హైద‌రాబాద్‌లో క్యాసినో నిర్వాహ‌కులపై ఈడీ దాడులు అందుకేనా?

Update: 2022-07-27 11:30 GMT
నేపాల్‌, శ్రీలంక దేశాల‌తో పాటు దేశంలో ప‌లు ప్రాంతాల్లో క్యాసినోలు నిర్వ‌హిస్తున్న‌వారిపై ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ఏక‌కాలంలో దాడుల‌కు దిగింది. క్యాసినోలు నిర్వ‌హిస్తున్న ఏజెంట్లు, త‌దిత‌రుల ఇళ్ల‌పై ఏకకాలంలో 8 చోట్ల దాడుల‌కు దిగ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

ఈడీ దాడుల వివ‌రాల్లోకెళ్తే.. హైద‌రాబాద్ లోని ఐఎస్ స‌ద‌న్ లో ఉంటున్న చికోటి ప్ర‌వీణ్, బోయిన్ ప‌ల్లిలో ఉంటున్న మాధ‌వ‌రెడ్డి దేశంలో ప‌లు ప్రాంతాల‌తోపాటు శ్రీలంక‌, నేపాల్లోనూ క్యాసినోలు నిర్వ‌హిస్తున్నారు.

వీరిపై విశ్వ‌సనీయ స‌మాచారం అందుకున్న ఈడీ వారి ఇళ్ల‌పై దాడుల‌కు దిగింది. చికోటి ప్రవీణ్‌, మాధవరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నుంచి క్యాసినోల కోసం కొందరిని ప్రవీణ్‌, మాధవరెడ్డి తీసుకెళ్లినట్లు ఈడీ అభియోగాలు మోపుతోంది. క్యాసినోలు ఆడ‌టానికి గానూ ఒక్కొక్కరి నుంచి రూ.3లక్షల వరకు ప్ర‌వీణ్, మాధ‌వ‌రెడ్డి వసూలు చేసినట్లు సమాచారం.

కాగా ప్ర‌వీణ్, మాధ‌వ‌రెడ్డి విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, గుంటూరు, హైద‌రాబాద్ వాళ్ల‌నే కాకుండా కొన్ని నెల‌ల క్రితం ప‌లువురిని తీసుకుని శ్రీలంక‌లో కూడా ఆడించార‌ని చెబుతున్నారు. అలాగే నేపాల్ దేశంలోనూ, ఆ దేశానికి, మ‌న‌దేశానికి ఉన్న సరిహ‌ద్దు ప్రాంతాల్లోనూ వారాల త‌ర‌బ‌డి  క్యాసినోలు నిర్వ‌హించార‌ని తెలుస్తోంది.

అలాగే క్యాసినోలు ఆడేవారు ఉండేందుకు ఏర్పాట్లు సైతం ప్ర‌వీణ్, మాధ‌వ‌రెడ్డి చేసేవార‌ని చెబుతున్నారు. అదేవిధంగా ఈ మ‌ధ్య కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడ‌లో క్యాసినోలు నిర్వ‌హించార‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వీటిలో కూడా చికోటి ప్ర‌వీణ్ ప్ర‌మేయ‌ముంద‌ని అనుమానిస్తున్నారు.

అలాగే క్యాసినోల కోసం డ‌బ్బంతా హవాలా, త‌దిత‌ర అక్ర‌మ మార్గాల్లో విదేశాల‌కు త‌ర‌లించేవార‌ని అంటున్నారు. ఇందుకు ముందుగానే క్యాసినోలు నిర్వ‌హించే శ్రీలంక సంస్థ‌ల‌తో ఒప్పందం కుదుర్చుకునేవార‌ని పేర్కొంటున్నారు. ప్రవీణ్‌, మాధవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశముంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News