ల‌క్ష్మ‌ణ్ మాట‌తోనే మొత్తం మారిపోయిందా?

Update: 2019-07-17 06:01 GMT
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడిగా సుప‌రిచితుడైన ల‌క్ష్మ‌ణ్ ఇప్పుడు ఒక్క‌సారిగా హాట్ టాపిక్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంతమంది ప్ర‌య‌త్నించినా కానిది.. ల‌క్ష్మ‌ణ్ నోటి వెంట మాట వ‌చ్చినంత‌నే.. మార్పు జ‌రిగిపోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న న‌ర‌సింహ‌న్ జోరుకు బ్రేకులు వేసిన వ్య‌క్తిగా ల‌క్ష్మ‌ణ్ నిలిచిపోతారేమో.

సోనియ‌మ్మ మ‌న‌సు దోచేసి.. ఆమెకు అత్యంత విధేయుడిగా ఏపీకి గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మితులైన ఆయ‌న త‌ర్వాతి కాలంలో ఎంత‌లా బ‌ల‌ప‌డిపోయారో తెలిసిందే. రాష్ట్రం రెండు ముక్క‌లు కావ‌టం మొద‌లు.. ప‌లువురు ముఖ్య‌మంత్రుల్ని తానే ద‌గ్గ‌రుండి మ‌రీ ప్ర‌మాణ‌స్వీకారం చేయించిన స‌త్తా న‌ర‌సింహ‌న్ సొంతంగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఆయ‌న హ‌యాంలో విప‌క్ష నేత‌లు ముఖ్య‌మంత్రులు అయ్యారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎవ‌రి సీటు మారినా న‌ర‌సింహ‌న్ కుర్చీ మాత్రం మార‌ని ప‌రిస్థితి.

యూపీఏ హ‌యాంలో నియ‌మితులైన గ‌వ‌ర్న‌ర్లు అంద‌రూ ఇంటికి వెళ్లినా.. న‌ర‌సింహ‌న్ ను మాత్రం కొన‌సాగించ‌ట‌మే కాదు.. మ‌రో ట‌ర్మ్ పొడిగింపు ద‌క్కించుకున్న ఏకైక వ్య‌క్తిగా ఆయ‌న చ‌రిత్ర సృష్టించారు. సోనియమ్మకు ఎంత విధేయుడిగా వ్య‌వ‌హ‌రించారో.. అంతకు మించిన విధేయ‌త‌ను మోడీ హ‌యాంలో వ్య‌వ‌హ‌రించార‌న్న పేరుంది. సీబీఐ మాజీ బాస్ గా ఉన్న అనుభ‌వం న‌ర‌సింహ‌న్ కు బాగా క‌లిసి వ‌చ్చింద‌ని చెబుతారు. అదే ఆయ‌న్ను సుదీర్ఘ‌కాలం గ‌వ‌ర్న‌ర్ గా కొన‌సాగేలా చేసింద‌ని చెప్ప‌క‌త‌ప్పదు.

ఇదిలా ఉండ‌గా.. రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఇద్ద‌రు గ‌వ‌ర్న‌ర్లు ఉండాలంటూ ప‌లువురు ప్ర‌ముఖులు ఇప్ప‌టికే ప‌లుమార్లు విన‌త‌లు చేశారు. ఈ డిమాండ్ ను తెర మీద‌కు తెచ్చిన వారిలో అన్ని పార్టీల వారు ఉండ‌టం గ‌మ‌నార్హం. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మొద‌లు.. బీజేపీ.. కాంగ్రెస్‌.. త‌దిత‌ర పార్టీల నేత‌లున్నా మోడీ మాత్రం న‌ర‌సింహ‌న్ ను మార్చేందుకు ఆస‌క్తి చూప‌లేదు.

ఇదిలా ఉంటే.. రెండోసారి ప్ర‌ధానిగా మోడీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ల‌క్ష్మ‌ణ్.. రెండు రాష్ట్రాల‌కు ఇద్ద‌రు వేర్వేరు గ‌వ‌ర్న‌ర్లు ఉండాలంటూ డిమాండ్ చేశారు. ఆయ‌న నోటి నుంచి ఆ మాట ఏక్ష‌ణంలో వ‌చ్చిందో కానీ.. అప్ప‌టివ‌ర‌కూ ఎంత‌మంది అడిగినా.. ఆ అంశం మీద దృష్టి సారించ‌ని బీజేపీ అధినాయ‌క‌త్వం ఇప్పుడు  రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఇద్ద‌రు గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

మొన్న‌టివ‌ర‌కూ ల‌క్ష్మ‌ణ్ కు పెద్ద ఇమేజ్ లేదు. తాజాగా న‌ర‌సింహ‌న్ లాంటి జెయింట్ కు స్థాన‌భ్రంశం క‌లిగేలా చేయ‌టంలో ఆయ‌న కీల‌క‌భూమిక పోషించిన‌ట్లుగా చెబుతారు. ప్ర‌స్తుతం అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న లక్ష్మ‌ణ్ కు.. ఆయ‌న తిరిగి వ‌చ్చే స‌మ‌యానికి ఆయ‌నతో భేటీ అయ్యేందుకు పెద్ద ఎత్తున క్యూ ఉంటుంద‌ని మాత్రం చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News