ఒలంపిక్ గేమ్స్ భారత్ లో నిర్వహించకపోవడానికి కారణమేంటి ?

Update: 2021-07-28 09:30 GMT
కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఒలంపిక్స్‌ క్రీడలు ఎట్టకేలకు ఆరంభమయ్యాయి. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన టోక్యో ఒలంపిక్స్‌ గతవారం అంగరంగవైభవంగా ప్రారంభం అయ్యాయి. ప్రపంచ స్థాయి అథ్లెట్స్ తమ విన్యాసాలతో తమ దేశాలకి పథకాలు సాధించి పెడుతున్నారు. మొత్తం 42 వేదికల్లో... 33 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ప్రపంచ దేశాల నుంచి మొత్తంగా 11,500 మంది ఇందులో పాల్గొననున్నారు. మొత్తం 339 స్వర్ణ పతకాలు అందుబాటులో ఉన్నాయి.

ఇదిలా ఉంటే .. ఒలంపిక్ గేమ్స్ గురించి కాసేపు పక్కన పెడితే .. యూరప్‌ లోని చిన్నచిన్న దేశాలలోని నగరాలు ఒలింపిక్స్‌ కు ఆతిధ్యం ఇచ్చాయి. అమెరికాలో అయితే పలు నగరాల్లో ఒలింపిక్స్ జరిగాయి. లండన్, లాస్‌ ఏంజెలస్, పారిస్ వంటి నగరాల్లో మూడేసి సార్లు సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి. జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి ఆసియా దేశాలు కూడా ఈ క్రీడలను నిర్వహించాయి. కానీ, భారత్‌ లో మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం రాలేదు. అలాగే వచ్చే మరో పదేళ్లు అంటే 2032 వరకు కూడా భారత్‌ లోని ఏ నగరంలోనూ నిర్వహించే అవకాశం లేదు. కారణం.. 2032 వరకు వేదికలు ఇప్పటికే డిసైడ్ అయ్యాయి.

ప్రస్తుతం టోక్యోలో జరుగుతున్నది 2020 సమ్మర్ ఒలింపిక్స్ కాగా 2022 వింటర్ ఒలింపిక్స్ చైనాలోని బీజింగ్‌ లో, 2024 సమ్మర్ ఒలింపిక్స్ ఫ్రాన్స్‌ లోని పారిస్‌లో, 2026 వింటర్ ఒలింపిక్స్ ఇటలీలోని మిలన్‌ లో, 2028 సమ్మర్ ఒలింపిక్స్ అమెరికాలోని లాస్‌ ఏంజెలస్‌ లో, 2032 సమ్మర్ ఒలింపిక్స్ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో నిర్వహించేందుకు ఇప్పటికే సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అసలు భారత్ లో ఒలంపిక్ గేమ్స్ నిర్వహించడం సాధ్యమేనా అంటే .. సాధ్యాసాధ్యాలు, అర్హతలు, అనుకూలతలు, విమర్శల సంగతి కాసేపు పక్కన పెడితే భారత్‌ లోని కొందరు నాయకులు వివిధ సందర్భాలలో తమతమ పాలనలో ఉన్న నగరాల్లో ఒలింపిక్స్ నిర్వహించాలన్న ఆశ, ఆకాంక్షను వ్యక్తం చేశారు.

2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేసిన అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహించాలన్న ఆకాంక్షను వివిధ సందర్భాలలో కనబరిచారు. 2016లో విశాఖపట్నంలో ప్రోకబడ్డీ పోటీల ప్రారంభం రోజున చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహించడం తన ఆశయం అని చెప్పారు.

భారత్‌ లోని ఒక నగరంలో ఒలింపిక్స్ నిర్వహించాలన్న ఆలోచన కలిగించింది ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. 2015లోనే ఆయన ఈ దిశగా ఒక ప్రయత్నం చేశారు. 2024 ఒలింపిక్స్ దిల్లీలో నిర్వహించేందుకు అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. ఐఓసీ దృష్టికీ తీసుకెళ్లారు. అయితే, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు థామస్ బచ్ 2015లో భారత్ వచ్చినప్పుడు ఇండియా ఇంకా ఒలింపిక్స్‌కు సిద్ధంగా లేదని అన్నారు.200 దేశాల నుంచి 10 వేల అథ్లెట్లు వస్తారని.. 2024లో భారత్ ఆతిథ్యం ఇవ్వలేదని బచ్ అన్నారు. దాంతో కేజ్రీవాల్ ప్రయత్నాలు అక్కడికి ఆగిపోయాయి.


2018లో అప్పటికి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడణవీస్ కూడా ఇలాంటి ఆకాంక్షనే వ్యక్తం చేశారు.ఆయన మరింత బలంగా దీన్ని ఏకంగా 2018లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రెసిడెంట్ థామస్ బచ్ భారత పర్యటన సమయంలో చెప్పారు.
2032లో ముంబయి ఒలింపిక్స్ నిర్వహణ కోసం బిడ్ వేస్తుందన్నారు. ఫడణవీస్ ప్రతిపాదనకు ఇండియన్ ఒలింపిక్అ సోసియేషన్ (ఐఓఏ), ఐఓసీ అప్పటి సభ్యురాలు నీతా అంబానీ, అప్పటి క్రీడా మంత్రి కిరణ్ రిజిజుల నుంచి మద్దతు లభించింది. ఐఓసీ వద్దకు ప్రతిపాదన కూడా పంపించారు. అయితే, 2021లో ఐఓసీ దీనిపై స్పష్టత ఇచ్చేసింది. 2032 ఒలింపిక్స్ నిర్వహణకు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంతో సంప్రదింపులు ప్రారంభించామని వెల్లడించింది. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభ సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒలింపిక్స్‌ ను ప్రస్తావించారు. ఒలింపిక్స్ వంటి క్రీడలు నిర్వహించేందుకు ఈ కాంప్లెక్స్‌ను మరింత డెవలప్ చేయాలన్నారు.

ఒలింపిక్స్ నిర్వహించే నగరాన్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎంపిక చేస్తుంది. ఆసక్తి చూపిన నగరాల నుంచి వివిధ దశలలో వడపోతల అనంతరం తుది జాబితా సిద్ధం చేస్తారు. ఐఓసీ సభ్య దేశాల ప్రతినిధులు రహస్య బ్యాలట్ పద్ధతిలో ఓట్ వేసి ఎంపిక చేస్తారు.ఐఓసీ గౌరవ సభ్యులు, సస్పెండైన మెంబర్లకు ఓటు హక్కు ఉండదు.ప్రస్తుతం ఐఓసీలో 102 మంది సభ్యులున్నారు. భారత్ నుంచి నీతా అంబానీ సభ్యురాలిగా ఉన్నారు.ఒలింపిక్స్ జరిగే సంవత్సరానికి కనీసం ఏడేళ్ల ముందే ఆతిథ్య నగరాన్ని నిర్ణయిస్తారు. 2032 ఒలింపిక్స్ ఎక్కడ నిర్వహిస్తారనేది ఈ ఏడాది (2021) ఐఓసీ ప్రకటించేసింది. 2024, 2028 ఒలింపిక్స్ ఆతిథ్య నగరాలను 2017 సెప్టెంబరు 21నే నిర్ణయించేశారు.

ఆతిథ్య నగరంగా ఎంచుకోవడానికి ... ఆ నగరంలో ఉన్న క్రీడా సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలున్న స్టేడియంలు, ప్రాక్టీస్ కోసం ఇతర స్టేడియంలు అందుబాటులో ఉన్నదీ లేనిదీ చూస్తారు. దాంతో పాటు వేల సంఖ్యలో వచ్చే అథ్లెట్లు, వారి సిబ్బంది, పర్యటకులు, జర్నలిస్టులకు వసతి, ఇతర సదుపాయల కల్పన, రవాణా సదుపాయాలు కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఒలింపిక్స్ నిర్వహణకు పోటీ పడే నగరం 1.5 లక్షల డాలర్ల రుసుం చెల్లించాలి.

మొదట ఇన్విటేషన్ ఫేజ్ ఉంటుంది. అందులో వివిధ దేశాల ఒలింపిక్ కమిటీలు తమ దేశంలో ఆసక్తి చూపుతున్న నగరాల బిడ్‌లను ఐఓసీ ముందుకుతెస్తాయి.ఆ తరువాత మూడు దశలుంటాయి. అవి 1) విజన్, గేమ్స్ కాన్సెప్ట్, లెగసీ 2) గవర్నెన్స్, లీగల్ అండ్ వెన్యూ ఫండింగ్ 3) గేమ్స్ డెలివరీ, ఎక్స్‌పీరియన్స్ అండ్ వెన్యూ లెగసీ. ఆయా నగరాలకు ఈ మూడు అంశాలకు సంబంధించి సమగ్ర నివేదికలు ఇవ్వాలి.అనంతరం ఎవల్యూషన్ కమిషన్ కొన్ని నగరాల పేర్లతో తుది నివేదికను ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డుకు సమర్పిస్తుంది. ఆ తుది జాబితాలోని అభ్యర్థిత్వ నగరాల నుంచి ఎంపిక చేసేందుకు ఓటింగ్ నిర్వహించి నిర్ణయిస్తారు.

ఒలింపిక్స్ నిర్వహణకు ఎంత ఖర్చవుతుందనేది ఆతిథ్య నగరంలో అప్పటికే ఉన్న మౌలిక సదుపాయలను బట్టి ఉంటుంది. 2016 సమ్మర్ ఒలింపిక్ క్రీడలు నిర్వహించిన బ్రెజిల్‌లోని రియోడీజనిరో నగరానికి 153.1 కోట్ల డాలర్లను ఐఓసీ ఇచ్చింది. అంతకుముందు 2012లో లండన్‌కు 137.4 కోట్ల డాలర్లు, 2008లో బీజింగ్‌కు 125 కోట్ల డాలర్లు, 2004లో ఏథెన్స్‌కు 96.5 కోట్ల డాలర్ల నిధులు సమకూర్చింది.

భారత్‌ లో క్రికెట్ ప్రపంచ కప్‌లు, హాకీ ప్రపంచ కప్, ఆసియా క్రీడలు, కామన్‌వెల్త్ క్రీడలు వంటి అంతర్జాతీయ పోటీలు సమర్థంగా నిర్వహించారు. కానీ, ఒలింపిక్స్‌కు వచ్చే సరికి భారత్ ఇంకా పోటీ పడే స్థాయిలో లేదని ఐఓసీ అధికారులే గతంలో వ్యాఖ్యానించారు.
ఒలింపిక్స్ నిర్వహణకు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రపంచ దేశాల నుంచి వచ్చే వేలాది మంది క్రీడాకారులు, అనుబంధ రంగాల వారికి భద్రత కల్పించడం వంటివీ కీలకాంశాలే. వేర్వేరు క్రీడాంశాలకు సంబంధించి 300కి పైగా ఈవెంట్లను నిర్వహించాలి. ఇందుకోసం పెద్దసంఖ్యలో వేదికలు అవసరం. పోటీలు నిర్వహించే వేదికలే కాకుండా అథ్లెట్ల ప్రాక్టీస్‌కు వేరే వేదికలు అవసరం.

అంతేకాదు.. ఒలింపిక్ అధికారులు, అథ్లెట్లు, వారి కోచ్‌లు, రిఫరీలు, వివిధ దేశాల క్రీడా బృందాలతో వచ్చే అధికారులు, వారి వైద్యులు ఇలా.. అనేక రంగాలకు చెందిన వారు సుమారు 15 వేల మందికి అత్యున్నత స్థాయి వసతి కల్పించాల్సి ఉంటుంది.వీరే కాకుండా క్రీడలు చూసేందుకు లక్షలాది మంది విదేశాల నుంచి వస్తారు. ప్రస్తుత టోక్యో ఒలింపిక్స్ కోవిడ్ కారణంగా ప్రేక్షకులు లేకుండా సాగుతున్నప్పటికి ఇంతకుముందు 2016లో రియోలో జరిగిన పోటీలకు 5 లక్షల మంది ప్రేక్షకులు వచ్చారని అంచనా. అలాగే కొన్ని రకాల క్రీడలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. ఆతిథ్య నగరాలకు ఆ సదుపాయం ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఐఓసీ నిబంధనల ప్రకారం కాలుష్యం, వేస్ట్ మేనేజ్‌ మెంట్, పర్యావరణంపై ప్రభావం వంటి అంశాలనూ చూస్తారు.. అందుకే ఒలంపిక్ గేమ్స్ నిర్వహించే దేశాల సరసన ఇంకా భారత్ చేరలేదు.



Tags:    

Similar News