మంత్రివర్గంలోకి ఎవరొస్తారు? ఏపీలో అప్పుడే మొదలైన రాజకీయం

Update: 2020-06-20 07:30 GMT
తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలు సొంతం చేసుకుంది. దీంతో ఏపీలో మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లిపోయారు. దీంతో మంత్రివర్గంలో వారిద్దరి బెర్తులు ఖాళీ అయ్యాయి. అలా ఖాళీ అయ్యాయో లేవో ఇలా రాజకీయాలు మొదలయ్యాయి. దీంతో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ వార్తలు జోరందుకున్నాయి. కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుడే మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ ఇద్దరి స్థానంలో ఎవరెవరికి అవకాశం దొరుకుతుందోననే హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం మంత్రి పదవి ఆశిస్తున్న వారి సంఖ్య పెద్దగానే ఉంది. పార్టీలో సీనియర్లుగా ఉన్నవారితో పాటూ మరికొందరు జూనియర్లు కూడా బెర్తుపై ఆశలు పెట్టుకున్నారు. సామాజిక వర్గం, జిల్లాలవారీగా ఎవరికీ వారు లెక్కలు వేసుకుంటున్నారు. సీఎం జగన్ వేటిని పరిగణలోకి తీసుకుంటారోనని చర్చ నడుస్తోంది. సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. జగన్ మంత్రివర్గాన్ని విస్తరిస్తారా లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

వీటిలో ప్రధాన రేసులో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ ఉన్నారు. ఆయనతోపాటు తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు తెరపైకి వస్తున్నాయి. వారిలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని ఉన్నారు. ఆమె బీసీ కోటాలో పదవిపై ఆశలు పెట్టుకున్నారు. రజిని బీసీ.. మోపిదేవి కూడా బీసీ కావడంతో.. గుంటూరు జిల్లాలో బీసీలకే మళ్లీ పదవి ఇవ్వాలనుకుంటే తనకే దక్కుతుందని రజనీ ఆశలు పెట్టుకుంటున్నారు. సీనియర్ నేతలైన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి, అంబటి రాంబాబు పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానం కోసం మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, కొలుసు పార్థసారధి ఆశిస్తున్నారు. ప్రాంతం.. సామాజిక వర్గం.. సీనియారిటీ లెక్కలు వేసుకుని వీరిద్దరూ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వీరితోపాటు ఏపీఐసీసీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే రోజా కూడా మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. ఆమె తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జగన్ ఎవరిని ఎంపిక చేస్తారోననే ఉత్కంఠ ఏర్పడింది. జగన్ కన్నుల్లో పడేందుకు.. మంత్రి పదవి కోసం ఆశావహులు పైరవీలు మొదలు పెట్టారు.
Tags:    

Similar News