చినబాబు త్యాగమూర్తి...మంగళగిరిలో పోటీ చేసేది ఎవరు...?

Update: 2022-10-28 07:30 GMT
ఇపుడు ఏపీలో బాగా నానుతున్న నియోజకవర్గాలలో మంగళగిరి కూడా ఒకటి. గుంటూరు  జిల్లాలో ఉన్న ఈ సీటు వెరీ హాట్. అలాగే అధికార వైసీపీ, విపక్ష టీడీపీలకు హాట్ ఫేవరేట్ కూడా. మరి ఈ సీటు మీద ముచ్చట పడి మరీ ఎంచుకున్న నారా లోకేష్ బాబు 2019 ఎన్నికల్లో మంత్రిగా ఉంటూ కూడా ఘోరంగా ఓటమి పాలు అయ్యారు. ఆనాడు గెలుపు కోసం ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు, ఇక డబ్బు మంచినీళ్ల ప్రాయంగా టీడీపీ నాడు ఖర్చు చేసింది అని ప్రచారం సాగింది. ఎంత చేసినా చివరికి జనాలు మాత్రం పక్కా లోకల్ అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డిని ఎన్నుకున్నారు.

ఆ దెబ్బతో బిత్తరపోయింది తెలుగుదేశం. ఇక చంద్రబాబుకు నారా లోకేష్ కి అయితే అది రాజకీయంగా మరచిపోలేని గుణపాఠం. దాంతో మంగళగిరిలో ఈసారి అయినా గెలవాలని లోకేష్ మూడేళ్ళుగా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన వారంలో రెండు రోజులు  అక్కడే ఉంటున్నారు. అయితే లోకేష్ వచ్చినపుడు పార్టీ జనాలు వస్తున్నారు. అలాగే ఆహో ఓహో అనే వందిమాగధులు పక్కన ఉంటున్నారు. భావి వారసుడు లోకేష్ బాబు అని కీర్తించేవారూ ఉన్నారు. కానీ వీరే అసలు ఓటర్లను నమ్ముకుంటే మంగళగిరిలో మరోమారు బొమ్మ తిరగబడుతుంది అన్న సంగతి ఇద్దరు బాబులకు తెలియనిది కాదు అంటున్నారు.

దీని కంటే ముందు అసలు మంగళగిరిని లోకేష్ బాబు 2019 ఎన్నికల్లో ఎందుకు ఎంచుకున్నారో కూడా ఎవరికీ అర్ధంకాదనే అంటారు. ఎందుకంటే అక్కడ ట్రాక్ రికార్డు చూస్తే టీడీపీ పుట్టాక పెట్టాక కేవలం 1983, 1985 ఎన్నికల్లో మాత్రమే గెలిచింది. మిగిలిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టులు గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఒక విదంగా  అక్కడ పసుపు జెండా ఎగిరి  నలభయ్యేళ్ళు కావస్తోంది.

అందువల్ల పార్టీ పునాదులు పూర్తిగా పటిష్టంగా లేని చోటున ఎంతలా శ్రమించినా ఫలితం మీద పూర్తి కాంఫిడెన్స్ అయితే  లేదనే అంటున్నారు. దాంతో మంగళగిరి మీద తాజాగా చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో లోకేష్ బాబు పాల్గొని తండ్రి పార్టీ ప్రెసిడెంట్ అయిన చంద్రబాబుకు నియోజకవర్గంలో పరిస్థితిని గురించి వివరించారు. పార్టీ అక్కడ పరుగులు తీస్తోందని కూడా లోకేష్ చెప్పినట్లుగా వార్త బయటకు వచ్చింది.

నిజానికి లోపాయికారీగా టీడీపీ ఆలోచనలు మంతనాలు చూస్తే తండ్రీ కొడుకులు ఇద్దరూ మంగళగిరి సీటుని జనసేనకు అప్పగించాలని భావిస్తున్నారు అని అంటున్నారు. ఎటూ గెలుపు డౌట్ ఉన్న ఈ సీట్లో పోటీ చేసి మొత్తం టైం అంతా అక్కడ ఖర్చు చేయడం ఎందుకు అన్న ఆలోచనలో టీడీపీ అధినాయకత్వం ఉందిట. దాని వల్ల లోకేష్ మొత్తం రాష్ట్రం తిరిగి పార్టీకి ప్రచారం చేసే టైం కూడా తగ్గిపోతుంది అని భావిస్తోందిట.

దాంతో ఎటూ మిత్రపక్షానికి సీట్లు ఇవ్వాలి. పైగా లోకేష్ కోరుకున్న సీటు ఇస్తే త్యాగమూర్తి అన్న పేరు వస్తుంది. పైగా అక్కడ గెలుపు తంటాలేవో జనసేన పడుతుంది. లోకేష్ హాయిగా ఏపీ అంతా తిరిగి ప్రచారం చేయవచ్చు. ఒక వేళ పార్టీ అధికారంలోకి వచ్చి మంత్రిగా అపుడు ప్రమాణం చేసి ఎమ్మెల్సీగా మళ్లీ నెగ్గవచ్చు. ఇలా టీడీపీ అధినాయకత్వం ఆలోచనలు సాగుతున్నాయట. మొత్తానికి మంగళగిరి సీటుని జనసేనకు కట్టబెట్టాలని టీడీపీ పక్కా ప్లాన్ వేస్తోంది అని అంటున్నారు. ఇదే నిజమైతే మంగళగిరిలో జనసేన రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News