బాలయ్య నిజంగానే రాజీనామా చేస్తారా ?

Update: 2022-02-05 04:45 GMT
జిల్లా కేంద్రాల ఏర్పాటు వివాదం నేపథ్యంలో అవసరమైతే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేస్తానని బాలకృష్ణ ప్రకటించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ లో భాగంగా  పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. పుట్టపర్తి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో  హిందూపురం కూడా ఒకటి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గాన్నే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని బాలయ్య అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌన దీక్ష చేశారు.

ఈ దీక్షకు ముందు జిల్లా కేంద్రంగా హిందూపురం ఎందుకు డిమాండ్ చేస్తున్నామో బాలకృష్ణ వివరించారు. అయితే బాలయ్య మరచిపోయిందేమంటే హిందూపురంలో బాలయ్య పోటీ చేయక ముందు నుండి పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్ ఉంది. సత్యసాయిబాబా శివైక్యం పొందక ముందు నుండే పుట్టపర్తిని ప్రత్యేక జిల్లాగా చేయాలనే డిమాండ్లు వినిపించాయి. హిందుపురం కంటే పుట్టపర్తే జిల్లా కేంద్రంగా అన్ని విధాలుగా మెరుగ్గా ఉంటుందనే వాదనలు కూడా బలంగానే వినబడుతున్నాయి.

ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు హిందుపురంలో ఉన్నట్లే పుట్టపర్తిలో కూడా భూములున్నాయి. కాకపోతే పుట్టపర్తిలో ఉన్న విమానాశ్రయం, రైల్వేస్టేషన్ సౌకర్యం హిందుపురంలో లేదు.  పుట్టపర్తి నుంచి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ ఉంది. సత్యాసాయిబాబు  ఉండేటప్పుడు దేశ, విదేశాల నుంచి ఎందరో ప్రముఖుల రాకపోకల కోసం విమానాశ్రయం ఏర్పాటు చేశారు. అదిపుడు కూడా చక్కగా నడుస్తోంది. సత్య సాయిబాబా కారణంగా దేశ, విదేశాల్లో పుట్టపర్తి బాగా ఫేమస్.

హిందూపురం పట్టణంతో పోల్చుకుంటే సత్య సాయి బాబా కారణంగా పుట్టపర్తి పట్టణం చాలా ప్లాన్డ్ గా తయారైంది. ఇవన్నీ ఆలోచించే ప్రభుత్వం పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేసింది. అయితే బాలయ్య రాజకీయ కారణాలతో జిల్లా కేంద్రాన్ని హిందుపురంకు మార్చాలని డిమాండ్ మొదలుపెట్టారు. అవసరమైతే రాజీనామాకు కూడా సిద్ధమంటున్నారు. ప్రభుత్వం నిర్ణయం చూస్తుంటే బాలయ్య రాజీనామా తప్పదేమో అనే అనిపిస్తోంది. మరి తాను బహిరంగంగా చెప్పినట్లు బాలయ్య రాజీనామా చేయక తప్పదేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి ఆ పరిస్థితి వస్తే బాలయ్య రాజీనామా చేస్తారా ?
Tags:    

Similar News