విశాఖను రాజధానిగా అక్కడి ప్రజలు ఎందుకు ఇష్టపడరు?

Update: 2022-10-09 12:30 GMT
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు కాస్త ముందు.. ఎన్నికల వేళలో నాటి అధికార పార్టీ నేతలే కాదు.. విపక్ష నేతగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి మొదలు పలువురు వైసీపీ నేతలంతా కూడా తాము ఎన్నికల్లో అధికారాన్ని సొంతం చేసుకుంటే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని.. ఆ విషయంలో ఎలాంటి సందేహాలు పడాల్సిన అవసరం లేదని నొక్కి వక్కాణించిన ఉదంతాలెన్నో. ఇప్పుడు వైజాగ్ ను రాజధాని చేయాలంటూ బల్లగుద్ది వాదించే మంత్రి ఆర్కే రోజా సైతం.. అప్పట్లో ఎంతలా వాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మరి.. అలాంటి వారంతా ఇప్పుడు వైజాగ్ ను రాజధాని చేయాలని బలంగా చెప్పటమే కాదు.. పిడి వాదనను వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. వైజాగ్ వాసులకు నిజంగానే రాజధాని కల ఉందా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. పార్టీలు.. రాజకీయాలతో సంబంధం లేకుండా చూసినప్పుడు వైజాగ్ వాసులు రాజధాని కోసం తాపత్రయపడటం తర్వాత.. అసలు కోరుకోవటం లేదన్న విషయం అర్థమవుతుంది. ఎక్కడిదాకానో ఎందుకు.. వైజాగ్ రోడ్ల మీద నడుస్తూ.. రాజధానిని మీరు కోరుకుంటున్నారా? అని అడిగితే.. నో అని చెప్పేవారే ఎక్కువగా కనిపిస్తారు.

ఎందుకిలా? అంటే దానికి కారణం.. ఇప్పటికే రాజధాని నగరానికి ఉండాల్సిన హంగు.. ఆర్భాటం విశాఖకు ఉన్నాయి. ఎప్పుడైతే అధికారికంగా రాజధాని అవుతుందో.. అప్పటి నుంచి లేనిపోని తలనొప్పులు వచ్చి పడతాయన్న ఆందోళన ఉంది. ఇప్పటికే రాజధాని వచ్చే అవకాశం ఉందన్న మాటతో రియల్ ఎస్టేట్ భారీగా పెరిగిపోవటంతో పాటు.. కబ్జాలు కూడా ఎక్కువ అవుతాయన్న ఆందోళన ఉంది. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న జీవనాన్ని అదే రీతిలో కొనసాగితే ముఖ్యమే తప్పించి.. రాజధాని ట్యాగ్ పేరుతో నడిచే రచ్చ తమకు అవసరం లేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

రాజధాని నగరంగా డిసైడ్ చేస్తే.. నగరం మరింత రద్దీగా మారటంతో పాటు.. సామాన్యుల జీవనం కష్టమవుతుందని చెబుతున్నారు. గతంలో ఎప్పుడో కాస్మోపాలిటిన్ టౌన్ గా ఉన్న విశాఖను రాజధాని పేరుతో లేని హడావుడితో ప్రశాంత జీవనం మిస్ అవుతుందన్న మాట వినిపిస్తోంది. అధికార హడావుడి ఎక్కువ అవుతుందని.. అందుకే ఇప్పటికే ఉన్న రద్దీ చాలన్న మాట వినిపిస్తుంటుంది. రాజధాని నగరంగా విశాఖ మారితే.. రాజకీయ జోక్యం మరింత పెరుగుతుందని.. అలాంటి పరిస్థితుల్ని తాము కోరుకోవటం లేదన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా.. రాజధాని నగరంగా కంటే కూడా ఉక్కు నగరంగానే విశాఖను వైజాగ్ వాసులు కోరుకుంటున్నారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News