చెప్పుతో దాడిచేసిన వ్యక్తిపై ఆ చానెల్ కేసు పెట్టాలి: సోము హెచ్చరిక

Update: 2021-02-24 07:30 GMT
తెలుగు న్యూస్ చానెల్ డిబేట్ లో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై అమరావతి ప్రాంత రైతు నేత కే శ్రీనివాసరావు చెప్పుతో దాడి చేయడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రధాన కార్యదర్శి స్థాయి నేతపై జరిగిన ఈ దాడిపై బీజేపీ భగ్గుమంటోంది.

ఈ క్రమంలోనే దాడి చేసిన కొలికపూడి శ్రీనివాసరావు నేపథ్యాన్ని బీజేపీ తవ్వితీస్తోంది. తెలుగుదేశం పార్టీలో అతడు క్రియాశీలక కార్యకర్త అని ఏపీ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను విడుదల చేశాడు.

ప్లాన్ ప్రకారమే విష్ణువర్ధన్ రెడ్డిపై శ్రీనివాసరావు దాడి చేశాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి దాడి వెనుక కూడా టీడీపీ నేతలు ఉన్నారని ఆరోపిస్తున్నారు. శ్రీనివాసరావు అమరావతి రైతుగా చెప్పుకుంటున్నప్పటికీ అతడు టీడీపీ సానుభూతి పరుడేనంటూ మండిపడుతున్నారు.

ఈ క్రమంలోనే ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. విష్ణువర్ధన్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తిపై కేసు పెట్టాల్సిన బాధ్యత ఆ చానెల్ యాజమాన్యానిదేనని స్పష్టం చేశారు. యాంకర్ ను సాక్ష్యంగా పెట్టి వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. డిబేట్లకు సంయమనం పాటించేవారిని పిలవాలని సూచించారు. తమ పార్టీ నేతపై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయించేలా చూడాల్సిన బాధ్యత సదురు చానెల్ దేనని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
Tags:    

Similar News