తెలంగాణ క్రెడిట్ ఎవరికి దక్కాలి?

Update: 2015-11-19 17:30 GMT
తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఖ్యాతి ఎవరికి దక్కాలి? తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి పోరాడిన కేసీఆర్ కా? తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ కా? తెలంగాణ రావడానికి సహకరించిన టీడీపీ - బీజేపీలకా? తెలంగాణ కోసం పోరాడిన ఉద్యోగులకా? విద్యార్థులకా? ఎవరికి దక్కాలి? అంటే.. నిజానికి తెలంగాణ ఖ్యాతి దాని కోసం పోరాడిన ప్రతి ఒక్కరిదీ. ఇందులో ఏ ఒక్కరూ ఎక్కువా కాదు.. ఏ ఒక్కరూ తక్కువా కాదు. కానీ, తెలంగాణ మొత్తం క్రెడిట్ నాకే దక్కాలని అనుకోవడంలోనే సమస్య అంతా ఉంది.

నేనంటే తెలంగాణ.. తెలంగాణ అంటే నేను అని టీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనుకుంటున్నారు. అలా అయితేనే, తెలంగాణలో ఎప్పటికీ తాను, తన పార్టీ చిరస్థాయిగా ఉంటాయని ఆయన విశ్వసిస్తున్నారు. అందుకే, తెలంగాణ వచ్చే వరకూ అన్ని పార్టీలనూ ఏకతాటిపైకి తీసుకొచ్చి పోరాడాలని చెప్పిన ఆయన.. తెలంగాణ వచ్చిన మరు క్షణం నుంచీ ఆ క్రెడిట్ తనదేనని పదే పదే చెబుతున్నారు. తన నిరాహార దీక్ష కారణంగానే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని తూలనాడుతున్నారు. ఒక్క సోనియా గాంధీ మినహా ఆ పార్టీ నాయకులందరిపైనా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో, దిక్కు లేకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చిందని, లేకపోతే ఇచ్చేది కాదని పదే పదే చెబుతున్నారు. తద్వారా తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ వచ్చిందనే భావనను కలిగించడమే ఆయన ప్రధాన లక్ష్యం. ఆ భావన వస్తే తెలంగాణ అంటే టీఆర్ఎస్.. టీఆర్ ఎస్ అంటే తెలంగాణ అనే భావన ఏర్పడుతుంది. అప్పుడు కేసీఆర్ తోపాటు ఆయన కొడుకు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకు కూడా ఎటువంటి ఇబ్బందీ ఉండదు.

అయితే, ఖమ్మంలోనే కేసీఆర్ నిమ్మరసం తాగేశారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మరోసారి తాగారు. నిమ్స్ లో దీక్ష చేస్తూ పెరుగన్నం తినేశారు. ఈ విషయాలన్నీ అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలకు సాక్షాధారాలతో సహా తెలుసు. ఇప్పుడు వాటిని ఆధారసహితంగా బయట పెడుతున్నారు. ఒకొక్కటిగా వివరాలన్నీ బయటకు వస్తే తెలంగాణ జాతిపితగా కీర్తింపబడుతున్న కేసీఆర్ ను తెలంగాణ ప్రజలే ఛీ కొట్టడం ఖాయమని కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దాంతో భవిష్యత్తు రాజకీయాలు మరింత రసవత్తరంగా ఉండనున్నాయి.
Tags:    

Similar News