ప‌య్యావుల కేశ‌వ్ ఎక్క‌డ‌? ఇలా అయితే టీడీపీకి ఎలా?

Update: 2019-12-17 11:30 GMT
గ‌తంలో తెలుగుదేశం పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పార్టీ త‌ర‌ఫున గ‌ట్టిగా వాయిస్ వినిపించిన వారిలో ఒక‌రు ప‌య్యావుల కేశ‌వ్. ఉర‌వ‌కొండ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గిన కేశవ్ అప్ప‌ట్లో త‌న ప్ర‌సంగాల‌తో వార్త‌ల్లో నిలిచే వారు. మొద‌ట్లో క‌నీసం మాట్లాడ‌టం రాదు అనే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నా - ఆ త‌ర్వాత మాత్రం కేశ‌వ్ త‌న తీరును చాలా మెరుగుప‌రుచుకున్నారు.

ఇక ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున నెగ్గిన అతి త‌క్కువ‌మంది ఎమ్మెల్యేల్లో ఒక‌రు కేశ‌వ్. ఇర‌వై మూడు మందిలో ఒక‌రు. ఇక రాయ‌ల‌సీమ నుంచి నెగ్గింది తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున ముగ్గురే. చంద్ర‌బాబు నాయుడు - బాల‌కృష్ణ - ప‌య్యావుల కేశ‌వ్.

నాలుగు జిల్లాల నుంచి ఈ ముగ్గురు మాత్ర‌మే నెగ్గారు. ఇలాంట‌ప్పుడు ప‌య్యావుల కేశ‌వ్ కు కూడా మంచి అవ‌కాశ‌మే ఉన్న‌ట్టు. తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించ‌డానికి - రాయ‌ల‌సీమ త‌ర‌ఫున మాట్లాడ‌టానికి కూడా ఆయ‌న‌కు మంచి అవ‌కాశాలే ఉన్నాయి. అందులోనూ గ‌తంలో బాగా మాట్లాడ‌తాడు అనే పేరును తెచ్చుకున్న వ్య‌క్తి ప‌య్యావుల‌.

అయితే ఇప్పుడు మాత్రం ఆయ‌న నోరు మెద‌ప‌డం లేదు. స‌భ‌లో తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తున్న‌ది నాలుగైదుగురే. వారిలో ప‌య్యావుల లేరు! ఇటీవ‌లే రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల గురించి చ‌ర్చ‌ను తెలుగుదేశం పార్టీనే మొద‌లుపెట్టింది. అందుకు అధికార పార్టీ సై అంది. ఆ చ‌ర్చ‌లో భాగంగా ముఖ్య‌మంత్రి స్వ‌యంగా స్పందించి తెలుగుదేశం పార్టీని ఇర‌కాటంలో పెట్టేశారు. అయితే తెలుగుదేశం నుంచి గ‌ట్టిగా స్పందించే వాళ్లు లేక‌పోయారు.

రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల గురించి చ‌ర్చ కాబట్టి రాయ‌ల‌సీమ ఎమ్మెల్యేలే మాట్లాడాల‌ని తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేసింది అధికార ప‌క్షం. దానికి తెలుగుదేశం వ‌ద్ద స‌మాధానం లేక‌పోయింది. బాల‌కృష్ణ స‌భ‌లో ప‌త్తా లేడు - ప‌య్యావుల హ‌డావుడి లేదు. దీంతో తాము మొద‌లుపెట్టిన చ‌ర్చ విష‌యంలో తామే గ‌ట్టిగా మాట్లాడ‌లేక‌పోయారు తెలుగుదేశం పార్టీ వాళ్లు. ఇంతకీ ప‌య్యావుల మ‌రీ అలా సైలెంట్ అయిపోవ‌డం వెనుక క‌థేమిటి అనేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది!
Tags:    

Similar News