ల‌గ‌డ‌పాటిపై ఈసీ ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌ట్లేదు?

Update: 2018-12-05 10:42 GMT
క్రియాశీల రాజ‌కీయాల‌కు దూర‌మైనా ఎన్నిక‌ల స‌ర్వేల‌తో ఎప్పుడూ వార్త‌ల్లో ఉంటున్నారు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఆయ‌న బ‌య‌ట‌పెట్టిన స‌ర్వే ఫ‌లితాలపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న స‌ర్వే బూట‌క‌మ‌ని కొంద‌రు.. నిజ‌మేన‌ని మ‌రికొంద‌రు వాదిస్తున్నారు. అయితే - ల‌గ‌డ‌పాటి విష‌యంలో చాలామందిని వేధిస్తున్న ఓ ప్ర‌శ్న ఉంది. అదేంటంటే.. అభ్య‌ర్థుల పేర్లు చెప్పి మ‌రీ వారు గెలుస్తారంటున్న ల‌గ‌డ‌పాటిపై ఎన్నిక‌ల క‌మిష‌న్ ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు?

తెలంగాణలో త‌న స‌ర్వేపై ల‌గ‌డ‌పాటి తొలుత తిరుప‌తిలో మాట్లాడారు. ఈ ఎన్నిక‌ల్లో 8-10 మంది స్వ‌తంత్ర అభ్య‌ర్థులు గెలుస్తార‌ని చెప్పారు. వారిలో ఇద్ద‌రి పేర్ల‌ను(నారాయ‌ణ‌పేట‌లో కె.శివ‌కుమార్ రెడ్డి, బోథ్‌లో అనిల్ జాద‌వ్‌) కూడా అప్పుడే బ‌య‌ట‌పెట్టారు. మంగ‌ళ‌వారం మ‌రో ముగ్గురు అభ్య‌ర్థుల పేర్ల‌ను (బెల్లంప‌ల్లి - వినోద్‌, మ‌క్త‌ల్ - జ‌నార్ధ‌న్ రెడ్డి, ఇబ్ర‌హీంప‌ట్నం - మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి) కూడా చెప్పేశారు.

ల‌గ‌డ‌పాటి చెప్పిన ఈ అభ్య‌ర్థులు గెలుస్తారా? లేదా? అన్న‌ది అప్ర‌స్తుతం. అభ్య‌ర్థుల పేర్లు బ‌య‌ట‌కు చెప్తూ వారు గెలుస్తార‌ని స్ప‌ష్టంగా ప్ర‌చారం చేస్తున్న‌ప్ప‌టికీ ఆయ‌న‌పై ఈసీ ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌న్న‌దే చాలా మందికి అంతుచిక్క‌ని విష‌యంగా ఉంది. నిజానికి నిబంధ‌న‌ల ప్ర‌కారం పోలింగ్ పూర్త‌య్యే వ‌ర‌కు ఎవ‌రూ స‌ర్వేల పేరిట ఇలా అభ్య‌ర్థుల పేర్లు ప్ర‌క‌టించ‌కూడ‌దు. ల‌గ‌డ‌పాటి ఆ నిబంధ‌న‌ను తుంగ‌లోకి తొక్కుతున్నారు.

తెలంగాణ‌లో ఈ నెల 7వ తేదీన పోలింగ్ జ‌ర‌గ‌నుంది. దానికి ముందుగానే ఆయ‌న స‌ర్వే ఫ‌లితాలు బ‌య‌ట‌పెడుతున్నారు. గెలిచే అభ్య‌ర్థులంటూ కొంద‌రి పేర్లు చెప్తున్నారు. దీనివ‌ల్ల ఓట‌ర్లు ప్ర‌భావితం అయ్యే అవ‌కాశ‌ముంది. ఇత‌ర అభ్య‌ర్థుల విజ‌యావ‌కాశాలు దొబ్బ‌తినొచ్చు. మ‌రి నిబంధ‌న‌ల‌ను ఇంత బ‌హిరంగంగా ఉల్లంఘిస్తున్న‌ప్ప‌టికీ ఈసీ ఆయ‌న‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌ట్లేద‌ని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
Tags:    

Similar News