విశాఖ‌ప‌ట్నం పేరెలా వ‌చ్చింది..? ప‌దుల సంఖ్య‌లో ఉదాహ‌ర‌ణ‌లు.. ఏది నిజం?

Update: 2021-03-05 09:30 GMT
ప్ర‌తి గ్రామానికీ ఓ పేరు ఉంటుంది.. ప్ర‌తి పేరు వెనకా ఓ చ‌రిత్ర ఉంటుంది.. అయితే.. కొన్ని చ‌రిత్ర‌ల‌కు సాక్ష్యాలు, ఆధారాలు ఉంటాయి. మ‌రికొన్నింటికి అందుబాటులో ఉండ‌వు. ఈ విశాఖ‌ప‌ట్నం విష‌యానికి వ‌స్తే మాత్రం.. ఒక‌టీ రెండు కాదు, ఎన్నో పేర్లు వాడుక‌లో ఉన్నాయి. నేటి వైజాగ్ లేదా విశాఖ‌ప‌ట్నంగా మార‌డానికి ముందు ఈ ప్రాంతాన్ని పరిప‌రి విధాలుగా పిలిచారు. అవేంటీ..? వాటి వెనకున్న చరిత్రేంటీ.. ఆ చ‌రిత్ర‌కు ఉన్న ఆధారాలేంటీ? అన్న‌ది చూద్దాం.

కులోత్తుంగ ప‌ట్నంః విశాఖ ప్రాంతాన్ని 11వ శ‌తాబ్దంలో కులోత్తుంగ చోళుడు అనే రాజు పాలించాడు. దీంతో ఈ ప్రాంతానికి కులోత్తుంగ ప‌ట్నం అనే పేరు పెట్టాడు ఆ రాజు. తంజావూరు నుంచి కులోత్తుంగ ప‌ట్నం వ‌ర‌కు ఆయ‌న రాజ్యం ఉండేది. అయితే.. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత ఈ పేరు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయింది. ఈ విష‌యానికి చ‌రిత్ర‌కారులు ధృవీక‌రించారు.

ఇశాక్ః పురాత‌న కాలంలో స‌ముద్రాల మీద ప్ర‌యాణాలు విరివిగా సాగేవి. అయితే.. స‌ముద్ర ప్ర‌యాణానికి వెళ్లిన వారు అంతా మంచే జ‌ర‌గాల‌ని దేవుడిని పూజించేశారు. అర‌బ్ వ్యాపారుల హ‌వా కొన‌సాగిన కాలంలో ఇశాక్ అనే సూఫీ గురువును ప్రార్థించేవారు. విశాఖ‌ప‌ట్నంలోనూ ఈ ఇశాక్ ద‌ర్గా ఉంది. ఈ పేరుమీద‌నే విశాఖ ప‌ట్నంగా మారి ఉండొచ్చ‌ని అంటారు. ఈ ద‌ర్గాను సుమారు 800 సంవ‌త్స‌రాల క్రితం నిర్మించారు.

విశాఖ‌, విశాఖ వ‌ర్మః ఈ ప్రాంతాన్ని విశాఖ అనే బౌద్ధ రాణి, విశాఖ వ‌ర్మ అనే రాజు కూడా పాలించాడ‌ని క‌థ‌లు ఉన్నాయి. వీరి పేరు మీద‌నే ప్రాంతానికి విశాఖ‌ప‌ట్నం అని వ‌చ్చిందంటారు కొంద‌రు. అయితే.. వీటికి ప‌క్కా ఆధారాల్లేవు.

బ్రిటీష్ వైజాగ‌ప‌టంః బ్రిటీష్ వారు ఇండియాకు వ‌చ్చే నాటికే విశాఖ‌ప‌ట్నం అనే పేరు ఉంది. అయితే.. ఇంగ్లీష్ లో స‌రిగా ప‌లేక‌పోవ‌డం వ‌ల్ల వారు. వైజాగ‌ప‌టం అని పిలిచేవారు. బ్రిటీష్ రికార్డులు అన్నిట్లోనూ ఇదే పేరు ఉంది. ఈ విధంగా వైజాగ్ అనే ప‌దం వాడుక‌లో వ‌చ్చింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

విశాఖ శాస‌నంః తూ.గో. జిల్లా ద్రాక్షారామంలోని భీమేశ్వ‌ర స్వామి గుడిలో విశాఖ పేర‌కు సంబంధించి తొలి ఆధారం ల‌భించింది. 11వ శ‌తాబ్దం నాటి శాస‌నం ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది. విశాఖ నుంచి వెళ్లిన ఓ వ్యాపారి.. ఆ గుడిలో శాశ్వ‌త దీపారాధ‌న‌కు ఏర్పాట్లు చేసిన‌ట్టుగా ఆ శాస‌నంలో స్ప‌ష్టంగా ఉంది. అంటే.. దాదాపు 900 సంవ‌త్స‌రాల క్రిత‌మే విశాఖ అని ఉన్న‌ది కాబ‌ట్టి.. ఆ త‌ర్వాత వాడుక‌లో ఉన్న‌వ‌ని చెబుతున్న పేర్ల‌న్నీ స‌రైన‌వి కావ‌ని చ‌రిత్ర‌కారులు అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే.. ఆ శాస‌నంలోని విశాఖ‌, ఇప్ప‌టి విశాఖ‌ప‌ట్నం ఒక‌టేనా అన్న‌ది సందేహ‌మే.

ఇవే కాకుండా.. స‌ముద్ర తీరం కాబ‌ట్టి ఇక్క‌డ ఇసుక ఎక్కువ‌గా దొరికేద‌ని, అందువ‌ల్ల మొద‌ట్లో దీన్ని ఇసుక‌ప‌ల్లి అని పిలిచేవార‌ని, ఆ త‌ర్వాత విశాఖ ప‌ట్నంగా మారింద‌ని చెబుతుంటారు. మ‌రో వాద‌న‌లో వైశాఖ దేవి అనే దేవ‌త గుడి ఉండేద‌ని, ఈమె పేరుమీద‌నే వ‌చ్చింద‌ని మ‌రికొంద‌రు అంటుంటారు. ఇంకొంద‌రు.. బౌద్ధ భిక్షువు విశాఖ అనే మ‌హిళ ఉండేద‌ని, ఆమె పేరుతో ఈ న‌గరానికి విశాఖ‌ప‌ట్నం పేరు వ‌చ్చింద‌టారు. శివుడి చిన్న‌కుమారుడైన కుమార‌స్వామికి విశాఖ అనే మ‌రోపేరు కూడా ఉంది. ఆయ‌న పేరు మీద‌నే ఇలా పిలు‌స్తున్నార‌ని అంటారు. అయితే.. వీటిలో వేటికీ ఆధారాల్లేవు. ఈ విధంగా ర‌క‌ర‌కాల ఆధారాలు చూపుతున్నా.. ఇందులో ఏది స‌రైన‌ద‌ని వంద శాతం చెప్పే సాక్ష్యం ఇప్ప‌టి వ‌ర‌కూ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News