ఇంట‌ర్ వివాదంపై కేటీఆర్ సైలెన్స్‌!..రీజ‌నేంటీ సారూ!

Update: 2019-04-28 07:32 GMT
ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల వెల్ల‌డిలో తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు, ఆ సంస్థ నియ‌మించుకున్న ఓ ప్రైవేట్ సంస్థ గ్లోబ‌రీనా నిర్వాకం కార‌ణంగా రాష్ట్రంలో ఇప్ప‌టికే 20 మంది దాకా విద్యార్థులు బల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డ్డారు. ప‌రీక్ష‌లు బాగా రాసిన విద్యార్థుల‌ను ఫెయిల్ చేసేసిన బోర్డు అధికారులు... ఫెయిల‌వుతామ‌నుకున్న వారిని పాస్ చేసేశారు. వెర‌సి సాధార‌ణంగా ప‌రీక్ష‌లు బాగా రాయ‌ని విద్యార్థులు కూడా అత్తెస‌రు మార్కుల‌తోనైనా పాస్ అవుతాంలే అన్న భావ‌న‌తో ఉంటారు. అలాంటిది ప‌రీక్ష‌లు బాగా రాసి మంచి మార్కులు వ‌స్తాయ‌ని భావించే విద్యార్థులు ఫెయిల్ అయితే తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌వుతారు.

అయితే విద్యార్థుల మ‌నోభావాలు, వారి తల్లిదండ్రుల ఆశ‌ల‌ను ఇంట‌ర్ బోర్డు అధికారులు చాలా లైట్ తీసుకున్న‌ట్లు క‌నిపించింది. త‌ప్పు జ‌రిగిన మాట నిజ‌మేనంటూ బోర్డు కార్య‌ద‌ర్శి చేసిన ప్ర‌క‌ట‌న ఆందోళ‌న‌ల‌కు ఆజ్యం పోసింది. వారం రోజుల‌కు పైగా రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అటు ఇంట‌ర్ బోర్డుతో పాటు ఇటు సీఎం క్యాంపు కార్యాల‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద కూడా ఆందోళ‌న‌లు జ‌రిగాయి. ఇలా ఏ పెద్ద ప‌రిణామం చోటుచేసుకున్నా... టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ చాలా వేగంగా స్పందిస్తారు. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే కేటీఆర్ రాష్ట్రంలో ఎక్క‌డ ఏం జ‌రిగినా కూడా వెనువెంట‌నే రెస్పాండ్ అవుతుంటారు. అయితే ఇంట‌ర్ వివాదంపై మాత్రం ఆయ‌న ఇందుకు భిన్న‌మైన వైఖ‌రిని అవ‌లంబించార‌నే చెప్పారు. 2

20 మంది విద్యార్ధులు ప్రాణాలు తీసుకున్నా... ఆందోళ‌న‌తో రాష్ట్రం అట్టుడికినా గానీ... కేటీఆర్ స్పందించిన దాఖ‌లానే క‌నిపించ‌లేదు. కేటీఆర్ స్పందించ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాలేంట‌న్న కోణంలో ఇప్ప‌టికే చాలా ర‌కాల విశ్లేష‌ణ‌లు జ‌రిగాయి. తాజాగా టీ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పొన్నం ప్ర‌భాక‌ర్... కేటీఆర్ వైఖ‌రిపై నిప్పులు చెరిగారు. విద్యార్థులు చ‌నిపోతుంటే... ఈ వివాదంపై స్పందించ‌డం గానీ, విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ‌కు క‌నీసం ఓ ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డంపై కేటీఆర్ వైఖ‌రిని నిర‌సిస్తూ ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు ఏమాత్రం అర్హ‌త‌లు లేని గ్లోబ‌రీనా సంస్థ‌కు బోర్డు ద్వారా రూ.125 కోట్ల కాంట్రాక్టు ద‌క్క‌డానికి కేవ‌లం కేటీఆర్ రెక‌మెండేష‌నే కార‌ణ‌మ‌ని కూడా పొన్నం ఆరోపించారు.

తాను ఎంపిక చేసిన కంపెనీ త‌ప్పు చేస్తే తానెలా స్పందించాలి? అన్న కోణంలోనే కేటీఆర్ మౌనమునిలా మారిపోయి ఉంటార‌ని పొన్నం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికైఆ క‌ళ్లు తెరిచి ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న విద్యార్థుల కుటుంబాల‌కు బాస‌ట‌గా నిల‌వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. బోర్డు ప్ర‌క్షాళ‌న కోస‌మంటూ ఏర్పాటు చేసిన త్రిస‌భ్య క‌మిటీ నివేదిక‌ను ర‌హ‌స్యంగా ఉంచాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించిన పొన్నం... త‌క్ష‌ణ‌మే ఆ నివేద‌క‌ను బ‌హిర్గతం చేయాల‌ని డిమాండ్ చేశారు. మొత్తంగా ఈ వ్య‌వ‌హారంపై నోరిప్ప‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్న కేటీఆర్ పెద్ద అనుమానాల‌నే రేకెత్తించార‌ని చెప్పాలి.


Tags:    

Similar News