సూర్యాపేట కాంగ్రెస్ టిక్కెట్ ఎవ‌రిది...?

Update: 2022-01-27 10:32 GMT
సూర్యాపేట కాంగ్రెస్ లో వ‌ర్గ‌పోరు ఇప్ప‌ట్లో తీరేలా లేదు. ఏళ్లు మారినా.. ఓటములు ఎదురైనా ఎవ‌రికి వారే య‌మునాతీరే. ఐక‌మ‌త్యంతో ఉండి క‌చ్చితంగా గెల‌వాల్సిన నియోజ‌క‌వ‌ర్గాన్ని నేత‌లు త‌మ స్వ‌యంకృతాప‌రాధంతో చేజేతులా పోగొట్టుకున్నారు. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న‌ట్లే ఇక్క‌డా వ‌ర్గ‌పోరు ఆ పార్టీని వెంటాడుతోంది. సీనియ‌ర్, జూనియ‌ర్ నేత‌ల మ‌ధ్య పార్టీ శ్రేణుల చీలిక స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది.

పార్టీ స‌భ్య‌త్వ న‌మోదులో ఇది మ‌రోసారి బ‌హిర్గ‌త‌మైంది. డిజిట‌ల్ స‌భ్య‌త్వ న‌మోదును పార్టీ అధిష్ఠానం ఇటీవ‌ల చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. దీంట్లో కూడా ఎవ‌రికి వారు వేర్వేరుగా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. డిజిట‌ల్ లింక్ ను వేర్వేరుగా తెచ్చుకొని ఆధిప‌త్యం చెలాయిస్తున్నారు. పార్టీ సీనియ‌ర్ నేత రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి, టీపీసీసీ కార్య‌ద‌ర్శి ప‌టేల్ ర‌మేష్ రెడ్డి వేర్వేరుగా ప‌నిచేసుకుపోతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి కాంగ్రెస్ స్వ‌ల్ప మెజారిటీతో ఓడిపోవ‌డానికి ఇది కూడా ఒక కార‌ణం.

తుంగ‌తుర్తి నుంచి ఐదుసార్లు గెలిచి ప‌లు మంత్రి ప‌ద‌వులు నిర్వ‌హించిన రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అనంత‌రం 2009లో సూర్యాపేట నుంచి పోటీ చేసి గెలిచి వైఎస్ కేబినెట్ లో మ‌రోసారి మంత్రి ప‌ద‌వి చేప‌ట్టారు. 2014, 2018 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ త‌ర‌పున మంత్రి జగ‌దీశ్ రెడ్డి విజ‌యం సాధించారు. క్రితం ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలిచే అవ‌కాశం ఉన్నా నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కొర‌వ‌డి స్వ‌ల్ప ఆధిక్యంతో టీఆర్ఎస్ గెలిచింది.

ఇక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌పున రెండు సార్లు బ‌రిలో నిలిచిన‌ ప‌టేల్ ర‌మేష్ రెడ్డి గ‌ట్టి పోటీ ఇచ్చారు. రెండు మూడు స్థానాల్లో నిలిచి త‌న ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. రేవంత్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ర‌మేష్ రెడ్డి 2018లో ఇక్క‌డి నుంచి టికెట్ ఆశించారు. కానీ, అధిష్ఠానం సీనియ‌ర్ అయిన దామోద‌ర్ రెడ్డికే టికెట్ కేటాయించింది. 2019 న‌ల్ల‌గొండ లోక్ స‌భ టికెట్ ఆశించినా ర‌మేష్ రెడ్డికే నిరాశే ఎదురైంది. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆ సీటును ఎగ‌రేసుకుపోయారు.

అధిష్ఠానం భ‌విష్య‌త్తు హామీ ఇవ్వ‌డంతో అప్ప‌టి నుంచి పార్టీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు ప‌టేల్ ర‌మేష్ రెడ్డి. రేవంత్ కు పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి రావ‌డంతో ఆయ‌న అనుచ‌రుడైన ప‌టేల్ ఈసారి సూర్యాపేట సీటు త‌న‌కే వ‌స్తుంద‌నే ధీమాతో ఉన్నారు. అధిష్ఠానం హామీ ఇచ్చిన విష‌యాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. కోమ‌టి రెడ్డి వ‌ర్గ‌మైన దామోద‌ర్ రెడ్డి మాత్రం మ‌రోసారి త‌నే బ‌రిలో ఉంటాన‌ని అనుచ‌రుల వ‌ద్ద చెప్పుకుంటున్నారు. ఈ ఇద్ద‌రు నేత‌లు గ్రూపులుగా విడిపోయి వేర్వేరు కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారు. రేవంత్ చొర‌వ తీసుకొని ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గెలుపు బాట ప‌ట్టించాల‌ని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!


Tags:    

Similar News