మోడీ టీంలోకి ‘ఇన్’ ఎవరు? ‘ఔట్’ ఎవరు?

Update: 2021-07-07 04:05 GMT
అంచనాలు నిజమయ్యాయి. గడిచిన కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలకు తగ్గట్లే.. ప్రధాని మోడీ తన మంత్రివర్గ సభ్యుల్ని పెంచుకునేలా నిర్ణయం తీసుకుున్నారు. కొద్ది రోజులుగా కేంద్ర కాబినెట్ లోకి ఎవరిని తీసుకోవాలి? ఎవరికి ఉద్వాసన ఇవ్వాలన్న అంశంపై జోరుగా కసరత్తు సాగుతోంది. దీనికి తగ్గట్లే.. తుది జాబితా రెఢీ కావటమేకాదు.. మంత్రివర్గ విస్తరణకు ఈ రోజు (బుధవారం) సాయంత్రం ఆరు గంటలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి ముహుర్తం పెట్టేశారు. నిబంధనల ప్రకారం కేంద్ర కేబినెట్ లోకి 81 మందిని చేర్చుకునే వీలుంది. అయితే.. ఇప్పుడు 5 3మంది మాత్రమే ఉన్నారు. అంటే.. మరో 28 మందికి చోటు కల్పించే వీలుంది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా పాతిక మంది వరకు మంత్రుల్ని చేర్చుకునే వీలుందని చెబుతున్నారు.

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం కేంద్ర కాబినెట్ లో ఉన్న వారిలో ఐదుగురికి ఉద్వాసన పలుకుతూ మోడీ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. వేటు పడే ఆ ఐదుగురు ఎవరన్నది బయటకు రావటం లేదు. బీజేపీలోని సీనియర్లకు సైతం.. దీనికి సంబంధించిన సమాచారం అందటం లేదంటున్నారు. దీంతో.. మంత్రి పదవులు ఊడే ఆ ఐదుగురు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో.. కొత్తగా కొలువులు వచ్చే వీలున్న వారికి సంబంధించిన జాబితా ఒకటి బయటకు వచ్చింది. ఇందులో పార్టీ పట్ల విధేయతతో ఉండేవారు.. కమిట్ మెంట్ విషయంలో వంక పెట్టలేని వారు.. యువతతోపాటు.. 2024 ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలున్న టీంను మోడీ ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం కొత్తగా మంత్రి పదవుల్ని చేజిక్కించుకునే అవకాశం ఉన్న పేర్లలో..

జ్యోతిరాదిత్య సింధియా
శర్వానంద సోనోవాల్‌
పశుపతి పరాస్‌
నారాయణ్‌ రాణే
వరుణ్‌ గాంధీ
ఆర్సీపీ సింగ్‌
లల్లన్‌ సింగ్‌
ఆర్‌.కె.రంజన్‌ సింగ్
రీటా బహుగుణ
పంకజ్‌ చౌదరి
రమాశంకర్‌ కఠేరియా
రాహుల్‌ కశ్వాన్‌
సకల్‌దీప్‌ రాజ్‌భర్‌
శంతన్‌ ఠాకూర్‌
నిశిత్‌ ప్రామాణిక్‌
రాఘవేంద్ర
జితిన్‌ప్రసాద
అనుప్రియ పటేల్‌

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టులోని వారికి కీలక పదవులు అప్పజెప్పే అవకాశం ఉందని చెబుతున్నారు. రానున్న కొద్ది నెలల్లో (వచ్చే ఫిబ్రవరిలో)  ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగటం తెలిసిందే. ఇందులో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఒకటి. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలతో పాటు.. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు అనుగుణంగా తాజా టీం ఎంపిక ఉంటుందని చెబుతున్నారు. రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించి.. ప్రభుత్వాన్ని కొలువు తీర్చిన తర్వాత జరుగుతున్న మొదటి మంత్రివర్గ విస్తరణ ఇదే కావటం గమనార్హం.

తాజా విస్తరణలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్.. మహారాష్ట్ర.. పశ్చిమబెంగాల్.. ఈశాన్య రాష్ట్రాలకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత లభిస్తుందని చెబుతున్నారు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల (ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ) కు పెద్ద ప్రాధాన్యత లభించే వీల్లేదని చెబుతున్నారు. కర్ణాటకలో మినహా మరెక్కడా బీజేపీ అధికారంలో లేదన్నది మర్చిపోకూడదు. కేంద్ర కాబినెట్ లో తాజాగా చోటు లభించే పలువురు నేతలకు మంగళవారం మధ్యాహ్నం నుంచే ఫోన్లు రావటం మొదలైనట్లుగా తెలుస్తోంది.

వెంటనే ఢిల్లీకి రావాలని.. బుధవారం ఉదయానికి అందుబాటులో ఉండేలా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలన్న సందేశంతో పలువురు నేతలు హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. కొందరికి అమిత్ షా ఫోన్ చేస్తే.. పలువురికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేసి.. తాజాగా వారికి వచ్చిన అవకాశం గురించి చెప్పి.. ఢిల్లీకి రావాలని ఆహ్వానించారు. దీంతో.. పలువురు వెంటనే ఢిల్లీకి బయలుదేరారు.
Tags:    

Similar News