మోదీతో వైరం... రామోజీ స్వ‌యంకృత‌మేనా?

Update: 2019-06-06 09:38 GMT
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో ఈనాడు గ్రూపు సంస్థ‌ల అధినేత రామోజీరావు మిత్రుత్వం జ‌నానికి బాగానే తెలుసు. రామోజీ జాకీలేసి లేపిన టీడీపీతో మిత్రుత్వం ఉన్నా, లేకున్నా... అస‌లు టీడీపీ ప్ర‌స్తావ‌న లేకుండానే మోదీతో రామోజీకి ఫ్రెండ్ షిప్ ఏర్ప‌డింది. అది వ్యాపారప‌రంగా కావ‌చ్చు, లేదంటే రాజ‌కీయ ప‌రంగానే కావ‌చ్చు. ఇద్ద‌రూ రెండు రాష్ట్రాల‌కు చెందిన వారైన‌ప్ప‌టికీ మోదీ, రామోజీల మ‌ధ్య గ‌ట్టి బంధ‌మే ఏర్ప‌డింది. ఈ బంధం క‌ల‌కాలం సాగుతుంద‌ని కూడా అంతా అనుకున్నారు. అయితే ఎందుక‌నో గానీ... మోదీ వ‌రుస‌గా రెండోసారి ప్ర‌ధాని అయ్యేదాకా కూడా ఆ బంధం నిల‌వ‌లేదు క‌దా. ఇప్పుడు ఇద్ద‌రూ బ‌ద్ధ శ‌త్రువులుగానే మారిపోయార‌ని చెప్పాలి.

మోదీ, రామోజీ మిత్రుత్వానికి నిద‌ర్శ‌నాలుగా చాలా విష‌యాలే మ‌న‌కు క‌ళ్ల ముందు క‌న‌బ‌డ‌తాయి. టీడీపీతో బీజేపీకి మైత్రి ఉన్నా, లేకున్నా కూడా ఈనాడు పేప‌ర్ తో పాటు ఈటీవీలోనూ బీజేపీకి మంచి క‌వ‌రేజీ ద‌క్కిన విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే. టీడీపీ, బీజేపీ దూరంగా ఉన్న స‌మ‌యంలోనూ ఈ క‌వ‌రేజీ ఎంత‌మాత్రం త‌గ్గిన దాఖలా క‌నిపించ‌లేదు. ఈ మిత్రుత్వానికి నిద‌ర్శ‌నంగా మోదీ తొలిసారి ప్ర‌ధానిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన సంద‌ర్భంగా ఆయ‌న నుంచి అందిన వీవీఐపీ ఆహ్వానాల్లో రామోజీకి కూడా ఒక‌టి అందింది. నాడు మోదీ ప్ర‌మాణ స్వీకారంలో కేవ‌లం రాజ‌కీయ ప్రముఖులకు మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఫ‌స్ట్ రో లోనే రామోజీకి సీటు ద‌క్కింది. ఈ లెక్క‌న నాడు రామోజీకి ఏ మేర ప్రాధాన్యం ఇచ్చారో ఇట్టే అర్థం కాక మాన‌దు.

అయితే ఐదేళ్లు తిర‌క్కుండానే రామోజీని మోదీ దూరం పెట్టేశారు. తాను రెండోసారి ప్ర‌ధానిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్న కార్య\క్ర‌మానికి రామోజీని మోదీ అస‌లు పిల‌వ‌నే లేదు. ఐదేళ్ల నాడు తొలి వ‌రుస‌లో ఆసీనులైన రామోజీకి మోదీ ఈ ద‌ఫా అస‌లు ఆహ్వాన ప‌త్రికే పంపలేదు. వెర‌సి మొన్న‌టి మోదీ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వంలో రామోజీ అడ్రెస్ క‌నిపించ‌లేదు. అయినా ఈ ఐదేళ్ల‌లోనే ఏం జరిగింద‌ని రామోజీని మోదీ దూరం పెట్టేశారు? ఈ దిశ‌గా ఆలోచ‌న చేస్తే ప‌లు సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని చెప్పాలి. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ క‌లిసి పోటీ చేసినా... 2019 వ‌చ్చేస‌రికి టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు వైఖ‌రి కార‌ణంగా ఆ రెండు పార్టీల మ‌ధ్య మైత్రి ప‌టాపంచ‌లు కాగా... రెండు పార్టీలు బ‌ద్ధ విరోధులుగా మారిపోయాయి. ఈ క్ర‌మంలో టీడీపీకి జాకీలేయ‌డాన్ని మానుకోకున్నా.. మోదీ పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోయేవారేమో. ఏనాడూ బీజేపీకి వ్య‌తిరేకంగా వార్త‌లు రాయ‌ని ఈనాడులో బీజేపీని టార్గెట్ చేస్తూ వార్త‌లు వ‌చ్చాయి.

బీజేపీకి ఆగ‌ర్భ శ‌త్రువుగా ఉన్న కాంగ్రెస్ తో టీడీపీ క‌లిసేందుకు య‌త్నించిన సంద‌ర్భంగా రామోజీ సైలెంట్ గా ఉన్నా స‌రిపోయేదేమో... అందుకు విరుద్ధంగా రామోజీనే ఇనిషియేష‌న్ తీసుకుని మ‌రీ రాహుల్ గాంధీ, చంద్ర‌బాబుల మ‌ధ్య కొత్త మైత్రికి అంటు క‌ట్టారు. ఈ విష‌యం మోదీకి బాగానే కోపం తెప్పించింద‌ట‌. ఈ క్ర‌మంలో రాష్ట్రానికి వ‌చ్చిన అమిత్ షాను మోదీ నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీ పంపారు. కాంగ్రెస్ తో టీడీపీ మైత్రికి స‌హ‌క‌రించ‌వ‌ద్ద‌ని షాతో చెప్పించారు. అయితే ఆ మాట‌ల‌ను రామోజీ పెడ‌చెవిన పెట్టార‌ట‌. దీంతో త‌న శ‌త్రువుల‌తో క‌లిసి త‌న ప‌రాజ‌యానికి పావులు క‌దుపుతారా? అంటూ రామోజీపై మోదీ అల‌క‌బూనార‌ట‌. ఈ అల‌క అప్ప‌టిక‌ప్పుడు క‌రిగిపోలేదు. మిత్రుత్వం కాస్తా.,.. శ‌త్రుత్వంగా మారే దాకా పోయింది. అంటే మోదీతో ఉన్న బ‌ల‌మైన స్నేహాన్ని రామోజీ త‌న‌కు తానుగా తెంచేసుకున్నార‌న్న మాట‌.
    
    

Tags:    

Similar News