పవన్ కల్యాణ్.. అనవసరంగా ఇరుక్కున్నారా!

Update: 2019-04-01 12:29 GMT
రెండో చోట్ల పోటీ..ఇప్పుడు పవన్ కల్యాణ్ కు కొత్త పితలాటకంగా మారుతూ ఉందని స్పష్టం అవుతోంది. రెండో చోట్ల పోటీ చేయడం విషయంలో పవన్ కల్యాణ్ ఇప్పుడు అనేక సందేహాలకు సమాధానాలు ఇవ్వాల్సి వస్తోంది. అందులో ప్రధానమైనది.. గెలిస్తే ఏ నియోజకవర్గానికి పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ఉంటారు? అనేది. పవన్ కల్యాణ్ రెండు చోట్లా గెలుస్తారని, భీమవరం- గాజువాక రెండు నియోజకవర్గాల్లో జయకేతనం ఎగరేస్తారని ఆయన అభిమానులు, జనసేన పార్టీ వాళ్లు అంటున్నారు.

మరి గెలుస్తాడు సరే..గెలిస్తే ఎక్కడో ఒక చోట రాజీనామా చేయాలి కదా. అదెక్కడ..? అంటే, దానికి సమాధానం లేదు! ఈ విషయంలో ఏ నియోజకవర్గం పేరును చెప్పినా… అది పవన్ కల్యాణ్ రాజకీయ భవితవ్యానికే ఇబ్బందికరం అని ఎవరికీ తెలియనిది కాదు. అందుకే పవన్ రెండు చోట్టా గెలిస్తే, ఫలానా చోటుకు రాజీనామా చేస్తారు. ఫలానా నియోజకవర్గంలో కొనసాగతారు.. అనే అంశానికి సమాధానం లేకుండా పోతోంది.

ఇక పవన్ కల్యాణ్ ఎంతసేపూ గాజువాకను టార్గెట్ చేసుకున్నట్టుగానే కనిపిస్తున్నారు. నామినేషన్ల కార్యక్రమం అయ్యాకా పవన్ కల్యాణ్ అక్కడే ఇళ్లు తీసుకున్నారు. గాజువాక అభివృద్ధి విషయంలో కూడా పవన్ కల్యాణ్ రకరకాల హామీలు ఇస్తూ ఉన్నారు. అలా గాజువాకకు దగ్గరయ్యే ప్రయత్నం కనిపిస్తోంది కానీ… భీమవరం విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ ఈ చొరవ చూపడం లేదనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి.

ఇక గాజువాకలో తను గెలిస్తే వారంలో రెండు రోజుల పాటు తను స్థానికంగా అందుబాటులో ఉండటం ఖాయమని పవన్ హామీ ఇచ్చారు. ఈ హామీతో ప్రజలను ఆకట్టుకోవడం మాటేమిటో కానీ.. ప్రత్యర్థులకు మాత్రం ఆయుధాలను ఇచ్చారు పీకే. అంటే వారంలో రెండు మూడు రోజుల పాటు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలా, లేక నిరంతరం మీకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలని అనుకుంటున్నారా అంటూ.. పవన్ తో పాటు పోటీకి దిగిన అభ్యర్థులు జనాలను ప్ఱశ్నిస్తున్నారు.

తమకు అవకాశం ఇస్తే.. పవన్ కల్యాణ్ లా కాదని, ఎప్పుడూ స్థానికంగా అందుబాటో ఉండడటం అంటూ వారు ప్రచారం చేసుకొంటూ పోతున్నారు. ఇప్పటికే ఒక వేళ పవన్ భీమవరంనుంచి గెలిచినా… రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపందుకుంటోంది.

పవన్ తీరే ఇందుకు నిదర్శనం అని విశ్లేషకులు అంటున్నారు. దీంతో భీమవరం ప్రజలు ఉప ఎన్నికలకు రెడీగా ఉండాలనే విశ్లేషణలూ మొదలవుతున్నాయి. ఏతావాతా.. రెండు చోట్ల పోటీ అనేది పవన్ కల్యాణ్ ను ఎన్నికల ముందు మరింత ఇరకాటంలో పడేస్తోందని మాత్రం పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఇక అసలు కథ ఎలా ఉంటుందనేది పోలింగ్ పూర్తయితే కానీ తెలియదని విశ్లేషిస్తున్నారు.

    
    
    

Tags:    

Similar News