కేంద్రం సీబీఐని ఎంత‌గా వాడేస్తోందో.. ఇంత‌క‌న్నా సాక్ష్యం ఎందుకు?

Update: 2022-08-25 02:30 GMT
త‌న న‌చ్చిన  ప్ర‌భుత్వం ఉంటే.. ఆ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసినా.. ఎన్ని త‌ప్పులు చేసినా.. మిన్న కుంటున్న కేంద్ర ప్ర‌భుత్వం.. అదే త‌న‌కు ఏమాత్రం అన‌నుకూల‌త ఉన్నా.. వెంట‌నే సీబీఐని ప్ర‌యోగి స్తోంది. ఒక‌ప్పుడు.. సీబీఐని.. కేంద్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం త‌న‌కు చెంచాగా వాడుకుంటోందని వ్యాఖ్య‌లు చేసి..

నిర‌స‌న‌లు తెలిపిన వారే... ఇప్పుడు అదే స్థానం నుంచి అదే సీబీఐని ఇష్టానుసారం వినియోగించ‌డం..తీవ్ర విమ‌ర్శ‌ల‌కు.. విస్మ‌యానికి కూడా దారితీస్తుండ‌డం గ‌మ‌నార్హం.

సీబీఐని కేంద్రం ఎంత‌గా వాడేసుకుంటోందో.. దానిని అడ్డు పెట్టి.. ఎలాంటి దురాగ‌తాల‌కు పాల్ప‌డుతోం దో.. చెప్పేందుకు తాజాగా బిహార్‌లో జ‌రిగిన ఘ‌ట‌న క‌ళ్ల‌కు క‌డుతోంది. బిహార్‌లో కొత్తగా ఏర్పడ్డ మహా గట్‌బంధన్‌ సర్కారు బలపరీక్షబుధ‌వారం జ‌ర‌గ‌నుంది. అయితే.. త‌మ నుంచి విడిపోయిన‌.. సీఎం నితీష్‌కు ఎలాగైనా షాకివ్వాల‌నే వ్యూహంతో కేంద్రం ఈ రోజే.. అధికార ప‌క్ష పార్టీ ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు జరగడం సంచలనం సృష్టిస్తోంది.

కేంద్ర దర్యాప్తు సంస్థ బుధవారం పట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్‌ సింగ్‌ ఇంట్లో తనిఖీలు చేపట్టింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూప్రసాద్‌ యాదవ్‌ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న రోజుల్లో జరిగిన 'ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌' కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ తనిఖీలపై సింగ్‌ స్పందిస్తూ.."ఇప్పటికే ఒక సారి తనిఖీలు చేశారు. మళ్లీ చేయడంలో అర్థం లేదు. భయభ్రాంతులను సృష్టించి ఎమ్మెల్యేలను వారికి అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు.

ఇదే కుంభకోణానికి సంబంధించి ఆర్జేడీకి చెందిన మరో నేత, ఎంపీ అష్ఫాక్‌ కరీం ఇంటిపై కూడా సీబీఐ దాడులు నిర్వహించింది. ఈ దాడులపై ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా స్పందిస్తూ "ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు.. బీజేపీ దాడులు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అవి బీజేపీ కిందే పనిచేస్తాయి. వారి ఆఫీసులను కూడా ఆ పార్టీ స్క్రిప్టే నడిపిస్తుంది. నేడు బిహార్‌ అసెంబ్లీలో బల పరీక్ష ఉంది.. అదే సమయంలో ఇక్కడేం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు" అని పేర్కొన్నారు.

అయితే సీబీఐ దాడులపై బీజేపీ వాద‌న ఏంటంటే.. అప్పట్లో ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణంపై సీఎం నీతీశ్ కుమార్ స్వయంగా ఫిర్యాదు చేశారని, అందులో భాగంగానే దాడులు జ‌రుగుతున్నాయ‌ని చెబుతోంది. వాస్త‌వానికి  అప్ప‌ట్లో ఎప్పుడో ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌నేది ప్ర‌శ్న‌. ఏదేమైనా.. కేంద్రం దుర్నీతికి..ఇది మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలిపోతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News