వివేకా హత్య కేసుపై సుప్రీం విస్మయం ఎందుకు?

Update: 2022-10-18 05:16 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారి.. చివరకు జాతీయ రాజకీయాల్లోనూ కాస్తంత చర్చ జరిగిన దివంగత మహానేత కమ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత సోదరుతు.. తన సొంతిట్లో అత్యంత దారుణంగా హత్యకు గురైన వైనం గురించి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు తెర మీదకు వచ్చిన షాకింగ్ అంశాలెన్నో ఉన్నాయి. ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు.. దేశంలోనే అత్యుత్తమ విచారణ సంస్థగా పేరున్న సీబీఐకే థోకా ఇచ్చే విషయాన్ని ఆ సంస్థే స్వయంగా సుప్రీంకోర్టులో చెప్పటం.. దానికి విస్మయాన్ని వ్యక్తం చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరరెడ్డి హత్య కేసులో ఆరోపణలున్న నిందితులు సీబీఐ విచారణ అధికారినే బెదిరిస్తున్నారని సీబీఐ తన వాదనలో వెల్లడించింది. దీనిపై దేశ సర్వోత్తమ న్యాయస్థానం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.  ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ పిటిషన్ ను దాఖలు చేసింది. దీనిపై సుప్రీం ద్విసభ్య ధర్మాసనం విచారణను చేపట్టింది.

సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజన్ వాదనలు వినిపిస్తూ.. వివేకా హత్య కేసులో నిందితులతో రాష్ట్ర పోలీసులు కుమ్మక్కు అయినట్లుగా ఆరోపించారు. కనీసం ఛార్జిషీటు దాఖలు చేయలేదన్న విషయాన్ని ప్రస్తావించారు.

కేసు తమ చేతికి వచ్చాక సమగ్ర దర్యాప్తు చేపట్టి 2020 అక్టోబరు 26న ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. దీనికి ముందే ఎర్ర గంగిరెడ్డికి ట్రయల్ కోర్టు బెయిల్ ఇవ్వటంతో దాన్ని రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయిస్తే.. అక్కడ జోక్యం చేసుకోలేదన్నారు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు.

హత్య కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్ గా మారారని.. తన ప్రాణాలకు హాని ఉందని చెప్పారని.. బయటకు రావాలన్న భయపడుతున్నారన్నారు. ఈ కేసు విచారణ అధికారిపైనా కేసు పెట్టి బెదిరిస్తున్నారన్నారు. ఈ కేసులో ప్రధాన సాక్షిని రక్షించుకోవాలంటే గంగిరెడ్డిని జైల్లోనే ఉంచాలన్నారు. ఈ తీరుపై సుప్రీం విస్మయాన్ని వ్యక్తం చేసింది. సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకొని నిందితుడు గంగిరెడ్డికి నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News