తెలంగాణలో తెల్ల ఏటీఎంలు

Update: 2015-09-12 05:25 GMT
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆసరా పథకం అమలు సులభతరం చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ పథకంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత, గీత, బీడీ కార్మికులకు ప్రభుత్వం పింఛన్లను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ పింఛన్లను పారదర్శకంగా లబ్ధిదారులకు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తోంది. మరింత పారదర్శకత, లబ్ధిదారులకు అందుబాటులో ఉంచేందుకు ఇప్పుడు ప్రత్యేక ఏటీఎంలు  ఏర్పాటు చేయాలనుకుంటోంది. బ్యాంకుల ఏటీఎంలకు భిన్నంగా చూడగానే ప్రభుత్వం ఇచ్చే ఆసరా పథకం ఏటీఎంలు అని కచ్చితంగా గుర్తించేలా ఇవి తెల్లరంగులో ఉండేలా రూపొందిస్తున్నారు.

ఈ తెల్ల ఏటీఎంలను గ్రామ పంచాయతీల కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారానే లబ్ధిదారులు పింఛన్‌ డబ్బులను తీసుకోవడం సులభమవుతుంది. తొలుత ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా అమలు చేసి లోపాలుంటే సరిదిద్ది రాష్ట్రమంతా అమల్లోకి తెస్తారు.

వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు పింఛన్‌ డబ్బుల కోసం ప్రతి నెల గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గంటల తరబడి లైన్లలో నిలబడుతున్నారు. దీనివల్ల గ్రామపం చాయతీ సిబ్బందితో పాటు లబ్ధిదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దీంతో గ్రామ పంచాయతీల్లో తెల్ల ఏటీఎంలను ఏర్పాటు చేయడం వల్ల ఈ ఇబ్బందులను తొలగించవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. వీటిని గాంధీ జయంతి రోజున అక్టోబర్‌ 2న ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇది సక్సెస్ అయితే... ఉపాధి హామీ కూలీలకు వేతనాలు కూడా వీటి ద్వారానే ఇవ్వాలని భావిస్తున్నారు.
Tags:    

Similar News