భార‌త‌ర‌త్న‌...నానాజీ దేశ్‌ ముఖ్ ఎవ‌రంటే..

Update: 2019-01-26 05:32 GMT
70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలను శుక్రవారం ప్రకటించింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ - ఆర్ ఎస్ ఎస్ మాజీ నేత నానాజీ దేశ్‌ ముఖ్ - ప్రఖ్యాత గాయకులు భూపేన్ హజారికాలను భారతరత్న పురస్కారానికి ఎంపిక చేసింది. నానాజీ - భూపేన్‌ లకు మరణానంతరం ఈ అవార్డులు దక్కాయి. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ - భుపేన్ హజారిక గురించి ప‌లువురికి తెలిసిన‌ప్ప‌టికీ - నానాజీ దేశ్‌ ముఖ్ గురించి ప‌లువురిలో ఆస‌క్తి ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న భార‌త‌ర‌త్న‌కు అర్హుల‌య్యేందుకు దోహ‌ద‌ప‌డిన అంశాలు - ఆయ‌న జీవిత చ‌రిత్ర ఇది.

లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రవచించిన జాతీయ వాదంతో స్ఫూర్తి పొందిన నానాజీ దేశ్‌ ముఖ్ అసలు పేరు చండికాదాస్ అమృత్‌ రావు దేశ్‌ ముఖ్. 1916 అక్టోబర్ 11న మహారాష్ట్రలోని పర్భనీ జిల్లా కాదోలీ పట్టణంలో జన్మించారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఆరెస్సెస్‌ లో చేరారు. 1947 జనవరి 30న జాతిపిత మహాత్మాగాంధీ దారుణ హత్య తర్వాత ఆరెస్సెస్‌ పై నిషేధం విధించడంతో అజ్ఞాతంలో ఉంటూ కార్యకలాపాలు సాగించారు. ఆరెస్సెస్‌ పై నిషేధం ఎత్తివేసిన తర్వాత ఏర్పాటైన భారతీయ జనసంఘ్ (బీజేఎస్) వ్యవస్థాపక నేతల్లో నానాజీ ఒకరు. ఆ పార్టీ యూపీ శాఖ ప్రధాన కార్యదర్శిగా నానాజీ నియమితులయ్యారు. రామ్‌ మనోహర్ లోహియా వంటి సోషలిస్టులతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవి. వినోబాభావే భూదానోద్యమంలో - ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1980లో 60వ పడిలో పడిన తర్వాత ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉన్నా.. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వారు. 1999లో వాజ్‌ పేయి ప్రభుత్వం నానాజీ దేశ్‌ ముఖ్‌ ను రాజ్యసభకు నామినేట్ చేసింది. అదే ఏడాది ఆయన పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. 2010 ఫిబ్రవరి 27న చిత్రకూట్‌ లోని గ్రామోదయ్ విశ్వవిద్యాలయలో నానాజీ కన్నుమూశారు.

సంఘ్ కార్య‌క‌ర్త‌గా నానాజీ దేశ్‌ ముఖ్ ప్ర‌యాణం ఆస‌క్తిక‌రం. 13 ఏళ్ల వయసు సమయంలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ ఎస్ ఎస్‌ లో చేరారు. 1926లో హిందువులపై జరిగిన హింసలో ఆర్ ఎస్ ఎస్ ఎలా వారిని కాపాడిందో దగ్గరుండి చూసి అందుకు ముగ్ధుడినై ఆర్ ఎస్ ఎస్‌ లో తాను చేరినట్లు 1996లో ఆయ‌న ఓ సంద‌ర్భంగా వివ‌రించారు. ఆర్ ఎస్ ఎస్‌ లేకుంటే నానాజీ లేరని ఆయన మరో ఇంటర్వ్యూలో చెప్పారు. ఆనాడు బ్రిటీషు రాజ్యంలో ఉన్న దేశ్‌ ముఖ్ భారత్‌ కు స్వాతంత్ర్యం సిద్దించాలంటే అది ఆర్ ఎస్ ఎస్ వల్లే అవుతుందని బలంగా నమ్మారు. ఆర్ ఎస్ ఎస్‌ లో తను భాగస్వామి కాకపోయి ఉంటే దేశం గురించి తెలిసేది కాదని తన జీవితాన్ని దేశం కోసం ధారపోసేవాడిని కానని  వెల్ల‌డించారు.

జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ శిష్యుడిగా నానాజీ ప‌లు సంద‌ర్భాల్లో కీల‌క పాత్ర పోషించారు. లోక్‌ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శిగా నానాజీ దేశ్‌ ముఖ్ జయప్రకాష్ నారాయణ్‌ కు కుడిభుజంగా ఉండి పనిచేసి ఇందిరా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమంలో నానాజీ కీలక పాత్ర పోషించారు. త‌న స‌హ‌చ‌రులు అయిన‌ సుబ్రమ‌ణ్మ‌ స్వామి - ఎంఎల్ ఖురానా - రవీంద్ర వర్మ - దత్తో పంత్ తెంగడి లాంటి నేతలకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలని సూచించి దీనికి ఆపరేషన్ టేక్ ఓవర్ అని పేరు పెట్టి పలు రాష్ట్ర రాజధానుల్లో ఆయన పర్యటించారు. అయితే, ఈ పోరాటాన్ని ప్ర‌భుత్వం అణిచివేయాల‌ని చూసింది. జూలై 29 - 1975లో నానాజీని పోలీసులు అరెస్టు చేశారు. జైల్లో 17 నెలల పాటు గడిపిన నానాజీ... ఓ పత్రిక అధినేత అయిన అయిన‌ రామ్‌ నాథ్ గోయెంకా తన విడుదలకు ఇందిరాగాంధీతో చర్చలు జరిపి సక్సెస్ అయ్యారని - అందుకే జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని వివ‌రించారు.

ప‌త్రికాధినేత అయిన రామ్‌ నాథ్ గోయెంకా రాజ‌కీయాల్లోకి రావాల‌ని చేసిన సూచ‌న‌ను గౌరవించిన నానాజీ జైలు నుంచి విడుదలైన అనంత‌రం   ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని బలరామ్‌ పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అంత‌టి విశిష్ట వ్య‌క్తికి ప‌ద‌వి ఇచ్చేందుకు మొరార్జీ దేశాయ్ ముందుకు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆయ‌న నిరాక‌రించారు. ``రాజకీయాల రూపంలో మనం ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాం`` అని భావిస్తూ ఆయ‌న రాజ‌కీయాల నుంచి వైదొలిగారు. అనంత‌రం - సామాజిక సేవ‌కుడిగా మారి కేవలం నగరాలను మాత్రమే అభివృద్ధి చేస్తూ దేశానికి పట్టుకొమ్మల్లాంటి గ్రామాలను విస్మరిస్తోందని భావించి యువతతో గ్రామాలను అభివృద్ధి చేసేందుకు పాటుపడతానని వెల్లడించారు. అనంత‌రం ప‌లు సేవాల కార్య‌క్ర‌మాల్లో పాల్గొని ఫిబ్రవరి 27  - 2010లో త‌న 95 ఏట నానాజీ కన్నుమూశారు.

Tags:    

Similar News