పెద్దారెడ్డి ఎక్కడ ఫెయిలయ్యాడు ?

Update: 2021-03-15 11:01 GMT
కేతిరెడ్డి పెద్దారెడ్డి...తాడిపత్రి వైసీపీ ఎంఎల్ఏ. మొన్నటి ఎన్నికల్లో తాడిపత్రిలో వైసీపీ తరపున పోటీ చేసిన పెద్దారెడ్డి టీడీపీ అభ్యర్ధి జేసీ ప్రభాకర్ రెడ్డిపై విజయం సాధించారు. తాడిపత్రిలో దశాబ్దాల తర్వాత జేసీల హవాకు బ్రేకులు వేసిన నేతగా చరిత్ర సృష్టించారు. అలాంటి పెద్దారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తాడిపత్రి మున్సిపాలిటిలో టీడీపీ గెలిచింది. ఇక్కడ తెలుగుదేశంపార్టీ గెలుస్తుందని ఎవరు అనుకోలేదు.

అయితే ప్రభాకర్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించటంతో టీడీపీ గెలుపు సాధ్యమైంది. అదేమిటంటే స్వయంగా ప్రభాకర్ రెడ్డే ఓ వార్డులో కౌన్సిలర్ గా పోటీచేశారు. ఎంఎల్ఏగా పనిచేసిన నేత కౌన్సిలర్ గా పోటీ చేయటం ఏమిటని చాలా మంది అనుకున్నారు. అయితే కౌన్సిలర్ గా పోటీచేయటం వల్ల మిగిలిన నేతలకు మానసిక స్ధైర్యాన్ని ఇచ్చినట్లయ్యింది.

ప్రభాకర్ పోటీలో ఉన్న కారణంగా మొత్తం టీడీపీ క్యాడర్ అంతా ప్రచారంలోకి దిగింది. దాంతో నేతలంతా కలిసి కట్టుగా ఎన్నికలను ఎదుర్కొన్నారు. జేసీ కూడా 24వ వార్డులో కౌన్సిలర్ గా గెలిచారు. తాను గెలవటమే కాకుండా ఇతరులను కూడా గెలిపించుకోవటంతోనే మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో పడింది. సరే జేసీ వర్కవుట్ చేసింది బాగానే ఉంది మరి పెద్దారెడ్డి ఎక్కడ ఫెయిలయ్యారు ?

గడచిన రెండేళ్ళుగా ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు జనాలకు అందుతున్నాయి. ఈ కారణంగానే రాష్ట్రంలోని 75 మున్సిపాలిటిల్లో 73 మున్సిపాలిటిలు వైసీపీ ఖాతాలో పడ్డాయి. రాష్ట్రమంతా అమలవుతున్న పథకాలే తాడిపత్రిలో కూడా అమలవుతున్నాయి. అయినా జనాలు టీడీపీని ఎందుకు ఆధరించారు ?

ఎందుకంటే బహుశా ఎంఎల్ఏ మీద వ్యతిరేకత పెరిగిపోయిందా ? లేకపోతే నిర్లక్ష్యంగా ఉన్నారా అన్నదే తెలియటంలేదు. పార్టీ వర్గాల ప్రకారమైతే పెద్దారెడ్డి నిర్లక్ష్యం వల్లే వైసీపీ ఓడిపోయిందంటున్నారు. దానికితోడు ఈమధ్యనే జేసీ ఇంటిమీదకు పెద్దారెడ్డి దాడి చేయటం లాంటి అనేక ఘటనలతో ఎంఎల్ఏపై వ్యతిరేకత కూడా మొదలైందట. నిర్లక్ష్యం+దూకుడు కలిపి వైసీపీ ఓటమికి కారణమైందంటున్నారు.


Tags:    

Similar News