చెన్నైలో దారుణం: అమెరికా నుంచి తిరిగి వ‌చ్చారు.. ప‌ని మ‌నిషి చేతిలో హ‌త‌మ‌య్యారు

Update: 2022-05-09 10:37 GMT
చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. అమెరికాలో ఉన్న కుమార్తెను చూసి.. తిరిగి స్వ‌స్థ‌లానికి చేరుకున్న దంప‌తులు..  తమతో పాటు ఉంటున్న ఇంటి పనిమనిషి చేతిలో హత్యకు గురయ్యారు. ఏమాత్రం విశ్వాసం లేని ఆ ప‌నిమ‌నిషి చేసిన దారుణానికి నిండుప్రాణాలు బ‌ల‌య్యాయి. చెన్నైలోని మైలాపూరు బృందావన్‌ గార్డెన్‌లో నివసిస్తున్న ప్రముఖ  పారిశ్రామికవేత్త, ఆడిటర్‌ శ్రీకాంత్‌ (60), ఆయన భార్య అనురాధ (55)లను వారు.. న‌మ్మ‌కంగా పెంచుకున్న డ్రైవ‌ర్ కృష్ణ దారుణంగా హ‌త‌మార్చాడు.

శ్రీకాంత్‌ తన భూములను రూ.40 కోట్లకు విక్రయించాడని తెలుసుకున్న కృష్ణ ఆ నగదు ను ఇంటిలో భద్రపరచి ఉంటాడని ఊహించి ఓ పథకం ప్రకారం భార్యాభర్తలను హతమార్చి ఆ నగదుతో నేపాల్‌కు పారిపోవాలని పథకం వేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే క‌న్న కొడుకులా చూసుకున్న ఆ దంప‌తులను బ‌లితీసుకున్నాడు.

ఏం జ‌రిగిందంటే..డ్రైవ‌ర్‌ కృష్ణ తండ్రి శ్రీకాంత్‌కు చెందిన మరో ఫామ్‌హౌ్‌సలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.  కృష్ణ మైలాపూరులోని శ్రీకాంత్‌ ఇంటిలోనే చిన్నప్పటి నుంచి పెరిగాడు. శ్రీకాంత్‌ దంపతులు అతడిని కన్నకొడుకులా పెంచడంతో పాటు అతను ఉండేందుకు తమ ఇంటి దగ్గరే ప్రత్యేక గది  కూడా కేటాయించారు.

శ్రీకాంత్‌ దంపతులు అమెరికాలో ఉన్న తమ కుమార్తె సునందను చూడటానికి గత మార్చిలో వెళ్ళారు.అక్కడి నుంచి బయలుదేరి శనివారం వేకువజామున  చెన్నై చేరుకున్నారు. అప్పటికే కృష్ణ, డార్జిలింగ్‌ ప్రాంతానికి చెందిన అతడి స్నేహితుడు రవిరాయ్‌తో కలిసి ఆ దంపతులను హతమార్చి వారి దగ్గరున్న తాళాలతో ఇంటిలో లాకర్‌ తెరచి రూ.40 కోట్లతో పారిపోవాలని పథకం వేసుకున్నారు.

ఈ క్ర‌మంలో విమానాశ్రయం నుంచి కారులో శ్రీకాంత్‌ దంపతులను మైలాపూరు నివాసానికి తీసుకెళ్ళి వారిని హతమార్చారు. అంతకంటే ముందుగా ఇంటిలో భద్రపరచిన నగలు, నగదు మూటగట్టి సిద్ధంగా ఉంచుకున్నారు. దంప‌తుల‌ను హతమార్చిన తర్వాత కారులో నెమిలిచేరిలో శ్రీకాంత్‌కు చెందిన ఫామ్‌హైస్‌ వద్ద  మృతదేహాలను పూడ్చిపెట్టారు.

ఎంత దారుణంగా చంపాడంటే..చెన్నై విమానాశ్రయం నుంచి వారిని కారులో ఇంటికి తీసుకెళ్లిన కృష్ణ, అతడి స్నేహితుడు రవిరాయ్‌ కలిసి దారుణంగా హత్య చేశారు. ఆ ఇంటి పై అంతస్థులోని గదిలో శ్రీకాంత్‌ సతీమణి అనురాధను దుడ్డుకర్రలతో హతమార్చారు. శ్రీకాంత్‌ను దిగువ అంతస్థులోని గదిలో నిర్బంధించి హతమార్చారు. రెండు నెలలుగా వేసుకున్న పథకం ప్రకారం వారిని హతమార్చిన తర్వాత రూ.40 కోట్ల కోసం లాకర్‌ తెరచి చూశారు. అందులో నగదు కనిపించకపోవడంతో అప్పటికే మూటగట్టుకున్న నగలు, నగదును తీసుకుని మృతదేహాలను పూడ్చిపెట్టి పారిపోయారు.

ఇలా బ‌య‌ట‌ప‌డింది!అమెరికా నుంచి చెన్నై వచ్చిన ఆడిటర్‌ దంపతుల నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఎలాంటి సమాచారం లేకపోడం, వారి మొబైల్‌ ఫోన్లు, కారు డ్రైవర్‌ మొబైల్‌ ఫోన్‌ స్విచాఫ్‌ చేసి ఉండటంతో సందేహించిన ఆమెరికా లో ఉన్న వారి కుమార్తె సునంద చెన్నైలోని తన స్నేహితురాలికి ఫోన్‌ చేసి తల్లిదండ్రులు క్షేమంగా ఇంటికి చేరారో లేదో తెలుసుకుని చెప్పాలని కోరింది. సునంద ఫోన్‌కాల్‌తో ఆమె స్నేహితురాలు శ్రీకాంత్‌ నివాసానికి వెళ్లి చూడగా దంపతులు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హత్యోదంతం బయటపడింది.  

ఆ తర్వాత నగర పోలీస్‌ కమిషనర్‌ ఆదేశం మేరకు ఏసీపీ కన్నన్‌ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం ఆడిటర్‌కు చెందిన కారు నంబరు, కారు డ్రైవర్‌ మొబైల్‌ నంబరు సిగ్నెల్‌ ఆధారంగా ట్రేస్‌ చేయగా, వారు కారులో ఆంధ్రప్రదేశ్‌ వైపు రోడ్డు మార్గంలో వెళుతున్నట్టు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ప్రత్యేక బృందం ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల సహకారంతో ఆ కారును ఒంగోలు టోల్‌  ప్లాజా వద్ద అడ్డగించి, అందులోని కృష్ణన్‌, రవిరాయ్‌లను అదుపులోకి తీసుకున్నారు.

కారులో ఉన్న బంగారం, వెండి నగలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ దంపతుల కిడ్నా్‌పపై మధ్యాహ్నం ఒంటి గంటకు ఫిర్యాదు చేయగా, సాయంత్రం ఆరు గంటల లోపు ఇద్దరు హంతకులను అరెస్టు చేశారు.
Tags:    

Similar News