ఉద్యోగ సంఘాలకు ఏమైంది ?

Update: 2021-12-17 05:31 GMT
డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 7వ తేదీ నుంచి ఆందోళన చేస్తున్న ఉద్యోగులు తాత్కాలికంగా తమ ఆందోళనను పక్కన పెట్టారు. తమ సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి తమ ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. అంతా బాగానే ఉంది కానీ మరి గడచిన పది రోజులుగా ఉద్యోగ సంఘాలు ఎందుకు ఆందోళన చేస్తున్నాయో ఎవరికీ అర్థం కాలేదు.

సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వటమే ఆందోళన విరమణకు నిజమైన కారణమనటంలో అర్ధం లేదు. ఎందుకంటే ఆందోళన మొదలు కాక ముందు నుంచి సమస్యలను పరిష్కరిస్తానని ప్రభుత్వం చెబుతోంది. మరప్పుడేమో ప్రభుత్వం మాటను పెడచెవిన పెట్టి ఆందోళనకు ఎందుకు పిలుపిచ్చినట్లు ? ఆందోళన మొదలు పెట్టకముందు ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతు ప్రభుత్వం మీద నమ్మకం పోయిందన్నారు.

ఉద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వాలను దింపేయగలం, అలాగే అందలం ఎక్కించగలమంటు బెదిరించారు. తమతో పెట్టుకుంటే ఏమవుతుందో చంద్రబాబునాయుడుకు బాగా తెలుసని చెప్పి జగన్మోహన్ రెడ్డిని బెదిరించాలని ప్రయత్నించారు. తమకు సక్రమంగా జీతాలు ఇవ్వలేనపుడు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, సలహాదారులు మాత్రం జీతాలు ఎలా తీసుకుంటున్నారంటు రెచ్చిపోయారు.

సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వానికి తమకు పీఆర్సీ, డీఏలు మంజూరు చేయడానికి నిధులు లేవా అంటు నిలదీశారు. ఒకటేమిటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలానే మాట్లాడారు. ఆందోళన మధ్యలోనే ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు మొదలయ్యాయి.

మరి ఏమైందో ఏమో ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డితో జరిగిన చర్చల్లో తమ ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. కారణం ఏమిటంటే తమ డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వటమే అంటున్నారు. మరి ఇదే హామీని మొదటి నుంచి ఇస్తోంది కదా. మరపుడు ప్రభుత్వం మీద నమ్మకం పోయిందన్నారు. ఇఫుడు హఠాత్తుగా ఎందుకు నమ్మకం పెరిగిపోయిందో ?
Tags:    

Similar News