రజనీ ఎందుకీ నిర్ణయం తీసుకున్నాడు ?

Update: 2021-07-13 05:16 GMT
రాజకీయపార్టీ పెట్టి నడపటమంటే సినిమాల్లో రాజకీయ నాయకుడి పాత్ర పోషించినట్లని రజనీకాంత్ అనుకున్నట్లున్నారు. అందుకనే అనారోగ్యంతో ఒకవైపు బాధపడుతునే, మరోవైప వయసు మీదపడిన సమయంలో కొత్త రాజకీయపార్టీ పెట్టబోతున్నట్లు గత సంవత్సరం ప్రకటించారు. రజనీ రాజకీయ ప్రకటన చేసిన సమయం, సందర్భం ఎంతమాత్రం సమర్ధనీయం కాదని అప్పట్లోనే చాలామందికి అనిపించింది.

అయినా సరే రాజకీయాల్లో సినిమా డైలాగులు చెప్పినంత సుళువని అనుకున్నట్లున్నారు. అందుకనే ఓ పార్టీ పెట్టేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. రజనీ పార్టీ ప్రకటించినప్పటికి షెడ్యూల్ ఎన్నికలకు మధ్యలో ఉన్న గ్యాప్ కేవలం ఐదు నెలలు మాత్రమే. అయితే రజనీ నిర్ణయాన్ని ఆయన కుటుంబసభ్యులే వ్యతిరేకించారు. దాంతో ఎన్నో తర్జనభర్జనల తర్వాత రాజకీయాల్లోకి వచ్చేది లేదని ప్రకటించారు.

తాజాగా అంటే సోమవారం తాను ఏర్పాటుచేసిన రజనీ మక్కల్ మండ్రం పార్టీని అభిమానుల సంఘంగా మార్చేస్తున్నట్లు చెప్పారు.  భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చేది లేదని స్పష్టంగా ప్రకటించేశారు. ఈ ప్రకటన వెనుక రెండు మూడు కారణాలున్నట్లు తెలుస్తోంది. మొదటిది పార్టీ పెట్టినా ఉపయోగం లేదనే ఫీడ్ బ్యాక్ వచ్చిందట. రెండోది అనారోగ్యం.

అనారోగ్యం కారణంగానే రజనీ అమెరికా వెళ్ళి ప్రత్యేకంగా చికిత్స చేయించుకుని వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. బహుశా అమెరికాలో డాక్టర్లు కూడా రాజకీయాల జోలికి వెళ్ళొద్దని సలహా ఇచ్చినట్లున్నారు. ఎందుకంటే పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ప్రవేశించటానికి రజనీ ప్రస్తుత వయసు 68 ఏమాత్రం సహకరించదని అందరికీ తెలిసిందే.

కాబట్టి రాజకీయాల్లోకి ప్రవేశించి అనామకంగా మిగిలిపోవటం కన్నా ఉపయోగంలేదు. పైగా మొన్ననే డీఎంకే అధికారంలోకి వచ్చిన కారణంగా మరో ఐదేళ్ళు ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు. అందుకనే ఏకంగా రాజకీయాల్లోకి వచ్చేది లేదని హఠాత్తుగా ప్రకటించేశారు.
Tags:    

Similar News