విశాఖ‌కు ఫ్లైట్స్ త‌గ్గిపోతున్నాయ్.. కార‌ణం ఇదేనా?

Update: 2019-07-22 09:55 GMT
ఏపీ ఆర్థిక రాజ‌ధానిగా అభివ‌ర్ణించే విశాఖ‌ప‌ట్నంకు విమాన సర్వీసులు అంత‌కంత‌కూ త‌గ్గిపోతున్నాయి. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా ఎయిర్ లైన్స్ సంస్థ‌లు త‌మ విమాన స‌ర్వీసుల్ని కేన్సిల్ చేస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో దేశీయ విమాన స‌ర్వీసుల్లో విప‌రీత‌మైన వృద్ధిరేటును న‌మోదుచేసుకున్న విమాన స‌ర్వీసుల్లో విశాఖ ఎయిర్ పోర్ట్ ఒక‌టి.

అలాంటి విశాఖ విమానాశ్ర‌యం నుంచి ప‌లువురు ఆప‌రేట‌ర్లు త‌మ విమాన స‌ర్వీసుల్ని ర‌ద్దు చేసేస్తున్నారు. గ‌డిచిన కొద్ది నెల‌లుగా ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొంది. పెద్ద ఎత్తున ఎయిర్ స‌ర్వీసులు ర‌ద్దు అవుతున్న నేప‌థ్యంలో స్టీల్ సిటీ వాసులు షాకుకు గుర‌వుతున్నారు.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. గ‌డిచిన ఐదేళ్ల‌లో విశాఖ విమానాశ్ర‌యం నుంచి ట్రాఫిక్ విప‌రీతంగా వృద్ధి చెందింది. ఇలాంటివేళ‌.. ఎయిరిండియా త‌న సర్వీసుల్ని కుదించుకోగా.. తాజాగా ఇండిగో సైతం అదే బాట‌లో న‌డ‌వ‌టం గ‌మ‌నార్హం. రీజ‌న‌ల్ క‌నెక్టివిటీ స్కీంలో భాగంగా విమాన‌యాన సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వం చెల్లించాల్సిన రూ.23 కోట్లు చెల్లించ‌క‌పోవ‌టం కూడా తాజా దుస్థితికి కార‌ణంగా చెబుతున్నారు.

ఇటీవ‌ల కాలంలో విశాఖ నుంచి కోచి.. కోల్ క‌తా తో పాటు మ‌రో బెంగ‌ళూరుకు న‌డిపే రెండు స‌ర్వీసులు సైతం ర‌ద్దు అయ్యాయి. తాజా ప‌రిణామాల‌పై విమాన‌యాన ప్ర‌యాణికులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. దేశీయంగా విమాన‌యానం ఊపందుకుంటున్న వేళ‌.. ఇలా స‌ర్వీసుల్ని ర‌ద్దు చేయ‌టం స‌రికాద‌న్న మాట వినిపిస్తోంది.

అయితే.. దేశీయంగా విమానాల కొర‌త‌తో పాటు.. ప్ర‌భుత్వం చెల్లించాల్సిన నిధుల్ని స‌కాలంలో చెల్లించ‌క‌పోవ‌టం కూడా విమాన స‌ర్వీసుల్లో కొర‌త ప‌డ‌టానికి కార‌ణంగా చెబుతున్నారు. మ‌రి.. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో చూడాలి.


Tags:    

Similar News