మరి.. అతగాడి తండ్రిని చంపిందెవరు?

Update: 2015-12-12 05:12 GMT
తాను నిర్దోషిగా బయటపడటంపై భావోద్వేగానికి గురైన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కన్నీళ్లు పెట్టాడు. ఆ సమయంలో..  అదే కోర్టు హాల్లో మరొకరు కార్చిన కన్నీటిని మీడియాతో సహా ఎవరూ పట్టించుకోలేదు.  13 ఏళ్ల నుంచి తమ కుటుంబానికి జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుందని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసి.. తాజాగా బొంబాయి కోర్టు ఇచ్చిన తీర్పుతో అవాక్కయాడు 26 ఏళ్ల ఫిరోజ్ షేక్. ఇంతకీ ఇతడెవరంటారా? హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ కారు ఢీ కొన్న ఘటనలో మరణించిన నూరుల్లా ఖాన్ కుమారుడు.

వాహనాన్ని ఢీ కొట్టటం కారణంగా వ్యక్తి మరణానికి కారణమయ్యారంటూ సల్మాన్ తప్పును నిరూపించటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందంటూ.. సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించటంపై ఫిరోజీ షేక్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. పదమూడేళ్లుగా తన మనసులో ఉన్న ప్రశ్నలు అలానే ఉండిపోతున్నాయనన అతగాడు.. ఇంతకీ తన తండ్రిని ఎవరు చంపారన్న ప్రశ్నకు సమాధానం దొరకటం లేదని వాపోయాడు.

‘‘ఆయన అమాయకుడైతే.. నా తండ్రిని చంపిందెవరు? ఆయనెలా చనిపోయారు? దానికి బాధ్యులు ఎవరు?’’ అంటూ వేస్తున్న ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. సల్మాన్ ఖాన్ నిర్దోషి కావటంపై తనకు బాధ లేదన్న ఆ యువకుడు.. తన తండ్రి మరణానికి కారకుడు ఎవరో తెలియాలని.. అప్పటివరకూ తన తండ్రి ఆత్మకు శాంతి కలగదని వ్యాఖ్యానిస్తున్నాడు. తాను అడుగుతున్న ప్రశ్నలకు ఇప్పటికి ఎవరూ సమాధానం చెప్పాలని.. సూటిగా ప్రశ్నిస్తున్నాడు. సూటిగా అడుగుతున్న ఫిరోజీ షేక్ ప్రశ్నలకు సమాధానం చెప్పేవారెవరు? అతడు కార్చే కన్నీటిని ఏ కెమేరా ఎందుకు పట్టించుకోదు? లాంటి సందేహాలు ఎప్పటికి తీరేను..?
Tags:    

Similar News