ఏపీ అసెంబ్లీలో ఈ రోజు సో స్పెషల్ ఎందుకంటే?

Update: 2019-12-16 04:35 GMT
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పాలనా రథాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒకటి తర్వాత ఒకటి చొప్పున.. కొన్నిసార్లు నాలుగైదు అంశాల్ని ఒకేసారి తెర మీదకు తీసుకొచ్చి విషయాల్ని ఒక కొలిక్కి తీసుకురావటంలో అమితమైన వేగాన్ని ప్రదర్శిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

ఇవాల్టి రోజున (సోమవారం) ఏపీ అసెంబ్లీలో 11 కీలక బిల్లుల్ని ప్రవేశ పెట్టనుండటం ఒక విశేషంగా చెప్పాలి. అంతేనా.. ఇప్పటికే సభలో ప్రవేశ పెట్టిన మరో రెండు బిల్లులపైనా ఈ రోజు చర్చ జరగనుంది. పాలనలో మార్పు తేవటానికి.. కొత్త నిర్ణయాల్ని ప్రభుత్వం తీసుకోవటమే కాదు.. అమలు చేసేందుకు వీలుగా పెద్ద ఎత్తున బిల్లుల్ని సభ ముందుకు తీసుకురానున్నారు.

ఈ రోజు సభలో ప్రవేశ పెట్టే బిల్లుల వివరాల్లోకి వెళితే..
1. దశాబ్దాల తరబడి కలలు కంటున్న ఆర్టీసీ ఉద్యోగులు కలల్ని నిజం చేస్తూ ప్రభుత్వంలోకి ఏపీఎస్ ఆర్టీసీని విలీనం చేసేందుకు అవకాశం కల్పించే ఆర్టీసీ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు వీలుగా ఈ బిల్లును సభలోకి తీసుకురానున్నారు.

2. రైతులు పండించే పంటలకు మెరుగైన ధరల్ని కల్పించేందుకు వీలుగా కాఫీ..టీ బోర్డుల తరహాలోనే చిరు.. పప్పు ధాన్యాల బోర్డుల్ని ఏర్పాటు చేయనున్నారు. చిరు.. పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించటమే ఈ బిల్లు లక్ష్యం.

3. చిరు ధాన్యాల పంటలకు మద్దతు ధరలు కల్పించటంతో పాటు పరిశోధన.. మార్కెట్.. ట్రేడ్ ప్రమోషన్.. గోదాములు.. శీతల గిడ్డంగులు.. యాంత్రీకీకరణ.. మార్కెటింగ్ అండ్ ప్రాసెసింగ్ లాంటి విభాగాలకు డైరెక్టర్లను నియమించటంతో పాటు.. ఈ బోర్డులు తమకు తాముగా స్వతంత్రంగా పని చేయాలన్నది లక్ష్యం.

4. దశల వారీగా రాష్ట్రంలో మద్య నియంత్రణ చేపట్టేందుకు వీలుగా ఇప్పటికే నిర్ణయాన్ని తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు అదే బాటలో మరో అడుగు ముందుకు వేయనుంది. మద్యం దుకాణాలను.. బార్ల సంఖ్యను తగ్గించిన రాష్ట్రం.. అందుకు భిన్నంగా వ్యవహరించిన వారి మీద కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.
రాష్ట్రంలో అక్రమంగా మద్యం విక్రయించినా.. రవాణా చేసినా.. తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ నేరాలకు నాన్ బెయిలబుల్ కేసులుగా పరిగణిస్తారు. కనీసం ఆర్నెల్ల నుంచి గరిష్ఠంగా ఐదేళ్ల వరకూ శిక్షలు విధిస్తారు. మొదటిసారి పట్టుబడితే రూ.2లక్షలు.. రెండోసారి పట్టుబడితే రూ.5లక్షలు జరిమానా విధిస్తారు. ఒకవేళ లైసెన్స్ పొందినోళ్లు తప్పులు చేస్తే.. లైసెన్స్ ఫీజు కంటే రెండు రెట్లు ఎక్కువ జరిమానాను వసూలు చేస్తారు.

5. మద్యంపై అదనపు ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ ఎక్సైజ్ చట్టంలో సవరణలు

6. కడప జిల్లాలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ ఏర్పాటు.. వర్సిటీలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్.. కాలేజీ ఆఫ్ ఫైన్ అర్ట్స్ ఏరపాటుకు సంబంధించి చట్టంలో సవరణలు.

7. కర్నూలులో సిల్వర్‌ జూబ్లీ డిగ్రీ కాలేజీ, కేవీఆర్‌ గవర్నమెంట్‌ బాలికల డిగ్రీ కాలేజీలను విలీనం. క్లస్టర్‌ యూనివర్సిటీగా ఏర్పాటు.  .

8. ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ లేదంటే ఆయన ద్వారా నియమించబడిన వ్యక్తిని అన్ని యూనివర్సిటీల్లో ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా నియమించేందుకు వీలును కల్పిస్తూ వర్సిటీ చట్టంలో సవరణ.  

9. ఆంధ్రప్రదేశ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ చట్టంలో సవరణ.  

10.  ఆంధ్రప్రదేశ్‌ ట్యాక్స్‌ ఆన్‌ ప్రొఫెషన్స్, ట్రేడ్స్, కాలింగ్స్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ చట్టంలో సవరణ.

11. ఆంధ్రప్రదేశ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ (ఏపీసీఎస్‌) చట్టం 1964లో సెక్షన్‌ 21–ఎ (1) (ఇ) సవరణ.
Tags:    

Similar News