వ‌ర‌ల్డ్ బ్యాంక్ వెళ్లి పోవ‌టం వెనుక ఎవ‌రున్నారు?

Update: 2019-07-19 04:29 GMT
మోడీ లాంటి ప‌వ‌ర్ ఫుల్ ప్ర‌ధాన‌మంత్రికి ఇష్టం లేని టాపిక్ మీద మాట్లాడే ద‌మ్ము.. ధైర్యం ఇప్పుడెవ‌రికైనా ఉందా? అంటే.. అది ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికే. ప‌వ‌ర్లోకి వచ్చిన పాతిక రోజుల్లోనే మూడు వేర్వేరు వేదిక‌ల మీద ప్ర‌త్యేక హోదా మీద మాట్లాడ‌టం అంతే తేలికైన విష‌యం కాదు. మోడీ మెచ్చ‌ని అంశాన్ని తాను అదే ప‌నిగా ప్ర‌స్తావిస్తే.. అందుకు త‌గిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంద‌న్న విష‌యం తెలీని చిన్న‌పిల్లాడేం కాదు జ‌గ‌న్‌.

ఏపీకి ప్రాణాధార‌మైన హోదా విష‌యంలో వెన‌క్కి త‌గ్గ‌కూడ‌ద‌ని.. బాబు చేసిన త‌ప్పు తాను చేయ‌కూడ‌ద‌న్న క‌మిట్ మెంట్ యువ‌నేత‌లో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుందని చెప్పాలి. తాజాగా మ‌రోసారి ప్ర‌త్యేక హోదా ఏపీకి అత్య‌వ‌స‌ర‌మ‌న్న మాటను చెప్పారు. ఇలా హోదా గురించి ప్ర‌తి వేదిక మీదా ప్ర‌స్తావించ‌టం ద్వారా.. జ‌గ‌న్ దాని ఆయుష్షును పెంచే విష‌యంలో స‌క్సెస్ అయ్యారు.

అదే స‌మ‌యంలో.. క‌నిపించ‌ని శ‌క్తులు వేసే ఎత్తులకు దొరికిపోతున్నారు. ఏపీ ప్ర‌యోజ‌నాలు త‌ప్పించి త‌న‌కింకేమీ అక్క‌ర్లేద‌న్న విష‌యాన్ని కుండ‌బ‌ద్ధ‌లు కొడుతున్న జ‌గ‌న్ కు.. ఊహించ‌ని రీతిలో షాకులు ఇచ్చేందుకు తెరచాటు ప్ర‌య‌త్నాలు జోరుగా సాగుతున్నాయి. త‌మ‌కే మాత్రం సంబంధం లేని విష‌యాలుగా క‌నిపించే వాటి విష‌యంలో చ‌క్రం తిప్పుతూ నెగిటివ్ రిజ‌ల్ట్ వ‌చ్చేలా చేస్తున్నారు.

జ‌గ‌న్ కార‌ణంగా ఏపీ అభివృద్ధి ఆగిపోతుంద‌న్న ఇమేజ్ ను క్రియేట్ చేసే ప్ర‌య‌త్నంలో అలుపెర‌గ‌ని రీతిలో ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా అమ‌రావ‌తి రాజ‌ధాని న‌గ‌ర అభివృద్ధి ప్రాజెక్టు నుంచి ప్ర‌పంచ బ్యాంకు త‌ప్పుకోవ‌టానికి కార‌ణంగా చెబుతున్నారు. తాజాగా తాము ఏపీ ప్ర‌భుత్వానికి 300 మిలియ‌న్ డాల‌ర్ల రుణ‌సాయం కోసం అప్లై చేసిన ద‌ర‌ఖాస్తు విష‌యంలో వెన‌క్కి వెళ్లిన‌ట్లుగా వెల్ల‌డించింది. ఈ విష‌యాన్ని ప్ర‌పంచ బ్యాంకు త‌న వెబ్ సైట్ లో పేర్కొంది. అయితే.. ఇదే అంశంపై అధికారికంగా త‌మ‌కు ఎలాంటి స‌మాచారం లేద‌ని సీఆర్ డీఏ క‌మిష‌న‌ర్ ల‌క్ష్మీ న‌ర‌సింహం వెల్ల‌డించారు.

అమ‌రావ‌తి అభివృద్ధి కోసం గ‌త ప్ర‌భుత్వం (చంద్ర‌బాబు స‌ర్కార్) 715 మిలియ‌న్ డాల‌ర్ల సాయం అందించాలంటూ ప్ర‌తిపాద‌న‌లు పంప‌గా 300 మిలియ‌న్ డాల‌ర్ల రుణం అందించేందుకు ప్ర‌పంచ బ్యాంకు ముందుకు వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. అమ‌రావ‌తి న‌గ‌ర ప్రాంతంలో నివ‌సిస్తున్న కొంద‌రు ప్ర‌పంచ బ్యాంకు త‌నిఖీ ప్యాన‌ల్ కు కంప్లైంట్ చేశారు. అమ‌రావ‌తి నిర్మాణం త‌మ జీవ‌నాధారానికి హాని చేస్తుంద‌ని.. ప‌ర్యావ‌ర‌ణానికి.. ఆహార‌భ‌ద్ర‌త‌కు భంగం వాటిల్లేలా చేస్తుంద‌ని చెప్ప‌టంతో రుణ‌మంజూరుకు ఆల‌స్య‌మైంది. తాజాగా తామీ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్న‌ట్లుగా ప్ర‌క‌టించ‌టం గ‌మ‌నార్హం.

అయితే.. దీన్ని జ‌గ‌న్ వైఫ‌ల్యంగా ఎత్తి చూపేందుకు కంటికి క‌నిపించ‌ని శ‌క్తులు ప్ర‌చారం చేయ‌టానికి రంగం సిద్ధం చేశారు. హోదా సాధ‌న విష‌యంలో త‌న శ‌క్తియుక్తుల్ని పెడుతున్న జ‌గ‌న్‌.. ఇలాంటి అంశాలపైనా ఫోక‌స్ పెంచాల్సిన అవ‌స‌రం ఉంది.క‌నిపించే శ‌త్రువుతో పోరాడే అల‌వాటున్న జ‌గ‌న్‌.. కంటికి క‌నిపించ‌కుండా పావులు క‌దిపే శ‌త్రువును గుర్తించి చెక్ పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది.
Tags:    

Similar News