చిరంజీవి త‌ల్లికి పెన్ష‌న్ పై విమ‌ర్శ‌లు చేయ‌డం క‌రెక్టేనా?

Update: 2022-06-27 07:30 GMT
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజ‌నాదేవి ఇటీవ‌ల తాను దాచుకున్న పెన్ష‌న్ మొత్తంలో ల‌క్ష‌న్న‌ర రూపాయ‌ల‌ను త‌న చిన్న కుమారుడు, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అందించిన సంగ‌తి తెలిసిందే. ఈ మొత్తాన్ని ఆమె ఆత్మ‌హ‌త్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబానికి వాడాల‌ని ప‌వ‌న్ ను కోరారు.

ఏపీలో పంట‌లు పండ‌క‌, గిట్టుబాటు ధ‌ర‌లు లేక‌, ప్ర‌భుత్వ సాయం అంద‌క ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ మూడు వేల మంది కౌలు రైతుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌క్ష రూపాయ‌ల చొప్పున త‌న సొంత నిధుల‌ను అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆయన ప‌శ్చిమ గోదావ‌రి, క‌ర్నూలు, అనంత‌పురం, ప్ర‌కాశం జిల్లాల్లో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ 400 మందికి పైగా రైతుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం చేశారు.

దీనికి అవ‌స‌ర‌మైన నిధిని ప‌వ‌న్ క‌ల్యాణ్ తోపాటు ఇటీవ‌ల ఆయ‌న కుటుంబ స‌భ్యులు వ‌రుణ్ తేజ్, సాయిధ‌రమ్ తేజ్, వైష్ణ‌వ్ తేజ్, నిహారిక‌, డాక్ట‌ర్ మాధ‌వి (ప‌వ‌న్ క‌ల్యాణ్ సోద‌రి) అందించారు. ఇటీవ‌ల వారంతా ప‌వ‌న్ ను క‌ల‌సి 35 ల‌క్ష‌ల రూపాయ‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇచ్చారు. తాజాగా ప‌వ‌న్ మాతృమూర్తి అంజ‌నాదేవి ల‌క్ష‌న్న‌ర రూపాయ‌లు కౌలు రైతుల సంక్షేమ నిధికి అందించారు. అలాగే మ‌రో ల‌క్ష రూపాయ‌ల‌ను పార్టీకి విరాళంగా ప్ర‌క‌టించారు. త‌న‌కు పెన్ష‌న్ కింద వ‌చ్చిన మొత్తాన్ని ఆమె ఇందుకు వినియోగించారు.

అయితే దీనిపైనా ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌లు విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. కోటీశ్వ‌రుడైన చిరంజీవి త‌ల్లికి పెన్ష‌న్ ఏమిట‌ని.. ప్ర‌భుత్వం ఆమెకు పెన్షన్ ఇవ్వ‌డం ఏమిట‌ని సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే ఈ విమ‌ర్శ‌ల‌కు జ‌న‌సేన పార్టీ శ్రేణుల నుంచి గ‌ట్టి కౌంట‌ర్లే ప‌డుతున్నాయి.

ప‌వ‌న్ మాతృమూర్తికి పెన్ష‌న్ ఇస్తోంది.. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం కాద‌నే విష‌యాన్ని వైఎస్సార్సీపీ పేటీఎం కూలీలు తెలుసుకోవాల‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ తండ్రి ప్ర‌భుత్వ ఉద్యోగి అని ఆయ‌న మ‌ర‌ణానంత‌రం నిబంధ‌న‌ల ప్ర‌కారమే ఆమెకు పెన్ష‌న్ వ‌స్తోంద‌ని చెబుతున్నారు. అంతేకానీ ఆమె అయాచితంగా ల‌బ్ధి పొంద‌డం లేద‌ని పేర్కొంటున్నారు.

ఆ మాట‌కొస్తే ప్రతి ప్రైవేటు, ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు పెన్ష‌న్ ఫండ్ కింద ప్ర‌తి నెలా జీతంలో కొంత మొత్తం త‌గ్గిస్తార‌ని.. దాన్ని ఉద్యోగి రిటైర‌య్యాక అందిస్తార‌ని చెబుతున్నారు. ఈ చిన్న విష‌యం కూడా వైఎస్సార్సీపీ పేటీఎం కూలీల‌కు తెలియ‌క‌పోవ‌డం ఏమిట‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఎద్దేవా చేస్తున్నారు. ఇప్ప‌టికైనా ఇలాంటి చిల్ల‌ర విష‌యాల‌పై దృష్టిపెట్ట‌కుండా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టాల‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.

అదేవిధంగా ఆమెకు స్టార్ హీరోలు కొడుకులుగా ఉన్నంత‌మాత్రాన వారిపై ఆమె ఆధార‌ప‌డి జీవించాల్సిన అవ‌స‌రం కూడా లేద‌ని అంటున్నారు. ఆత్మ‌గౌర‌వంతో, ఆత్మాభిమానంతో ఎవ‌రిపైనా ఆధార‌ప‌డ‌కుండా త‌న భ‌ర్త పెన్ష‌న్ పై ఆధార‌ప‌డి జీవిస్తే ఇందులో త‌ప్పు ప‌ట్టాల్సింది ఏముంద‌ని నిల‌దీస్తున్నారు.
Tags:    

Similar News