బీజేపీని ఎవ‌రు న‌మ్మాలి.. ఎందుకు న‌మ్మాలి?

Update: 2023-02-20 05:00 GMT
బీజేపీని ఎవ‌రు న‌మ్మాలి..? ఎందుకు న‌మ్మాలి? ఇదే మాట సోష‌ల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. బీజేపీ తో ఎవ‌రు పొత్తు పెట్టుకున్నా..ఎవ‌రు క‌లిసి న‌డిచినా.. ఇక అంతే! అనే మాటే వినిపిస్తోంది. ప్ర‌స్తుతం మ‌హా రాష్ట్ర‌లో జ‌రిగిన విష‌య‌మే కాదు.. గతంలో త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రంలోనూ.. హ‌రియాణా వంటి రాష్ట్రం లోనూ జ‌రిగిన ప‌రిణామాల‌ను వారు ఉటంకిస్తున్నారు.

ఏరు దాటే దాకా.. ఓడ‌ మ‌ల్ల‌న్న .. ఏరు దాటాక‌.. ఓడి మ‌ల్ల‌న్న‌! అన్న చందంగా బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం ఇటీవ‌ల కాలంలో  ఎక్కువ‌గా వినిపిస్తోంది. అందుకే ... ఇప్పుడు బీజేపీతో పొత్తు అన‌గానే సందేహాలు వ్య‌క్తం చేయాల్సిన ప‌రిస్థితి రాజ‌కీయాల్లో క‌నిపిస్తోంది. మ‌హారాష్ట్రంలో2019లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో శివ‌సేన‌తో పొత్తు కు బీజేపీ ప్ర‌య‌త్నం చేసింది. వాస్త‌వానికి రెండు పార్టీల హిందూత్వం ఒక‌టే క‌నుక పొత్తుకు రెడీ అయింది.

అయితే.. సీఎం సీటు విష‌యంలో బీజేపీ మంకు ప‌ట్టుప‌ట్టింది. సీట్ల‌తో సంబంధం లేదు.. ఓట్లతోనూ సంబంధం లేదు.. సీఎం సీటు మాకే కావాల‌ని చెప్పింది. ఎన్నిక‌లు అయిపోయిన ద‌రిమిలా .. ఏర్ప‌డిన ఈ వివాదం శివ‌సేన‌కు మంట‌పుట్టించింది. వెంట‌నే బీజేపీకి రాం రాం చెప్పి.. కాంగ్రెస్‌, ఎన్సీపీల‌తో చేతులు క‌లిపింది. ఈ క్ర‌మంలోనే కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు.. "శివ‌సేన ఎలా బ‌తికి బ‌ట్ట‌క‌డుతుందో చూద్దాం" అని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు.

అనుకున్న‌దే త‌డ‌వుగా.. బాల ఠాక్రే పెంచి పోషించిన మొక్క ఏక్‌నాథ్ షిండేను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని.. ప్ర‌భుత్వాన్ని కూల్చేశారు. పార్టీని లాగేసుకున్నారు.  స‌రే.. ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లు ఎందుకు వ‌స్తున్నాయంటే.. ఇత‌ర రాష్ట్రాల్లోనూ బీజేపీ ఇలానే విస్త‌రించే ప్ర‌మాదం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం త్రిపుర‌లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని అంటున్నారు. ఇక్కడి స్తానిక పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లింది. ఏం తేడా వ‌చ్చినా.. స‌ద‌రు పార్టీని విలీనం చేసుకోవ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. దీంతోనే బీజేపీని ఎలా న‌మ్మాలి? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News