కప్ సరే.. 'గోల్డెన్ బూట్' ఎవరికో? 'గోల్ స్కోరు' టై అయితే ఎలా?

Update: 2022-12-17 02:30 GMT
ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ ముగింపునకు వచ్చింది. మరొక్క మ్యాచ్.. "ఫైనల్". ఇటు డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్.. అటు మాజీ చాంపియన్ అర్జెంటీనా.. ఒకరిది పట్టు జారకుడదన్న పంతం.. మరొకరిది 30 ఏళ్ల తర్వాత కప్ గెలవాలన్న కసి.. ఎలాగూ మ్యాచ్ జరిగేకొద్దీ విజేత ఎవరో తెలిసిపోతుంది. అయితే, దీంతోపాటే ఆసక్తికర సమరం మరోటి ఉంది. అదే గోల్డెన్ బూట్. కప్ లో ప్రతిసారీ ప్రపంచ కప్ జరిగిన ప్రతిసారీ 'గోల్డెన్ బూట్' అంశం చర్చకు వస్తుంది.

విజేత జట్టు ఎవరో అనే ఆసక్తి తీరిన తర్వాత అత్యుత్తమ ఆటగాడిగా నిలిచినదెవరో తెలుసుకోవాలనే ఆత్రుత దీనికి కారణం. కప్ లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ కు దక్కే ఈ అవార్డు అతడి క్రీడా జీవితంలో మరుపురానిది అవుతుంది. ఈసారి కాస్త చిత్రమైన సమీకరణం తెరపైకి వస్తోంది. ఫైనల్ కు చేరిన రెండు జట్ల ఆటగాళ్లే గోల్డెన్ బూట్ రేసులో ఉన్నారు. ఫ్రాన్స్ యువ కెరటం కైలిన్ ఎంబపె.. అర్జెంటీనా సారథి లయోనల్ మెస్సీ చెరో ఐదు గోల్స్ తో సమంగా నిలిచారు. అంటే.. ఫైనల్లో వీరిలో ఎవరు ఎక్కువ గోల్స్ చేస్తే వారికే బూట్ దక్కుతుంది.

ఇద్దరూ గోల్స్ సాధించకుంటే...?

వాస్తవానికి ఎంబాపె సెమీఫైనల్లో మొరాకోపై గోల్ చేసి ఉంటే అతడే ముందంజలో ఉండేవాడు. ఇక మెస్సీ సెమీస్ లో క్రొయేషియాపై పెనాల్టీని గోల్ గా మలిచి ఎంబాపెతో సమం అయ్యాడు. ఇప్పుడు వీరు ఫైనల్స్‌లో తలపడుతుండటంతో గోల్డెన్ బూట్‌ ఎవరు వశం చేసుకుంటారా అనేది చర్చనీయాంశం అయింది. ఫైనల్లో ఇద్దరూ గోల్స్ సాధించకుండా 5 గోల్స్‌తోనే ఉంటే పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఎవరు అందుకున్నా తొలిసారే..

ఐదో ప్రపంచ కప్ ఆడుతున్న మెస్సీ.. రెండో కప్ ఆడుతున్న ఎంబాపె కెరీర్‌లో ఎప్పుడూ గోల్డెన్ బూట్ అవార్డును గెలవలేదు. అయితే, ఎంబాపె వయసు ఇప్పుడు 23 ఏళ్లే. అతడు మరిన్ని కప్ లు ఆడే అవకాశం ఉంది. ఇక 35 ఏళ్ల మెస్సీ మాత్రం చివరి కప్ ఆడుతున్నట్లు సంకేతాలిచ్చాడు. వచ్చే కప్ నాటికి అతడికి 39 ఏళ్లు వస్తాయి. ఇక ఇప్పటి విషయానికి వస్తే మెస్సీ-ఎంబాపే ఇద్దరిలో ఎవరు బూట్ అందుకున్నా అది తొలిసారి అవుతుంది.

సమం అయితే.. లెక్క తేలుస్తారిలా..

ఫైనల్లో మెస్సీ-ఎంబాపె ఇద్దరూ గోల్స్ చేయకుంటే.. లేదా చెరో గోల్ కొట్టి సమంగా నిలిస్తే గోల్డెన్ బూట్ కు ఎంపికకు కొన్ని అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. వీరిలో ఎవరు అతి తక్కువ పెనాల్టీల ద్వారా గోల్స్ చేశారో అతడికే గోల్డెన్ బూట్ అవార్డు వస్తుంది. ఈ లెక్కన మెస్సీ మూడు పెనాల్టీలను గోల్స్‌గా మలిచాడు.

నెదర్లాండ్స్, క్రొయేషియా, సౌదీ అరేబియాపై పెనాల్టీలను స్కోరు చేశాడు. కాగా, ఎంబాపే స్కోరు చేసిన గోల్స్ అన్నీ ఫీల్డ్ ద్వారానే. మెస్సీ ఫైనల్స్‌లో గోల్ చేసి ఎంబాపే ఎలాంటి గోల్ స్కోరు చేయకపోతే.. గోల్డెన్ బూట్ మెస్సీనే వరిస్తుంది. ఒకవేళ పెనాల్టీ గోల్స్, ఔట్ ఫీల్డ్ గోల్స్ కూడా టై అయితే అప్పుడు ఏ ప్లేయర్  అయితే తక్కువ గోల్స్ సాధించడంలో తక్కువ పాస్‌లు వినియోగించుకున్నాడో అతన్నే గోల్డెన్ బూట్ అవార్డు వరిస్తుంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News