ఫామ్ హౌస్ లో కేసీఆర్ నైట్ స్టే చేయటం లేదేమిటి?

Update: 2019-11-18 07:19 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయనకు ఎంతో ఇష్టమైన ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ ఎత్తున ఉండే వ్యవసాయ భూముల మద్యలో నిర్మించిన ఈ వ్యవసాయ క్షేత్రంలో భారీ భవనంతో పాటు.. కూరగాయలతో పాటు భారీ ఎత్తున వాణిజ్య పంటల్ని పండిస్తున్న విషయం తెలిసిందే.

తనకు ఏ మాత్రం అవకాశం లభించినా ఫామ్ హౌస్ కు వెళ్లి సేద తీరే అలవాటు కేసీఆర్ లో మొదట్నించి ఉంది. ఉద్యమ సమయంలోనూ.. రాజకీయ వాతావరణం తనకు అనుకూలంగా లేని వేళ.. ఫామ్ హౌస్ లో నెలల తరబడి గడిపి.. ఒక్కసారిగా తెర మీదకు వచ్చి.. ఉద్యమ వాతావరణాన్ని వేడెక్కించిన వైనం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కూడా రోజుల తరబడి ఫామ్ హౌస్ లో ఉండటాన్ని మర్చిపోలేం. రతన్ టాటా..ట్రంప్ కుమార్తె ఇయాంక లాంటి వారు హైదరాబాద్ కు వచ్చిన సందర్భంలోనూ ఆయన ఫామ్ హౌస్ లోనే ఉండిపోవటం ఆసక్తికర చర్చ జరిగేది.

అలాంటి కేసీఆర్.. ఇటీవల కాలంలో ఫామ్ హౌస్ కు వెళ్లి.. అదే రోజు రాత్రి తిరిగి వచ్చేయటమే తప్పించి.. రాత్రి బస చేయటం లేదంటున్నారు. గతంలో రోజుల తరబడి ఉండే కేసీఆర్.. ఇప్పుడు మాత్రం పొద్దున.. మధ్యాహ్నం.. సాయంత్రం.. ఇలా ఏ వేళలో వెళ్లినా.. రాత్రి అయ్యేసరికి మాత్రం ప్రగతిభవన్ కు వచ్చేయటం ఆసక్తికరంగా మారింది. ఎందుకిలా? అంటే.. ఫామ్ హౌస్ లో భారీ ఎత్తున నిర్మాణం సాగుతుందని చెబుతున్నారు.

నిర్మాణ పనుల నేపథ్యంలో ఆయన ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ.. భద్రతా కారణాలతో పాటు.. రిలాక్స్ కావటానికి అనువుగా లేదన్న భావనతోనే హైదరాబాద్ కు తిరిగి వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి.. ఎందుకని వెళుతున్నట్లు అంటే.. నిర్మాణ పనులు ఎప్పటికప్పుడు సమీక్షించేందుకేనని చెబుతున్నారు. సచివాలయానికి వెళ్లటానికి మక్కువ చూపని కేసీఆర్.. తన ఫామ్ హౌస్ లో నిర్మిస్తున్న భవన నిర్మాణం ఎలా సాగుతుందన్న విషయాన్ని దగ్గరుండి చూసుకోవటానికి వెళుతున్న వైనంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది
Tags:    

Similar News