దాయాదికి అణుయుద్ధం చేసేంత సీన్ అస్సలు లేదట

Update: 2019-08-28 06:25 GMT
భరత్ కర్నాడ్. సామాన్య ప్రజలకు ఆయనేమీ ఫేమస్ కాదు. ఆ మాటకు వస్తే.. చాలామంది మాదిరి అదే పనిగా వార్తల్లో ఉండేందుకు పెద్దగా ఇష్టపడరు. తన గురించి ఎవరికి తెలీయాలో వారికి మాత్రమే తెలిసేలా ఉండటం ఆయనకు అలవాటు. ఇంతకీ ఆయన ఎవరంటే.. భారత అణు విధాన రూపకల్పన సభ్యుడు. అంతేకాదు.. జాతీయ భద్రతా సలహామండలి మాజీ సభ్యుడు కూడా. భారత్ - పాక్ మధ్య అణుయుద్ధం జరిగే అవకాశం ఉందా?  లేదా?  అన్న విషయాన్ని ఆయనకు మించి స్పష్టంగా చెప్పే వారు ఉండదనే చెప్పాలి.

జమ్ముకశ్మీర్ అంశంపై మోడీ సర్కారు తీసుకున్న చారిత్రక నిర్ణయం నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అదే పనిగా బెదిరింపులకు దిగటం తెలిసిందే. కశ్మీర్ కోసం అవసరమైతే అణుయుద్ధానికైనా సిద్ధమన్న మాటలు సంచలనంగా మారిన నేపథ్యంలో.. రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే అవకాశం ఎంత ఉందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో భరత్ కర్నాడ్ ఆసక్తికర విశ్లేషణ చేశారు.

ఆయన అంచనా ప్రకారం రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే ఛాన్స్ లేదని తేల్చేశారు. ఎందుకంటే.. అణుయుద్ధం అన్నది పిల్లాట ఎంతమాత్రం కాదు. అది కానీ వస్తే సర్వనాశనమే అన్న విషయం నిజమే అయినా.. అసలు అక్కడి వరకూ విషయం వెళ్లదన్నది ఆయన అంచనా. ఎందుకిలా అంటే.. అణుయుద్ధం చేసేంత ఆర్థిక స్తోమత పాక్ కు లేదు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అందుకు సిద్ధంగా లేదు.

తన హుంకరింపులతో దేశంలో తన పలుకుబడి పెంచుకోవాలని ఇమ్రాన్ భావిస్తున్నారు. కశ్మీర్ విషయంలో తనకున్న కమిట్ మెంట్ ఎంతన్నది చెప్పే ప్రయత్నంతో పాటు.. రాజకీయంగా తనకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నంలో భాగంగా ఇమ్రాన్ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పాలి.

ఇక.. భరత్ కర్నాడ్ చెప్పేదేమంటే.. పాక్ దగ్గర డబ్బుల్లేకపోవటమే కాదు.. ఆయుధాలు కూడా లేవు.. అలాంటప్పుడు యుద్ధానికి ఎలా దిగుతారన్నది ఆయన ప్రశ్న. ఒకవేళ యుద్ధం కానీ వస్తే అదెక్కడి వరకూ వెళుతుందన్న విషయంలోనూ ఆయన క్లారిటీగా ఉన్నారు. యుద్ధం వస్తే అది అణుయుద్ధంగా మారొచ్చు. అణ్వస్త్ర ప్రయోగం వల్ల ఎవరికి ఎంత నష్టం జరుగుతుందో పాక్ ఆర్మీకి తెలియంది కాదు.

పాక్ ఎన్ని తిప్పలు పడినా భారత్ ను సమూలంగా దెబ్బతీయలేరు. అందుకు అవసరమైన అణ్వస్త్రాలు దాయాదికి లేవు. అదే సమయంలో పాక్ ను పూర్తిగా ధ్వంసం చేయటానికి.. సమూలంగా నాశనం చేసే సత్తా భారత్ సొంతం. భారత్ కానీ అణ్వస్త్రాన్ని ప్రయోగిస్తే.. పాక్ మొత్తంగా అంతరించిపోతుంది. అందుకే పాక్ అణు యుద్ధం వరకూ విషయాన్ని తీసుకెళ్లదని చెబుతారు.

అంతేకాదు.. పాక్ తో ఎప్పుడూ మనకు ఎలాంటి ముప్పు లేదని.. కశ్మీర్ పై ఆ దేశానికి న్యూసెన్స్ మాత్రమేనని.. అణుయుద్ధం వస్తుందనే అభిప్రాయం మాత్రం ఒక నాన్సెన్స్ గా అభివర్ణిస్తారు. అణుయుద్ధం అంటూ హడావుడి చేస్తోంది భారత్ కానే కాదు.. పాకిస్థాన్ అయినప్పుడు.. దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదంటారు. సో.. రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరుగుతుందా? అన్న అంశంపై క్లారిటీ వచ్చేసిందా?
Tags:    

Similar News