రాజగురువు దగ్గరకు టీడీపీ బిజినెస్‌ నేతల క్యూ.. రీజన్‌ ఇదేనా?

Update: 2019-07-31 09:19 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజగురువుగా ప్రఖ్యాతి చెందిన తెరవెనుక రాజకీయవేత్త- ప్రముఖ మీడియా అధినేత- ఫిలింసిటీ చైర్మన్‌ రామోజీరావు దగ్గరకు టీడీపీలోని ప్రముఖ వ్యాపార వేత్తలు క్యూకట్టారా? ఇప్పుడున్న పరిస్థితిలో టీడీపీ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదని, జగన్‌ బలంగా మారాడని, ఈ నేపథ్యంలో జోక్యం చేసుకుని తమకు దారి చూపించాలని ఆయనను వేడుకున్నారా? అంటే.. గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలు, పోస్టింగులను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. మరోసారి అధికారంలోకి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నా పార్టీ ఆవిధంగా దూసుకుపోలేదు.

పైగా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకున్నా, చంద్రబాబు ఇమేజ్‌ కు సరిపోయే సంఖ్యా బలం మాత్రం టీడీపీ సాధించలేక పోయింది. మరోపక్క, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న జగన్‌.. తనదైన వ్యూహంతో ప్రజల్లో బలంగా నాటుకుంటున్నారు. రాబోయే ముప్పైఏళ్లపాటు తాను అధికారంలోనే ఉండాలని నిర్దేశించుకున్న జగన్‌ ఆదిశగానే ప్రజల్లో పాలనపై సక్సెస్‌ రేటును సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా గత చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిపై ఆయన యుద్ధం చేస్తున్నారు.

దీంతో ఇప్పుడు ఏం మాట్లాడినా.. టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు టీడీపీ చంద్రబాబు మినహా ఎవరూ ముందుకు రావడం లేదు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు తనయుడు లోకేష్‌ ఉన్నప్పటికీ.. ఆయన వల్ల కాదనే నిర్ణయానికి టీడీపీలోని ప్రముఖ వ్యాపార వేత్తలు ఓ నిర్ణయానికి వచ్చారు. అలాగని చంద్రబాబునే నమ్ముకుని ఉందామా? అంటే.. అది కూడా అయ్యే పనికాదని తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం ఆయన అమెరికాలోకి అయోవా క్లినిక్‌ లో చికిత్సకోసం వెళ్లారు.

ప‌రిస్థితులు క్రిటిక‌ల్‌ గా ఉన్న నేపథ్యంలో తమ ఫ్యూచర్‌ ఏంటి? అనే చర్య ఈ నేతల మధ్య కొద్ది రోజులుగా సాగుతోంది. వీళ్లు త‌మ బాధ‌ను నేరుగా చంద్ర‌బాబుకో లేదా లోకేష్‌ కో చెప్పుకోలేరు. అందుకే టీడీపీ స్థాపన నుంచి ఆపార్టీని అన్ని విధాలా నడిపిస్తున్న (తెర‌వెన‌క‌) రామోజీరావు అయితే, సరైన పరిష్కారం చూపిస్తారని భావిస్తున్న ఈ నేతలు గడిచిన రెండు రోజులుగా రామోజీ ఫిలింసిటీకి క్యూ కడుతున్నారు. పార్టీని బతికించుకోవడమా? లేక తమకు మరో మార్గం ఏదైనా ఉందా ? చూపాలని ఆయనను వేడుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి వీరికి రాజగురువు ఎలాంటి సలహాలు ఇస్తారో చూడాలి.
    
    

Tags:    

Similar News