ఎన్టీయార్ కు ఎందుకు భారతరత్న ఇవ్వటంలేదు?

Update: 2022-09-23 06:00 GMT
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు రాజకీయం కారణంగా బీజేపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. యూనివర్సిటి పేరు మార్పు రాజకీయం వైసీపీ-టీడీపీ మధ్యే జరిగితే తాము ఎక్కడ వెనకబడిపోతామో అన్న ఆందోళనతో బీజేపీ నేతలు కూడా రెచ్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేయటానికి అవకాశం దొరికింది కదాని కమలనాదులు కూడా పదే పదే ఎన్టీయార్ జపం చేస్తున్నారు. బీజేపీ నేత పురందేశ్వరి అంటే ఎన్టీఆర్ కూతురు కాబట్టి మాట్లాడారని అనుకోవచ్చు.

మరి ఏ సంబంధం లేని సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నట్లు. ఎన్టీయార్ అంటే బీజేపీకి విపరీతమైన ప్రేముందని పదే పదే చెబుతున్నారు.

నిజంగానే బీజేపీకి ఎన్టీయార్ అంటే అంత ప్రేమ ఉన్నపుడు మరి భారతరత్న పురస్కారం ఎందుకివ్వటం లేదు. బీజేపీ నేతలంతా కలిసి నరేంద్ర మోడీకి కలిసి ఒత్తిడి పెట్టో లేకపోతే బతిమలాడుకునో ఎన్టీయార్ ను భారతరత్న చేయచ్చు కదా. పార్టీలకు అతీతంగా జనాలు ముఖ్యంగా అన్నగారి అభిమానులు ఎంతో సంతోషిస్తారు.

ఇపుడు ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలని నరేంద్రమోడీ అనుకుంటే చాలు అడ్డుకునే వాళ్ళు కానీ అభ్యంతరాలు చెప్పేవాళ్ళు కానీ ఎవరు లేరు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి కమ్మ సామాజికవర్గంలోని ప్రముఖులను తమ పార్టీవైపు ఆకర్షించాలని అనుకుంటున్న బీజేపీకి ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వటం అన్నది పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. మరీ విషయం గురించి కమలనాథులు ఎందుకని ఆలోచించటం లేదు ?

ఏదో మొక్కుబడిగా ఒక ప్రకటన చేసేసి చేతులు దులిపేసుకోవటం కాకుండా తమ ప్రేమను ఆచరణలో చూపించాలి. అప్పుడే జనాలు బీజేపీ నేతల మాటలను నమ్ముతారు. ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ చాలా సంవత్సరాలుగా వినిపిస్తూనే ఉంది.

ఆ డిమాండ్ ఉత్త డిమాండ్ గా మిగిలిపోకూడదని అనుకుంటే అందుకు అవసరమైన కార్యాచరణను బీజేపీ నేతలు ఇపుడే ఆరంభించాలి. ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎన్టీయార్ రూపంలో కనీసం కొందరైనా బీజేపీని సమర్ధిస్తారేమో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News