జగన్ తో జీవీఎల్.. ఏంటీ కథ?

Update: 2019-06-12 05:34 GMT
అవసరం కలిసేలా చేస్తుంది.. కలయికగా ఉండేలా చేస్తుంది.. వైసీపీకి వచ్చిన 22 ఎంపీ సీట్లతో ఇప్పుడు దేశంలోనే అత్యధిక ఎంపీ సీట్లువచ్చిన ప్రాంతీయ పార్టీల్లో జగన్ ముందున్నారు. భవిష్యత్ లో జగన్ సాయం కేంద్రానికి అవసరం.. ఇక రాజధాని లేని ఏపీకి కేంద్రంలోని బీజేపీ అండ అవసరం. అందుకే జగన్ కూడా బీజేపీ తో దోస్తీకే మొగ్గుచూపుతున్నారు..

తాజాగా పార్లమెంట్ సమావేశాలకు వేళవుతున్న వేళ బీజేపీకి మిత్రపక్షమైన జేడీయూ దూరమైంది. కేంద్ర కేబినెట్ లో సముచిత స్థానం ఇవ్వడం లేదని బీహార్ సీఎం నితీష్ కేబినెట్ లో చేరకుండా అలిగి వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు బీజేపీ పెద్దలు జేడీయూ స్థానంలో వైసీపీకి గాలం వేస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీకి ఆఫర్ చేసినట్లు సమాచారం. దీనిపై అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు..

అయితే ఏం జరుగుతుందో తెలియదు కానీ.. సడన్ గా ఏపీకి చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ.. సీనియర్ బీజేపీ నేత జీవీఎల్ నరసింహన్ జగన్ తో అమరావతిలో భేటి కావడం రాజకీయంగా హీట్ పెంచింది. వైసీపీని ఎన్డీఏలో చేర్చుకోవడం.. డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇవ్వడంపై చర్చ అని అంతా భావించారు. అయితే భేటి తర్వాత జీవీఎల్ మాత్రం అదేమీ కాదని వివరణ ఇచ్చారు..

గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అంశాలపైనే జగన్ తో మాట్లాడానని.. కేవలం సీఎం జగన్ చేస్తున్న మంచి పనులు చూసి మర్యాదపూర్వక భేటి అని జీవీఎల్ క్లారిటీ ఇచ్చారు. సుష్మ స్వరాజ్ ను తెలుగు రాష్ట్రాల గవర్నర్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు.

అయితే జగన్ తో జీవీఎల్ భేటిని టీడీపీ అనుమానంగా చూస్తోంది. గత ప్రభుత్వహయాంలో జరిగిన అవినీతిని వెలికి తీసి చంద్రబాబును ఇబ్బందిపెట్టేందుకే ఈ భేటి జరిగినట్లు టీడీపీ ఆందోళనగా ఉంది. లోపల ఏం జరిగిందో తెలియదు కానీ.. చంద్రబాబు టార్గెట్ గానే బీజేపీ ముందుకెళ్తోందని అర్థమవుతోందని టీడీపీ అనుమానిస్తోంది.

    

Tags:    

Similar News