గద్దర్ పోటీ వెనుక... ఆ పెద్దాయన..!?

Update: 2018-11-10 05:04 GMT
గద్దర్. ప్రజాయుద్ధ నౌక. వామపక్ష రాజకీయాలకు పెట్టింది పేరు. గడచిన నాలుగున్న దశాబ్దాలుగా తన పాట... మాటతో తెలుగు ప్రజలకు ఎంతో చేరువయ్యారు. కొన్నాళ్లు రహస్య జీవితం కూడా గడిపిన గద్దరంటే అన్ని ప్రాంతాల వారికి... అన్ని రాజకీయ పార్టీల వారికి కూడా ఎంతో ఇష్టం. గౌరవం. గడచిన కొన్ని సంవత్సరాలుగా గద్దర్ వామపక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరీ రెండు సంవత్సరాల నుంచి అయితే ప్రజాస్వామ్య పద్దతిని అనుసరిస్తున్నారు. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యం అనే దశ నుంచి బుల్లెట్ కంటే బ్యాలెట్ కే ఎక్కువ విలువనే నమ్మకానికి వచ్చారు గద్దర్. ఇందులో భాగంగా ఆయన రాజకీయ పార్టీ పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఆ వార్తలకు కొన్నాళ్ల పాటు సమాధానం ఇవ్వని గద్దర్ ఆ తర్వాత తాను రాజకీయ పార్టీ పెట్టడం లేదంటూ ఓ ప్రకటన కూడా ఇచ్చారు. తాజాగా తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని - అది కూడా స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగుతానని ప్రకటించారు గద్దర్. అంతకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని - ఆయన తల్లి సోనియా గాంధీని కలిసి కాంగ్రెస్ అనుకూలంగా ప్రచారం చేస్తానని కూడా ప్రకటించారు. ఇప్పటి వరకూ బాగానే ఉంది. కానీ, హఠాత్తుగా గద్దర్ స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగుతాననడమే అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది.

గద్దర్ అభ్యర్ధిత్వం వెనుక ఎవరున్నారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.దానికి కారణం గద్దర్ పోటీ చేస్తున్న నియోజకవర్గమే. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర రావుపై పోటీ చేస్తానని ప్రకటించడమే ఈ ఆశ్యర్యానికి కారణం. ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా వంటేరు ప్ర‌తాప‌రెడ్డి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన టీడీపీ నుంచి కె.చంద్రశేఖర రావుపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ సారి మాత్రం వంటేరు మహాకూటమి అభ్యర్ధిగా బరిలో దిగుతున్నారు. దీంతో కె.చంద్రశేఖర రావు విజయం అంత సులభం కాదని అంటున్నారు. కెసీఆర్ ఓడించడమే లక్ష్యం పావులు కదుపుతున్న మహాకూటమికి గద్దర్ రూపంలో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. గజ్వేల్‌ లో గద్దర్ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ కు ఓటేసేవారు.

తెలంగాణలో సెంటిమెంట్ లో భాగంగా తగ ఎన్నికలలో మాత్రం వారి ఓట్లలో ఎక్కువ శాతం కెసీఆర్‌ కే పడ్డాయి.ఈ సారి ఆ ఓట్లు మళ్లీ కేసీఆర్‌ కు వచ్చే అవకాశాలు తక్కువే అంటున్నారు. ఈ నేపథ్యంలో గద్దర్ చేత స్వతంత్ర అభ్యర్ధిగా రంగంలో దింపితే ఓట్ల చీలిక వచ్చి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు విజయం సులభమవుతుందని అంటున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే గద్దర్ చేత స్వతంత్ర అభ్యర్ధిగా అధికార పార్టీయే గజ్వేల్ బరిలో నిలుపుతోందనే వార్తలు నియోజకవర్గంలో మారుమోగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఓ కీలక నాయకుడు - పత్రిక - ఓ ఛానెల్‌ యజమానితో గద్దర్ కు దగ్గరి బంధుత్వం ఉంది. ఆయనే ఈ మంత్రాంగం నడిపినట్లు చెబుతున్నారు. ఎన్నికల్లో ఇలాంటి చిత్రాలు మరెన్ని జరుగుతాయో కాలమే చెప్పాలి.


Tags:    

Similar News