ర‌విప్ర‌కాశ్ అరెస్ట్ కు రంగం సిద్ధం!

Update: 2019-05-13 06:18 GMT
కోరి స‌మ‌స్య‌లు మీద‌కు తెచ్చుకునేలా టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారా?  గోటితో పోయే దానిని గొడ్డ‌లి తీసుకొచ్చేలా చేసుకుంటున్నారా?  చ‌ట్ట‌బ‌ద్ధంగా.. న్యాయ‌బ‌ద్ధంగా.. త‌ర్క‌బ‌ద్ధంగా త‌న‌కే మాత్రం బ‌లం లేని విష‌యం మీద తెగే వ‌ర‌కూ తెచ్చుకున్న ఆయ‌న‌.. ఇప్పుడు మ‌రింత అవ‌మానాన్ని మూట‌గ‌ట్టుకునేలా వ్య‌వ‌హ‌రించ‌నున్నారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. సంత‌కాల ఫోర్జ‌రీ.. నిధుల దారి మ‌ళ్లింపు లాంటి ఆరోప‌ణ‌ల‌తో కేసులు ఎదుర్కొంటున్న ర‌విప్ర‌కాశ్ కు సైబ‌రాబాద్ పోలీసుల నుంచి నోటీసులు అందుకోవ‌టం తెలిసిందే. ఇప్ప‌టికే టీవీ9 మాజీ సీవోవో మూర్తి పోలీసుల ఎదుట హాజ‌రు కావ‌టం.. విచార‌ణ‌లో భాగంగా పోలీసులు అడుగుతున్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్ప‌టం చూస్తున్న‌దే.

ఇదే తీరులో ర‌విప్ర‌కాశ్ కూడా పోలీసుల ఎదుట హాజ‌రు కావాల్సి ఉంది. కానీ.. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న పోలీసుల ముందుకు హాజ‌రు కాలేదు క‌దా.. గ‌డిచిన 72 గంట‌లుగా ఆయ‌న ఆచూకీ విష‌యంలోనూ ఎలాంటి స‌మాచారం బ‌య‌ట‌కు రావ‌టం లేదు. ఇంట్లో వారికి కూడా తెలీదంటున్న ప‌రిస్థితి. ఇలాంటితీరు పోలీసుల స‌హ‌నానికి ప‌రీక్ష‌లు పెడుతున్నార‌న్న భావ‌న అంత‌కంత‌కూ పెరుగుతోంది. పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఇప్ప‌టికే ఆయ‌న‌కు రెండుసార్లు నోటీసులు జారీ చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో.. ఆయ‌న‌కు సీఆర్ పీసీ 41ఏ కింద నోటీసులు ఇవ్వాల‌ని పోలీసులు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సెక్ష‌న్ ప్ర‌కారం వారెంట్ అవ‌స‌రం లేకుండానే అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంది.

రోటీన్ విచార‌ణ‌లో భాగంగా పోలీసుల ఎదుట హాజ‌రై.. తాను చెప్పాల‌నుకున్న విష‌యాల్ని చెప్పేస్తే.. అక్క‌డితో ఇష్యూ ఒక కొలిక్కి రావ‌టంతో పాటు.. చ‌ట్టానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా ఉండేది కాదు. అందుకు భిన్నంగా ర‌విప్ర‌కాశ్ తీరు ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ వేలెత్తి చూపేలా ఉందంటున్నారు. త‌న వాద‌న‌లో న్యాయం ఉంటే.. దానిపై పోరాడాలే కానీ ఇలా దాగుడుమూత‌లు ఎందుకు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భించ‌ని ప‌రిస్థితి.

త‌న లాంటి ప‌వ‌ర్ ఫుల్ ప‌ర్స‌నాల్టీ పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రు కావ‌ట‌మా? అన్న ఇగోకి పోయి ముఖం చాటేస్తున్నారా? అన్న సందేహం క‌లుగుతోంది. ఒక‌వేళ ఇలాంటిదే అయితే.. ర‌విప్ర‌కాశ్ ఖ‌రీదైన త‌ప్పు చేస్తున్న‌ట్లుగా ఒక సీనియ‌ర్ పోలీసు అధికారి వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.  ఎంత‌టివారైనా చ‌ట్టాన్ని గౌర‌వించాల్సిందేన‌ని.. నోటీసులు ఇచ్చిన‌ప్పుడు దానికి స‌మాధానం ఇవ్వ‌టం.. హాజ‌రు కాని ప‌రిస్థితే ఉంటే.. ఆ విష‌యాన్ని చ‌ట్ట‌ప్రకారం తెలియ‌జేయాల్సిన బాధ్య‌త ర‌విప్ర‌కాశ్ మీద ఉంటుంద‌ని.. అలా చేయ‌క‌పోవ‌టం ద్వారా త‌ప్పు మీద త‌ప్పు చేసిన‌ట్లు అవుతుంద‌న్న‌మాట పోలీసు వ‌ర్గాలు చెబుతున్నాయి. పోలీసుల ఎదుట హాజ‌రుకావ‌ట‌మా? అన్న ఇగోకు ర‌విప్ర‌కాశ్ వెళితే.. పోలీసుల‌మ‌న్న ఈగోకి ఖాకీలు వెళితే ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిక‌రంగా ఉంటుంద‌న్న మాట మీడియా వ‌ర్గాల్లో వినిపిస్తోంది. మ‌రి.. ర‌విప్ర‌కాశ్ ఏం చేస్తారో కాల‌మే చెప్పాలి.


Tags:    

Similar News