భారత్ లో ఎన్నడు ఫుట్ బాల్ భాగ్యం..? అంతర్జాతీయ స్థాయికి ఎందుకంత దూరం..?

Update: 2022-12-21 02:30 GMT
''మనం ఫుట్ బాల్ ప్రపంచ కప్ నిర్వహించగలం'' మూడు రోజుల కిందట ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. అర్జెంటీనా కప్ గెలుస్తుందా..? మెస్సీ కల నెరవేరుతుందా..? ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె ఎంత బాగా ఆడాడు? అబ్బ.. ప్రపంచ కప్ ఎంత అద్భుతంగా సాగింది..? ఇవీ నిన్నటివరకు సగటు భారతీయుడి అభిప్రాయాలు. అంతేకాని.. క్రికెట్ లో మన టీమిండియాలాగా ఫుట్ బాల్ లోనూ ఓ గొప్ప జట్టు ఉంటేనా? మనం కూడా ప్రపంచ చాంపియన్ అయితేనా? అనే ఊహనే రాలేదు. భారత్ లో ఫుట్ బాల్ వెనుకబాటుకు అనేక కారణాలు..

50 ఏళ్ల కిందటివరకు ఇలా..

ఫుట్ బాల్ లో భారత్ కు అసలు ప్రమేయం లేదా..? మనం ఓ అనామక దేశమా? అంటే అదేం కాదు.. ఓ 50 ఏళ్ల కిందటి దాకా ఫుట్ బాల్ లో మన జట్టు మోస్తరు ప్రదర్శనే కనబర్చింది. ఆ ఊపును అలా కొనసాగించి ఉంటే ఈపాటికి గొప్ప జట్టు కాకపోయినా ఓ మోస్తరు ప్రతిభావంతమైన జట్టుగా పేరొచ్చేది. కానీ, 1971 నుంచి భారత ఫుట్ బాల్ తిరోగమనం ప్రారంభమైంది. 1950లో బ్రెజిల్ ఆతిథ్యం ఇచ్చిన ప్రపంచకప్‌లో పాల్గొనాలని భారత్‌కు ఆహ్వానం లభించినా పలు కారణాలతో వెళ్లలేదు. ఆ తర్వాత ఓ పదిహేనేళ్లు అంటే 1970 వరకు ఫుట్ బాల్ బాగానే పుంజుకుంది. 1956 మెల్ బోర్న్ ఒలింపిక్స్ లో మన జట్టు ఫుట్ బాల్ లో 4వ స్థానంలో నిలిచి సంచలనం రేపింది. ఇక 1964 ఆసియా కప్ లో రన్నరప్ గా నిలిచింది. 1962 జకార్తా ఆసియా క్రీడల్లో రహీమ్‌ శిక్షణలో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకం సాధించింది. ఈ తర్వాత ఆట గతి తప్పింది. అసలిప్పుడు టాప్ 100 ర్యాంకులో చోటుకోసం పోటీ పడాల్సిన పరిస్థితి.

ఈశాన్యం.. పశ్చిమంలోనే..

భారత్ లో ఫుట్ బాల్ ప్రతిభ అంతా ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, కేరళకే పరిమితం అన్నట్లుగా ఉంటోంది. సిక్కింకు చెందిన బైచుంగ్ భూటియా, కేరళ వాసి ఐఎం విజయన్ వంటి వారు తప్ప మరొక గొప్ప ఆటగాడు లేడా? అన్నట్టుంది. అయితే, ఈ తప్పు ఆటగాళ్లది కాదు. పాలకులది. ప్రాచుర్యం ఉన్న క్రీడలను ప్రోత్సహించడంలో వారి విధాన లోపమే ఈ పరిస్థితికి కారణం. ఫుట్ బాల్ ను కెరీర్ గా ఎంచుకుంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుందన్న భావనతో యువత దూరంగా ఉంటున్నారు. ఇక ఫుట్ బాల్ అనేది అత్యంత ఫిట్ నెస్ అవసరమైన క్రీడ. ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా జరిగితే కెరీర్ ముగిసే అవకాశం ఉంటుంది. శారీరక శ్రమతో పాటు టెక్నికల్ అనాలసిస్ కూడా ముఖ్యమే. సొంతంగా గొప్పగా ఆడితే సరిపోదు ప్రత్యర్థుల ఆటను కూడా తెలుసుకోవాలి. జిమ్ లు, వీడియో విశ్లేషణ పరికరాలు, ఆటగాళ్ల డైట్ వంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. అయితే, భారత్ లో ఫుట్ బాల్ విషయంలో ఇప్పుడిప్పుడే మార్పులు కనిపిస్తున్నాయి. ఇది శుభ సూచకం.

చిన్న దేశాలు చురుగ్గా..

మన దేశంలోని ఒక రాష్ట్రం అంత కూడా లేని జపాన్, జిల్లా అంత కూడా ఉండని మొనాకో, హైదరాబాద్ జనాభాలో పావు వంతు కూడా లేని ఖతర్ ఫుట్ బాల్ లో తమ ముద్ర చాటుతున్నాయి. ఆఖరికి గత 25 ఏళ్లలో జపాన్, దక్షిణ కొరియా ఎంతో ప్రగతి సాధించాయి. జపాన్ ఈ ప్రపంచ కప్ లో ఎలా ఆడిందో అందరూ చూశారు. కొంత లక్ కలిసొస్తే మరింత ముందుకెళ్లేందుకు ఆ జట్టుకు అవకాశం దక్కేది. కానీ, మనం కనీసం ఫుట్ బాల్ ప్రపంచ కప్ నకు అర్హత కూడా సాధించలేకపోతున్నాం. దాదాపు 150 కోట్ల జనాభా ఉన్న మనం 92 ఏళ్ల ఫుట్ బాల్ ప్రపంచ కప్ చరిత్రలో ఏనాడూ నేరుగా క్వాలిఫై కాలేకపోయాం. క్రికెట్ దెబ్బేస్తున్నదా? భారత్ లో క్రికెట్ ఓ మతంగా మారిపోయింది. కచ్చితంగా చెప్పాలంటే ఫుట్ బాల్, క్రికెట్ ఓ యాభై ఏళ్ల కిందట రెండూ సమ ఆదరణతో, ప్రమాణాల పరంగా సమంగా ఉండేవి.

కానీ, ఇప్పుడు క్రికెట్ ముందుకు ఎక్కడికో వెళ్లిపోయింది. ఫుట్ బాల్ వెనక్కు పోయింది. క్రికెట్.. ఫుట్ బాల్ ను తొక్కేసిందా? అంటే ఓ విధంగా ఔననే చెప్పాలి. పాలకులు రెండింటినీ సమంగా ప్రోత్సహించకపోవడం కూడా ప్రధాన కారణమే. ఐపీఎల్ వచ్చాక క్రికెట్ మరింత క్రేజీగా మారి.. డబ్బుమయం అయిపోింది. ఫుట్ బాల్ ఆడితే డబ్బు రాదని తెలిసి చాలా మంది పిల్లలు క్రికెట్ వైపు అడుగులు వేస్తున్నారు. మరోవైపు ఫుట్ బాల్ లో21 ఏళ్ల వయసులో భారత ప్లేయర్లు ప్రొఫెషినల్ గా మారుతున్నారు. ఫుట్ బాల్ అనేది శారీరక శ్రమతో కూడుకున్నది. ఇతర దేశాల్లో 16 నుంచి 18 ఏళ్ల వయసులోనే ప్రొఫెషినల్ ఫుట్ బాల్ ప్లేయర్లుగా మారుతుంటే.. ఇండియాలో మాత్రం 21 ఏళ్లుగా ఉంది. తాజాగా జరిగిన ఖతర్ ప్రపంచకప్ లో స్పెయిన్ కు చెందిన గావి వయసు కేవలం 18 ఏళ్లు.

ఖాళీ మైదానాల్లో మ్యాచ్ లు ''మేం ఆడుతుంటే చూసేవాళ్లు లేరు. ఎందుకు ఆడుతున్నామా? అనిపిస్తుంటుంది. స్టేడియంకు వచ్చి తమకు మద్దతు పలకండి'' '' ఇదీ సికింద్రాబాద్ లో పుట్టి అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల్లో ఒకడిగా పేరొందిన సునీల్ ఛెత్రి ఆవేదన. మన దేశంలో మ్యాచ్ లు ఖాళీ స్టేడియాల్లో జరుగుతుంటాయి. అందుకనే సునీల్ ఛెత్రి అభిమానులను వేడుకున్నాడు. అంతెందుకు..? ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ సూపర్ లీగ్ టోర్నీ మ్యాచ్ లు ఖాళీ స్టేడియాల్లో జరుగుతున్నాయి. 1983 ప్రపంచకప్ ట్రోఫీని గెలవడంతో దేశంలో ఒక్కసారిగా క్రికెట్ కు ఎనలేని క్రేజ్ వచ్చింది. సచిన్, గంగూలీ, ద్రవిడ్, ధోని, యువరాజ్ సింగ్ లాంటి ప్లేయర్లు క్రికెట్ కు మరింత వైభవాన్ని తీసుకువచ్చారు. అయితే ఫుట్ బాల్ లో మాత్రం భారత్ చెప్పుకోదగ్గ గెలుపును సాధించలేకపోయింది. కనీసం ఆసియా కప్ ను కూడా గెలవడంలో సక్సెస్ కాలేదు.

క్రొయేషియా కోచ్ రాత మార్చేనా...?

క్రికెట్ లో లాగా వందల కోట్లు వెచ్చించి మౌలిక వసతులు, కోచ్ లను తీసుకురాలేకపోయినా.. ఫుట్ బాల్ కు ప్రభుత్వాలు కాస్తంతయినా ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే మన జట్టు ప్రపంచ ప్రమాణాలు అందుకోగలదు. కాగా, భారత ఫుట్ బాల్ లో ఇప్పుడిప్పుడే మార్పులు మొదలయ్యాయి. క్రొయేషియా కోచ్ ఇగోర్ స్టిమాక్ పర్యవేక్షణలో భారత్ నిలకడైన ప్రదర్శన చేస్తుంది. 2026లో జరిగే ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ లో 48 జట్లు పాల్గొనే అవకాశం ఉండటంతో మెగా ఈవెంట్ కు అర్హత సాధించడానికి భారత్ కు ఒక మంచి అవకాశం వచ్చింది. వచ్చే రెండేళ్లు భారత్ ఫుట్ బాల్ కు అత్యంత ముఖ్యమైన రోజులు అని చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News