వల్లభనేని వంశీని వైసీపీలో ఎందుకు చేర్చుకుంటున్నారంటే..

Update: 2019-10-30 06:11 GMT
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో అందరి నోళ్లలో నానుతున్న రాజకీయ అంశంగా ఉంది. ఏపీ ప్రభుత్వంలో వంశీకి మంచి మిత్రులైన ఇద్దరు మంత్రులు ఆయన్ను జగన్ వద్దకు తీసుకెళ్లడం.. వంశీ, చంద్రబాబు మధ్య వాట్సాప్ వేదికగా లేఖలు వంటివన్నీ మూణ్నాలుగు రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే.. చంద్రబాబుకు, తెలుగుదేశానికి విధేయుడైన వంశీ వైసీపీలోకి వెళ్లడానికి.. అలాంటి నేపథ్యమున్న వంశీని వైసీపీలో చేర్చుకోవడానికి కారణాలేంటి.. బయటకు చెబుతున్న, కనిపిస్తున్న కారణాలేనా? ఇంకేమైనా ఉన్నాయా అన్నది చర్చనీయమవుతోంది. ఈ నేపథ్యంలో వంశీని చేర్చుకోవడడానికి వైసీపీ ఆసక్తి చూపడం వెనుక కీలక కారణం ఉందని సమాచారం.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని అంతా అనుకుంటున్న సమయంలో హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో టీఆరెస్ అభ్యర్థి విజయం సాధించడం జగన్‌ను ఆకర్షించిందని.. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితం ఇచ్చిన ఆత్మవిశ్వాసం కేసీఆర్‌లో ఇప్పుడు కనిపిస్తోందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ ఉప ఎన్నికలో విజయం సాధిస్తే జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న మచ్చ తొలగిపోతుందని భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసమే వంశీని రాజీనామా చేయించి వైసీపీలోకి తెచ్చి గన్నవరంలో ఉప ఎన్నిక వస్తే గెలవాలని వైసీపీ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో ఇసుక కొరత, టీడీపీ కార్యకర్తలపై వేధింపులు, ఇతరత్రా కారణాలు ఆరోపణలతో జగన్ ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత మొదలైందన్న వాదన ఒకటి వినిపిస్తోంది. వైసీపీలోనూ ఇలాంటి సందేహం మొదలైందట. అయిదు నెలల కిందటి ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ కట్టబెట్టిన ప్రజల్లో అప్పుడే అసంతృప్తి మొదలైందా అన్న అనుమానం వారిలోనూ ఉందట. అయితే... దీన్ని అనుమానంగా వదిలేయకుండా.. అలాంటి ఆరోపణలకు చాన్సివ్వకుండా ఎన్నికల్లో గెలిచి చూపించి కేసీఆర్‌లా కాన్ఫిడెన్సు బిల్డప్ చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకు టీడీపీకి పట్టుకున్న కృష్ణా జిల్లాయే సరైన ప్లేసని భావిస్తూ వంశీ ఎపిసోడ్‌కు తెరలేపినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News