వైసీపీలో ఎవరున్నారో...ఎవరూ లేరో...?

Update: 2022-12-24 07:30 GMT
వైసీపీ అధికారంలో ఉన్న పార్టీ 151 సీట్లతో బలంగా ఉన్న పార్టీ వచ్చే ఎన్నికల్లో వై నాట్ 174 అని గర్జిస్తున్న పార్టీ. అలాంటి పార్టీలో టాప్ టూ బాటం అన్నీ తెలియకపోయినా కీలక నాయకులు జిల్లాల వారీగా ప్రముఖ నాయకులు అయినా తెలియాలి కదా. అలాగే మాజీ మంత్రులు, రాష్ట్రంలో పలుమార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు తమ పార్టీలో ఉంటే వారి వివరాలు అయినా తెలియాలి కదా.

ఇదంతా ఎందుకు అంటే జగన్ సొంత జిల్లా కడపకు చెందిన ఒక సీనియర్ మోస్ట్ నేత మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తాను వైసీపీలోనే ఉన్నాను అంటూ జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. బహుశా అవి గుచ్చుకున్నాయో ఏమో వెంటనే సీన్ లోకి వచ్చిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి డీఎల్ మాటలను ఖండిస్తూనే ఆయన మా పార్టీలో లేరు అని తేల్చేశారు. మరి డీఎల్ తనను ఎవరూ తీసేయలేదని అంటున్నారు. ఇటు అదే జిల్లాకు చెందిన సజ్జల వారు ఆయన మా పార్టీ కారు అని చెబుతున్నారు.

ఇంతకీ డీఎల్ ఏ పార్టీలో ఉన్నట్లు. ఇదీ వైసీపీ వారికే కాక రాజకీయల మీద ఆసక్తి ఉన్న వారందరికీ కూడా ఆసక్తిరేపుతున్న ప్రశ్నగా ఉంది. కేవలం డీఎల్ అని మాత్రమే కాదు ఇలా చాలా మంది నాయకులు వైసీపీలో ఉన్నారా ఉంటే వారే చెప్పుకోవాలా అలా చెప్పుకున్నా పార్టీ ఒప్పుకోకపోతే వారు ఏ పార్టీకి చెందుతారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇదంతా 2019 ఎన్నికల్లో వరసబెట్టి వైసీపీలో అంతా ఒక్క లెక్కన చేరడం అధినాయకత్వం వారి మెడలో కండువాలు వేసి మా పార్టీయే అని చెప్పుకోవడంతో వచ్చిన తంటా.

ఆ తరువాత ఎన్నికల్లో ఎందరు పార్టీకి పనిచేశారో మరి వారిలో ఎందరిని పార్టీ గురించి పెద్ద పీట వేసిందో తెలియదు కానీ చాలా మంది మాత్రం ఈ రోజుకీ తెర చాటునే ఉండిపోతున్నారు అని అంటున్నారు. ఆ లిస్ట్ లో చూస్తే ఒకనాడు బాగా వెలుగు వెలిగిన వారు అనేక మంది ఉన్నారు. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి వైసీపీలో అప్పట్లో చేరారు. ఇపుడు ఈయన అలికిడి అయితే లేదు. మరి ఈయన పార్టీలో ఉన్నట్లా లేనట్లా అంటే జవాబు ఎవరూ చెప్పలేరు.

అదే విధంగా ఉత్తరాంధ్రాకు చెందిన మాజీ మంత్రి సీనియర్ నేత దాడి వీరభద్రరావు వైసీపీలోనే ఉన్నారా అంటే ఉన్నారనే చెప్పాలేమో. ఈయన కూడా చడీ చప్పుడు లేదు, సందడి అంతకంటే లేదు. తాను ఏ పార్టీ మారలేదని వైసీపీయే అని దాడి చెప్పవచ్చు కాక కానీ అధినాయకత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆయన ఫ్యాన్ నీడన ఉన్నట్లుగా గుర్తిస్తున్నారో లేదో ఎవరికీ అసలు తెలియదు.

మరో వైపు చూస్తే ఉత్తరాంధ్రాలో మరో నేత మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ కూడా వైసీపీలో ఉన్నారా అంటే ఉన్నారని పార్టీ లోకల్ లీడర్స్ అంటున్నారు. ఆయన జగన్ని 2019 ఎన్నికల ముందు కలసి వైసీపీయే అనిపించుకున్నారు. అయితే ఆయన కూడా ఎక్కడా సౌండ్ చేయడంలేదు. తాను ఇపుడు ఇండిపెండెంట్ అంటున్నారు. పైగా రాజకీయాలకు దూరమా దగ్గరా అని ఆయన చెప్పడంలేదు. దాంతో కొణతాల ఏ పార్టీ అంటే ఎవరూ చెప్పలేరేమో.

మరో వైపు చూస్తే విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ రహమాన్ వైసీపీ అని చెబుతున్నా ఆయన సందడి కూడా లేదు. మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య సైతం వైసీపీ ఖాతాలోకే వస్తారా అంటే అది పెద్ద డౌట్. ఇలా లెక్క చూస్తే ప్రతీ జిల్లాలో చాలా మంది నాయకుల పేర్లు వస్తాయి. వారు బయటపడి తాము పార్టీలో ఉన్నామంటే ఉన్నట్లు లేకపోతే లేనట్లు. అధినాయకత్వం దృష్టిలో మాత్రం వారి పొజిషన్ ఏంటో దేవుడికే తెలియాలి అని అంటున్నారు. అదన్న మాట మ్యాటర్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News