వల్లభనేని వంశీ ఎక్కడ ?

Update: 2022-05-02 08:49 GMT
తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి వైసీపీకి మద్దతుదారులుగా మారిన వల్లభనేని వంశీ అడ్రస్ కోసం వెతుకున్నారు. 2019 ఎన్నికల్లో గన్నవరం నుండి టీడీపీ తరపున వంశీ గెలిచారు. ఎన్నికల ముందు, ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డిపైన వంశీ నోటొకొచ్చినట్లు మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత వంశీలో భయం మొదలైందట. జగన్ను అన్నేసి మాటలు అన్న తర్వాత ఇక తనను ఊరికే వదిలిపెట్టడని భయపడ్డారట.

అందుకనే తనకు బాగా సన్నిహితులైన కొడాలి నాని, పేర్ని నాని రాయబారంతో జగన్ కు దగ్గరయ్యారు. జగన్ దగ్గరయ్యారని అనిపించుకునేందుకే చంద్రబాబు నాయుడును ఇష్టం వచ్చినట్లు తిట్టారు.

సభ్య సమాజం కూడా ఈసడించుకునే రేంజిలో చంద్రబాబు భార్య భువనేశ్వరిని నోటికొచ్చినట్లు వంశీ తిట్టారు. దాంతో టీడీపీ వాళ్ళంతా వంశీకి దూరమయ్యారు. ఇదే సమయంలో జగన్ కు దగ్గరవుతున్న వంశీ అంటే వైసీపీలో కూడా వ్యతిరేకత మొదలైంది.

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పోటీ విషయంలో తమకెక్కడ అడ్డు వస్తాడో అన్న ఉద్దేశ్యంతో వైసీపీ నేతలంతా మూకుమ్మడిగా వంశీని వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇటు టీడీపీకీ దూరమై అటు వైసీపీ నేతలూ కలుపుకుని వెళ్ళకపోవటంతో వంశీ పరిస్ధితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రస్తుతం ఎంఎల్ఏకి బాగా దగ్గరైన నానీలిద్దరూ మంత్రులు కూడా కారు. దాంతో జగన్ కు ఎలా దగ్గరవ్వాలో టికెట్ ఎలా సాధించుకోవాలో అర్ధం కావటం లేదట.

తొందరలో వైసీపీ కార్యక్రమం గడపగడపకు ఎంఎల్ఏ అనే కార్యక్రమంలో ఎలా పాల్గొనాలో అర్ధం కావటం లేదట. ఎందుకంటే తాను గెలిచింది టీడీపీ తరపున. అందుకని వైసీపీ కార్యక్రమాన్ని తాను క్యారీ చేయలేరు.

గడచిన 10 రోజులుగా నియోజకవర్గంలో ఎక్కడా వంశీ కనబడటం లేదని సమాచారం. ఎందుకంటే రెండు పార్టీల్లోని నేతలూ వంశీకి దూరమైపోయారట. క్షేత్ర స్ధాయిలో పరిస్దితులను చూసిన తర్వాత వంశీ రాజకీయ భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న అందరిలోను వినిపిస్తోంది. మరీ ప్రశ్నకు వంశీ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.
Tags:    

Similar News