష్ లోనే వైసీపీ ఉండగా.. అందరు ఎదురుచూస్తున్న తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావటం తెలిసిందే. సాధారణంగా నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అభ్యర్థి ఎంపిక.. గెలుపు మీద అందరూ ఫోకస్ పెడతారు. అందుకు భిన్నంగా.. నోటిఫికేషన్ విడుదలైందో లేదో ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర రీతిలో రియాక్టు అయ్యారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో 3 లక్షల వరకు మెజార్టీ సాధిస్తామన్న నమ్మకం తనకుందని చెప్పారు. తిరుపతి లోక్ సభ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలు గెలిచామని.. భారీగా గెలుపొందిన మీదట.. 3లక్షల వరకు మెజార్టీ రావటం పెద్ద విషయం కాదన్న మాట ఆయన నోటి నుంచి రావటం గమనార్హం. ఎన్నికల్లో సాధిస్తున్న ఘన విజయాలన్ని కూడా జగన్ సుపరిపాలన వల్లే అంటూ ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని జెడ్పీ.. ఎంపీటీసీ ఎన్నికల్ని వెంటనే పెట్టాలని తాను కోరుతున్నానని చెప్పారు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి.. జగన్ సర్కారుకు మధ్య పెద్ద ఎత్తున లొల్లి జరగటం తెలిసిందే. అప్పట్లో ఎన్నికలు వద్దంటే వద్దన్న జగన్ అండ్ కో తాజాగా మాత్రం వెంటనే బ్యాలెన్సు ఎన్నికల్ని వెంటనే నిర్వహించాలని కోరటం విశేషంగా చెప్పాలి. గెలుపు తెచ్చే ధీమా ఇలానే ఉంటుంది మరి.


Tags:    

Similar News