అశ్వత్థామరెడ్డి నోట పొలిటికల్ వర్డ్స్..వాటీజ్ ద మ్యాటర్?

Update: 2019-10-17 17:12 GMT
తెలంగాణలో పెను సమస్యగా మారిన ఆర్టీసీ సమ్మె ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో సమ్మె సైరన్ మెగించిన కార్మికులు... ప్రభుత్వం అందుకు ససేమిరా అనడంతో చేసేది లేక సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఓ మెట్టు దిగినట్టుగా కనిపించిన వెంటనే కార్మిక సంఘం నేతగా ఎంట్రీ ఇచ్చిన అశ్వత్థామరెడ్డి... ఏకంగా సీఎం కేసీఆర్ పై రాజకీయ కోణంలో సంచలన వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే... ఆర్టీసీ సమ్మె లక్ష్యం... సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం వరకు మాత్రమే కాదన్న వాదనలు క్రమంగా బలపడుతున్నాయి. ఆర్టీసీ సమ్మెకు పథకం రచించడంతో పాటుగా ఆ పథకాన్ని పక్కాగా పట్టాలు తప్పకుండా జాగ్రత్తగా ముందుకు సాగేలా ఓ రాజకీయ పార్టీ పావులు కదుపుతోందన్న మాటలు కూడా ఇప్పుడు కాస్తంత గట్టిగానే వినిపిస్తున్నాయి. నిజమా? అంటే... గురువారం నాడు కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని అశ్వత్థామరెడ్డి చేసిన వ్యాఖ్యలు వింటే... ఈ మాట నిజమేనని ఒప్పుకోక తప్పదన్న వాదన వినిపిస్తోంది.

అయినా కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని అశ్వత్థామరెడ్డి ఏ తరహా వ్యాఖ్యలు చేశారన్న విషయానికి వస్తే... ‘నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి ఎవరికీ శాశ్వతం కాదు. ఎంతో మంది నేతలు వస్తుంటారు... వెళుతుంటారు. ఎన్టీఆర్ కన్నా కేసీఆర్ మేథావా? 1993-94 సంక్షోభాన్ని కేసీఆర్ మరిచిపోకూడదు. ప్రసాజ్వామ్య పునాదులు కదులుతున్నాయి. ఆర్టీసీ సమస్య పరిష్కారం కాకుంటే 1994 సంక్షోభం రావచ్చు. ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇస్తూ మాట్లాడారు. ఆర్టీసీ సమ్మెపై మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డి మౌనం వీడాలి. మేథావులు మౌనంగా ఉండకూడదు. పలువురు మంత్రులు కార్మికులను విమర్శించి ఇంటికి వెళ్లి ఏడుస్తున్నారు. ప్రభుత్వంతో ఇప్పటికీ చర్చలు జరిపేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. హైకోర్టు సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి’ ఇలా అశ్వత్థామరెడ్డి ఓ రేంజిలో రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిన నాటి సంక్షోభాన్ని కూడా గుర్తు చేయడంతోనే సరిపెట్టకుండా ఎన్టీఆర్ కంటే కేసీఆర్ మేథావా? అని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు  చేశారు.

అశ్వత్థామరెడ్డి చేసిన వ్యాఖ్యలు... ఆ క్రమంలోనే చోటుచేసుకున్న పరిణామాలు, ప్రభుత్వంతో చర్చలకు తాను కాకుండా సంఘం కార్యదర్శిని పంపిన అశ్వత్థామరెడ్డి తీరు చూస్తుంటే... ఈ సమ్మె వెనుక చాలా బిగ్ ప్లానే ఉందన్న వాదన వినిపిస్తోంది. ఈ సమ్మెకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వత్తాసుగా నిలిచినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్ ఢిల్లీ పర్యటన ముగిసిన మరుక్షణమే అశ్వత్థామరెడ్డి వాయిస్ లో బేస్ పెరిగిన వైనం కూడా ఇందుకు నిదర్శనమేనన్న వాదన వినిపిస్తోంది. అప్పటిదాకా డిఫెన్సివ్ గానే వ్యవహరించిన అశ్వత్థామరెడ్డి... గవర్నర్ ఢిల్లీ పర్యటన ముగిసిన మరుక్షణమే ఆయన తనదైన రేంజిలో కేసీఆర్ పై విరుచుకుపడటం చూస్తుంటే... బీజేపీ రంగంలోకి దిగిందని, సమ్మె మరింత కాలం కొనసాగేలా ప్లాన్ అమలు చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజమే మరి... ప్రభుత్వంతో చర్చలకు తాము ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామని ప్రకటించిన అశ్వత్థామరెడ్డి... మరి చర్చల కోసం రవాణా శాఖ మంత్రి నుంచి కబురు అందగానే రెక్కలు కట్టుకుని వాలాల్సింది పోయి... తాను వెళ్లకుండా సంఘం కార్యదర్శి హోదాలో ఉన్న నేతను పంపడం చూస్తుంటే... కేసీఆర్ ను కార్నర్ చేసేందుకు బీజేపీనే ఈ మొత్తం స్కెచ్ ను రచించిందన్న వాదనలు బలపడుతున్నాయి.

Tags:    

Similar News