తన పర్మినెంట్ అడ్రస్ ను ట్రంప్ ఎందుకు మార్చుకున్నారు?

Update: 2019-11-02 04:47 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి.. ఆయన ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అన్న విషయం గురించి.. ఆయనకున్న సంపద గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అలాంటి ఆయన.. తాజాగా తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎంత సంపన్నుడైనా.. కొన్ని విషయాల వరకూ వచ్చేసరికి సగటు జీవిలానే వ్యవహరిస్తారన్న మాట తాజా ఎపిసోడ్ ను చూస్తే అర్థం కాక మానదు.

అమెరికా అధ్యక్షుల వారి అధికారిక నివాసం వైట్ హౌస్ అన్న దాన్లో ఎలాంటి మార్పు లేదు. అధ్యక్షుడు కావటానికి ముందు ఆయన న్యూయార్క్ మహానగరంలోని ట్రంప్ టవర్స్ లో ఉండేవారు. ఆయనకు న్యూయార్క్ తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది కూడా. అలాంటి ఆయన తన తాజా పర్మినెంట్ అడ్రస్ ను ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కు మార్చుకోవటం ఆసక్తికరంగా మారింది.

తాను న్యూయార్క్ ప్రజల్ని ఎంతగానో ఆదరిస్తానని.. తాను ప్రతి ఏటా పన్నుల రూపంలో మిలియన్ డాలర్లు చెల్లిస్తున్నా.. తనను రాజకీయ నేతలు చాలా ఘోరంగా చూసినట్లు పేర్కొన్నారు. కొద్ది మంది తన విషయంలో దారుణంగా వ్యవహరించారన్న ట్రంప్.. శాశ్విత చిరునామా మార్పు విషయంలో తాను తీసుకున్ననిర్ణయం తనకు బాధ కలిగించినా.. ఇదే సరైనదిగా తాను భావిస్తున్నట్లు చెప్పారు.

తన హృదయంలో న్యూయార్క్ నగరానికి ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పిన ట్రంప్.. తన పర్మినెంట్ అడ్రస్ ను మార్చుకోవటానికి కారణం.. తరచూ ఎదురవుతున్న నిరసనలేనని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి ట్రంప్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద నిరసనల్ని ట్రంప్ టవర్స్ వద్ద నిర్వహిస్తున్నారు నిరసనకారులు.

ఈ అంశం ట్రంప్ కు చిరాగ్గా మారింది. అందుకే ఆయన తన అడ్రస్ ను మార్చుకోవాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే ఆయన సతీమణి మెలానియా ట్రంప్ తన ప్రాథమిక నివాసాన్ని మాన్హాటన్ నుంచి పామ్ బీచ్ కు మారుస్తూ రెండు నెలల క్రితం నిర్ణయం తీసుకున్నారు. నిరసనలతో పాటు.. తాను భారీ ఎత్తున పన్నులు చెల్లిస్తున్నా.. తనకు పరిస్థితి అనుకూలంగా లేని న్యూయార్క్ మీద గుర్రుగా ఉన్న ట్రంప్ తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అధికారికంగా మాత్రం పర్మినెంట్ అడ్రస్ ఛేంజ్ అంశం వెనుక అసలు కారణాన్ని మాత్రం బయటపెట్టకపోవటం గమనార్హం.
Tags:    

Similar News